దయ కలిగి ఉండడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు

దయ
Share

మీ మీద దయ చూపించిన వ్యక్తి మీకు గుర్తున్నారా ? ఇప్పుడు ఆ వ్యక్తి గుర్తు వస్తే మీరు ఎలా ఫీలవుతారు ? మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది కదా ? మీ ముఖంపై చిరునవ్వు వస్తుంది కదా. ఎదుటి వాళ్ళపై మీరు దయ చూపించిన సందర్భాలు మీకు ఎలా ఉంటాయి ? ఆ విషయంపై మీరు గర్వపడతారు.  మీ ప్రవర్తన మీకు ఆనందాన్ని,  సంతృప్తిని ఇస్తుంది కదా. దయ కలిగి ఉండడం వల్ల వచ్చిన జ్ఞాపకాన్ని కాలం కూడా చెరపలేదు. దయ యొక్క అందం అది.

విలువల అన్నిట్లో దయ గొప్పది.  అది తీసుకునే వ్యక్తి మీద,  ఇచ్చే వ్యక్తి మీద చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది.  ఒక వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని బయటకు తీసుకు వస్తుంది.  మన వేదాలు, ఎందరో గురువులు దయ పాటించమని సందేశం ఇస్తారు. మార్క్ ట్వెయిన్ దయ గురించి ఒక  అందమైన మాట చెప్పాడు. “చెవిటి వారు వినగలిగిన మరియు గుడ్డివారు చూడగలిగిన భాష దయ” . దలైలామా దయ గురించి చెప్పిన మాటలు. “నా మతం చాలా సులువైనది నా మతం దయ” . కేవలం దయ అనే ఒక విలువ మాత్రమే మన జీవితంలో ఉన్నా మన జీవితం చాలా గొప్పగా మారుతుంది.  దయ కలిగి ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రస్తుతం సైన్స్ కూడా చెప్తుంది.

దయ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. దయ కలిగి ఉండడం సెరిటోనిన్ మరియు ఎండోర్ఫిన్స్ అనే మంచి హార్మోన్ మన శరీరంలో విడుదల అవుతాయి. ఇవి మనకి ఆనందాన్ని ఇస్తాయి. మరియు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

2. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు దయ కలిగి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమీ లేదో దాని మీదికి మీ దృష్టి వెళుతుంది. దీనివలన మీకు ఉన్నదానితో సంతృప్తి పడడం అలవాటు అయి ఒత్తిడి తగ్గుతుంది.

3. దయ కలిగి ఉండడం మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దయ కలిగి ఉన్నప్పుడు ఆక్సీటోసిన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. ఇది మన రక్తనాళాలలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనాన్ని బయటికి పంపుతుంది. ఆక్సిటోసిన్ ని గుండెను కాపాడే హార్మోన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ ని మన శరీరంలో విడుదల అయ్యేలా చేసేది దయ.

4. దయ వలన ఆందోళన, బాధ తగ్గుతుంది.

5. దయ చూపించడం వల్ల ఒక వ్యక్తి డిప్రెషన్ నుండి బయటపడతారు.

6. మనలో చాలామంది ఈ జీవితానికి అర్థం ఏంటి అని వెతుకుతూ ఉంటారు. దానికి సమాధానం ఉంది.  మీరు దయ చూపించడం అలవాటు చేసుకుంటే జీవితానికి ఉన్న అర్థం తెలుస్తుంది.

7. ఇది రిలేషన్ షిప్ ని మెరుగుపరిచి జీవితంలో అందమైన క్షణాలని సృష్టిస్తుంది.

8. దయ కలిగి ఉండడం మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీ గురించి మీరు గొప్పగా అనుకునేలా చేస్తుంది.

9. దయ మీ మూడ్ ని ఆనందకరంగా మారుస్తుంది.

10. దయ వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వయసు పెరగడం తగ్గుతుంది.

11. దయ కలిగి ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవి.  మీ ఇంటి వద్ద, మీరు పనిచేసే చోట, మీరు ఎక్కడికి వెళ్ళినా దయ కలిగి ఉండండి. దయ చూపించడానికి కారణం అవసరం లేదు.  ఎప్పుడైనా, ఎక్కడైనా దీనిని మీరు సాధన చేయవచ్చు.  మన ఆలోచనల ద్వారా మన ఎమోషన్స్ ద్వారా మన పనుల ద్వారా దయ చూపించండి.

మన రోజువారీ జీవితంలో దయ మన పనులలో భాగంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.

1. ఇంటి పనిలో మీ కుటుంబ సభ్యులకి సహాయం చేయండి.

2. వీధిలో ఉన్న జంతువులని పట్టించుకోండి

3. మీ బాల్కనీలో దాహంతో వచ్చే పక్షుల కోసం నీళ్లు పెట్టండి.

4. చిన్న చిన్న వ్యాపారుల దగ్గర బేరం ఆడకుండా వాళ్ళకి సపోర్ట్ చేయండి.

5. మీ కమ్యూనిటీలో మీ సమయాన్ని ఏదైనా పనికి వాలంటీర్ గా ఉపయోగించండి.

6. అవసరం ఉన్నప్పుడు మీ ఇరుగు పొరుగు వారికి సహాయం చేయండి.

7. అవసరంలో ఉన్న స్నేహితుడికి సహాయం చేయండి.

8. ఒక మొక్క నాటి అది పెరిగే దాకా జాగ్రత్తగా కాపాడండి.

9. ఎవరికైనా రోడ్డు దాటడానికి సహాయం చేయండి.

10. వృద్ధాశ్రమానికి వెళ్లి కాసేపు సమయం గడపండి.

11. వికలాంగులకు సహాయం చేయండి.

12. మంచి టిప్ ఇవ్వండి.

13. పిల్లల చదువుకి స్పాన్సర్ చేయండి.

14. మీ తల్లిదండ్రులతో సమయం గడపండి.

15. పక్షులకు, జంతువులకు ఆహారం ఇవ్వండి.

16. అందరినీ నవ్వుతూ పలకరించండి.

17. అనాధ ఆశ్రమానికి వెళ్లి కాసేపు పిల్లలతో గడపండి.

18. ఎవరినైనా నవ్వించండి.

19. మీ తోబుట్టువులతో సమయం గడపండి.

20. మీ దగ్గర ఉన్న వాటిని అవసరంలో ఉన్న వారితో పంచుకోండి.

21. ఏదైనా ఒక పనికి డబ్బు డొనేట్ చేయండి.

మనం మాట్లాడే మాటల ద్వారా మన రోజువారీ జీవితంలో దయని ఎలా సాధన చేయాలి ఇప్పుడు చూద్దాం.

1. మీ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించండి.

2. మీతో పని చేసే వారికి మీ అభినందనలు పంపండి.

3. జీవితంలో కష్టాల్లో ఉన్న వారికి మీ సమయాన్ని ఇచ్చి వారిలో స్ఫూర్తి నింపే మాటలు చెప్పండి.

4. మీ జీవితాన్ని పాజిటివ్ గా ప్రభావం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ మాటలను పంపండి

5. మీకు తెలియని వారినైనా మెచ్చుకోండి.

6. మీ ఇంటి పని చేసే వ్యక్తిని అభినందించండి.

మన రోజువారీ జీవితంలో మన ఆలోచనల ద్వారా, ఎమోషన్స్ ద్వారా దయ ఎలా సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం

1. ఇతరుల గురించి పాజిటివ్ గా ఆలోచించండి.

2. మీ కుటుంబ సభ్యుల విషయంలో ప్రేమ పూర్వక ఆలోచనలు కలిగి ఉండండి.

3. ప్రేమ-దయ మెడిటేషన్ సాధన చేయవచ్చు. ఈ విధంగా చెయ్యాలి.

1. సౌకర్యవంతంగా కూర్చోండి. మీ కళ్ళు మూసుకోండి.

2. గాఢంగా ఊపిరి తీసుకోండి. గాలి వదలండి. మీ మొత్తం శరీరాన్ని రిలాక్స్ కావాలి. ఇప్పుడు మీ శరీరం అంతా తేలికగా ఉంది.

3. మీకు ఆనందాన్ని ఇచ్చే ఏదైనా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆ ఆనందాన్ని మీ గుండెల నిండా నింపుకొని, ఆ సందర్భాన్ని మీకు ఇచ్చినందుకు దైవానికి మీ కృతజ్ఞతలు తెలియజేయండి.

4. దీవిస్తూన్నట్టుగా మీ చేతులు పెట్టండి. ప్రేమని, ప్రశాంతతని మీ కుటుంబ సభ్యులకు పంపండి.  ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించండి.

5. ప్రేమని, ప్రశాంతతని మీరు ఉన్న ప్రదేశం మొత్తానికి పంపించండి

6. ప్రేమని, ప్రశాంతతని మీ నగరానికి పంపించండి

7. ప్రేమని, ప్రశాంతతని మీ రాష్ట్రానికి పంపించండి

8. ప్రేమని, ప్రశాంతతని మీ దేశానికి పంపించండి.

9. ప్రేమని, ప్రశాంతతని ఈ ప్రపంచానికి పంపించండి.

10. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ఆరోగ్యంతో సమృద్ధిగా, ఆనందంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఊహించండి.

11. మెల్లగా మీ చేతులని మీ ఒడిలో పెట్టుకోండి.

12. 30 సెకన్లు నిశ్శబ్దంగా కూర్చుని మీతో మీరు కనెక్ట్ అవ్వండి.

13. మీరు ప్రేమతో, దయ తో నిండి ఉన్నట్టు ఊహించుకోండి. దయ మీ తల భాగం నుండి మీ శరీరం లోనికి ప్రవహించి మీ శరీరంలోని ప్రతి అణువులో నిండినట్లు ఊహించుకోండి.

14. మీ మొత్తం శరీరం ఆరోగ్యంతో, ఆనందంతో, ప్రేమతో, కరుణతో మరియు బలంతో నిండినట్టు ఊహించుకోండి. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించుకోండి.

15. మీ కాళ్లు చేతులు కదపండి. మీ చేతులను రుద్దుకొని మీ కళ్ళపై పెట్టుకుని మీ ముఖాన్ని మెల్లగా రుద్దుకొని పెద్ద నవ్వుతో కళ్ళు తెరవండి

మన రోజువారీ జీవితంలో దయ కలిగి ఉండడానికి కొన్ని మార్గాలు ఇవే.  మీరు నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ ఎమోషన్స్ తో ఉన్నప్పుడు దయకు సంబంధించిన పని ఏదైనా చేయండి.  లేదా మెడిటేషన్ చేయండి. దయ మన మూడ్ ని ఆనందకరంగా మారుస్తుంది.  కాబట్టి దయని అలవాటు చేసుకోండి.  దయ కలిగి ఉన్న ఒక పని వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు పాజిటివ్ గా మారుస్తారు.  దయతో చేసిన ఏ పని చిన్న పని కాదు.

“Remember there’s no such thing as a small act of kindness. Every act creates a ripple with no logical end.” – Scott Adams

Registration

Forgotten Password?

Loading