కరోనా వైరస్ అనే ఈ విపత్తు మొత్తం ప్రపంచం యొక్క ముఖచిత్రాన్ని మార్చేసింది. ప్రపంచాన్ని కరోనా ముందు కరోనా తర్వాత అని విభజించినా అతిశయోక్తి కాదు. ఇది అంత ప్రభావం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు గురించి ఒక అనిశ్చితి నెలకొంది. భయం మరియు డిప్రెషన్ తీసుకువచ్చింది. ఈ వైరస్ ప్రపంచాన్ని శారీరకంగా, ఎమోషనల్ గా, మానసికంగా, ఆర్థికపరంగా నెగెటివ్ గా ప్రభావం చూపించింది. థియేటర్ లో సినిమా చూడండం లేదా కుటుంబ సభ్యులతో ఒక పెళ్ళికి వెళ్ళడం చాలా పెద్ద విషయం అని కొన్నాళ్ళ ముందు ఎవరూ అనుకోలేదు. కరోనా మన జీవితాల్ని ప్రభావితం చెయ్యడం మాత్రమే కాదు. మన ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
కరోనా మనకి నేర్పిన కొన్ని పాఠాలు ఇప్పుడు చూద్దాం
1. దృఢమైన వ్యాధినిరోధకశక్తిని నిర్మించుకోండి – కరోనా వైరస్ కి ముందు మామూలు వ్యాధినిరోధకశక్తి ఉన్నా మన శరీరం తట్టుకునేది. ఇప్పటిలా వ్యాధి నిరోధక శక్తి అంత ముఖ్యమైనది కాకుండా ఉండేది. కానీ ఈ విపత్తు మనం బతికి ఉండాలి అంటే బలమైన వ్యాధినిరోధకశక్తి ఉండాలి అని మనకు నేర్పింది. ఇప్పుడు కచ్చితంగా ప్రతి వ్యక్తికి బలమైన వ్యాధినిరోధకశక్తి ఉండాల్సిందే. ఇది అత్యవసరం. కాబట్టి ఇప్పుడే మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం శ్రద్ధ పెట్టాలి. మన వ్యాధి నిరోధక శక్తి దృఢంగా మారడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. కూరగాయలు, పళ్ళు మరియు నట్స్ వంటి పోషకాహారం తీసుకోండి.
2. ప్రోసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచే రసాయనాలు ఉన్న పదార్థాలు తీసుకోకండి.
3. ప్రతి రోజు వ్యాయామం చేయండి.
4. ఒత్తిడిని తగ్గించుకోండి.
5. మెడిటేషన్ చేయండి.
6. రోజు సన్ లైట్ లో కాస్తయినా గడపండి.
7. ప్రకృతిలో గడపండి.
8. ప్రతిరోజు ఎనిమిది గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా జాగ్రత్త పడండి.
2. జీవితానికి ఉపయోగపడే పనులు నేర్చుకోండి : వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం వంటివి కనీస అవసరాలు. పనివాళ్ళు లేకపోయినా, వంటచేసే వారు లేకపోయినా మన రోజువారీ జీవితం ఇబ్బంది పడకూడదు అంటే ఇవి కచ్చితంగా వచ్చి ఉండాలని ఈ విపత్తు మనకు నేర్పింది. ఆడవాళ్ళు అయినా, మగవాళ్లు అయినా ఇలాంటి కనీస పనులు నేర్చుకోవాలి. వీటి వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ఉంటాము.
3. సేవింగ్స్ ఉంచుకోండి : మూడు నుంచి నాలుగు నెలల వరకు మనకే ఆదాయం లేకపోయినా ఆసరా ఉండేవిధంగా సేవింగ్స్ ఉండాలని ఈ విపత్తు మనకు నేర్పింది. ఏ నెల డబ్బులు ఆ నెల ఖర్చు చేస్తూ జీవించడం చాలా ప్రమాదకరం. ఉద్యోగం పోయినా లేదా ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి ఎప్పుడూ ఒక మంచి సేవింగ్స్ ఉండేలా చూసుకోండి. క్రమపద్ధతిలో సేవింగ్స్ పెంచుకోండి.
4. కుటుంబం ముఖ్యం : ఈ లాక్ డౌన్ వల్ల మనమందరం ఇంటికే పరిమితమయ్యాము. మనం కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడిపాము. ఎలాంటి సందర్భంలోనైనా మనతో ఉండేది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే అని ఈ విపత్తు మనకు నేర్పింది. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీ రిలేషన్ షిప్ ని మెరుగుపరచుకోండి. స్నేహితులు, మీ తోటి పనిచేసేవారు కూడా ముఖ్యమే. కానీ కుటుంబం అందరి కన్నా ముఖ్యం.
5. ఒక హాబీ కలిగి ఉండండి : లాక్డౌన్ వల్ల, థియేటర్లు మాల్స్ మూసి వేయడం వల్ల కనీస ఎంటర్టైన్మెంట్ లేదు. టీవీ మరియు యూట్యూబ్ లో కూడా తక్కువ మొత్తంలో కంటెంట్ ఉంటుంది. రీడింగ్, పెయింటింగ్, డాన్స్ ఇలా ఏదైనా హాబీ ఉంటే తప్ప ఇంట్లో ఆహ్లాదకరమైన పని చేసే అవకాశం లేదు. కాబట్టి కాస్త సమయం తీసుకుని మీ హాబీలు కొనసాగించండి. మీ హాబీ వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటం వీలవుతుంది.
6. మీ మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి : ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జబ్బు కన్నా మన మానసిక స్థితి ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. జబ్బు వస్తుందేమో అనే భయం, ఉద్యోగం పోతుందేమో అని భయం, భవిష్యత్తు మీద భయం. ఏదైనా మెడిసిన్ లేదా వ్యాక్సిన్ వస్తుందో లేదో ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ఎంత బలమైన వ్యక్తి అయినా భయం, డిప్రెషన్ కి లోనవుతారు. కాబట్టి మన మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మెడిటేషన్, యోగ, ప్రాణాయామం ఇలాంటివి నేర్చుకుని మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
7. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడండి: మన జీవితాల్లో కరోనా వైరస్ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఇది. ఆఫీసు వాతావరణం, ఇంటి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆఫీస్ లో మీతో పనిచేసే వారు మీ చుట్టూ ఉంటారు. సౌకర్యవంతమైన వాతావరణం. మంచి కుర్చీ, టేబుల్, క్యాంటీన్ ఇవన్నీ ఆఫీస్ లో ఉంటాయి. ఒక కంపెనీ ఒక సౌకర్యవంతమైన పని ప్రదేశం ఉండేవిధంగా ఎంతో వ్యయం పెట్టి డిజైన్ చేస్తారు. ప్రస్తుతం ఇంటి నుండే పని చేయడంవల్ల ఎలాంటి సౌకర్యాలు ఇంటివద్ద ఉండవు. కాబట్టి మీరు పని చేసే విధానం ఉండేవిధంగా మీ ఇంటి వాతావరణాన్ని సౌకర్యవంతంగా మీరే మార్చుకోవాలి.
8. శుభ్రత యొక్క ప్రాముఖ్యత : ఇలాంటి పరిస్థితులలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. శానిటైజర్ వాడుతూ , సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బయటికి వెళ్ళినప్పుడు మాస్కు ధరిస్తూ జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మన కుటుంబ సభ్యులను ఈ వ్యాధి నుంచి కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం అని కరోనా వైరస్ మనకు నేర్పింది
9. జీవితం ఎవరు ఊహించలేరు : జీవితాన్ని ఎవరు ముందే ఊహించలేరు అని కరోనా వైరస్ మనకి నేర్పుతుంది. రాబోయే ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం లేదా పదేళ్లలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మనకి మన చేతుల్లో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. నీకు లక్ష్యాలు ఉంటే ఈ క్షణమే వాటి కోసం పని చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజే చెయ్యండి. రేపటి మీద భరోసా లేదు. మనకు ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే.
10. కృతజ్ఞత కలిగి ఉండండి : చాలాసార్లు మనం జీవితంలో ఉన్న ఆనందాన్ని పట్టించుకోము. ఈ కరోనా వైరస్ వల్ల జీవితంలో మనకున్న అదృష్టం ఏమిటో తెలిసి వచ్చింది. పారిశుద్ధ్య పనివారు, డాక్టర్స్, పోలీసులు, జర్నలిస్టులు, మాల్స్, థియేటర్స్ యాక్టర్స్, రెస్టారెంట్లు వీళ్లంతా మన జీవితంలో ఎంత ముఖ్యమో మనకు అర్థం అయింది. మనమందరం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించే వాళ్లం అని మనకు అర్థమైంది.
కరోనా వైరస్ మనకు నేర్పిన పాఠాలు ఇవే.
మనందరం ఒకటే. చైనాలో జరిగినది ఎక్కడో మారుమూల ఇండియాలో ఉన్న ఒక చిన్న గ్రామాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో జరిగిన విషయం ఇటలీలో ఉన్న పట్టణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే విధంగా మనము, మన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి.