వృద్ధాప్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. వృద్ధాప్యం ఎన్నోరకాల సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని, నిద్రలేమిని మొదలగు వాటిని తీసుకువస్తుంది. ఈ సమయంలోనే పెద్ద వాళ్ళకి ఒక ఆసరా కావాలి. ప్రేమ కావాలి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేవాడు కావాలి. పిల్లల నుండి ఆర్థిక భద్రత కావాలి. ఇవి పిల్లల నుండి ఆశించడం తప్పుకాదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా భాగం పిల్లల కోసమే కష్టపడతారు. వాళ్లకి తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు పిల్లల మీద ఆధారపడాలి అనుకోరు. వాళ్లకి ఏ దారి దొరకనప్పుడు పిల్లలపై ఆధారపడతారు. అది వాళ్ల అపరిమిత ప్రేమకి తార్కాణం. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ అందరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోరు. ఒక ఒంటరి తల్లి లేదా తండ్రి ఇద్దరు పిల్లల్ని పెంచగలరు. కానీ ఇద్దరు పిల్లలు ఒక తల్లిని లేదా తండ్రిని చూసుకోలేరు. దానికి వాళ్లకి ఎన్నో కారణాలు ఉండవచ్చు వాటిలో కొన్ని ఇవి.
1. ఆర్థికపరమైన ఖర్చులు
2. భార్య కి మరియు తల్లిదండ్రులకి మధ్య సమస్యలు
3. సమయం లేకపోవడం
4. శ్రద్ధ లేకపోవడం
5. కృతజ్ఞత లేకపోవడం
పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం మన చుట్టూ ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇది చాలా విషాదకరమైన విషయం. వృద్ధాప్యంలో వారికి ఆర్థిక దన్నులేకపోవడం, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడలేని సమయంలో వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల కనీస ధర్మం .
అసలు వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు చూసుకోవాలి అని ఎవరైనా అడగొచ్చు. వాటికి కారణాలు ఇవి.
1. పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు కనీసం ఇరవై సంవత్సరాలు కష్టపడతారు. వాళ్ల చదువులు గురించి, వాళ్లకి పెళ్లి చేయడానికి, ఇలా పిల్లల కోసం ఎంతో చేస్తారు. పిల్లలకు అవసరమైన ప్రతి సారి తల్లిదండ్రులు వాళ్లకి తోడుండి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుతారు.
2. పిల్లల కోసం వాళ్ళ కోరికల్ని, వాళ్లు దాచుకున్న డబ్బులని, సమయాన్ని ఆఖరికి నిద్రని కూడా త్యాగం చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు. పిల్లల అవసరాలు తీర్చడం కోసం వాళ్ళ కోరికల్ని వదిలేసుకున్నారు. పిల్లల్ని పెంచడానికి వాళ్ళు సర్వం త్యాగం చేస్తారు.
3. వృద్ధాప్యంలో తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవడం పిల్లలకు కనీస ధర్మం అని మన పురాణాలు చెబుతున్నాయి.
4. మనం ఏదైతే ఇస్తామో మనకి అది తిరిగి వస్తుందని కర్మసిద్ధాంతం. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ కర్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మన పిల్లలు మనల్ని అలానే వదిలేస్తారు. వృద్ధాప్యాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మనందరం దానిని ఎదుర్కోవాల్సిన వాళ్ళమే. మన వృద్ధాప్యం బాగుండాలంటే ఇప్పుడు మన తల్లిదండ్రులని పట్టించుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న పనుల ద్వారానే మన భవిష్యత్తుని మనం నిర్మించుకుంటాం.
5. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం మన తల్లిదండ్రులని సరిగా చూడకపోతే వాళ్లు కూడా పెద్దయిన తర్వాత పట్టించుకోనవసరం లేదు అనుకుంటారు. వాళ్లు మనం ఏం చేస్తే అదే చేస్తారు. కాబట్టి మనం వాళ్ళకి ఒక సరైన మాదిరిగా ఉండాలి.
6. తల్లిదండ్రులు మాకు ఏమీ చేయలేదు. మేమెందుకు వాళ్ళను పట్టించుకోవాలి, అని కొంతమంది అడగొచ్చు. తల్లిదండ్రులు మీకోసం ఏం చేసినా, చేయకపోయినా అన్నిటికంటే అతి విలువైన ఈ జీవితాన్ని మీకు ఇచ్చారు. మనం డబ్బు సంపాదించగలం, జీవితాన్ని ఆనందంగా గడపడగలం ఎందుకంటే మనకి ఈ భౌతిక రూపం ఉంది కాబట్టి. ఈ రూపాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే కదా. ఈ ఒక్క కారణం చాలు వాళ్ళని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవడానికి.
7. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మనం నడవలేము. మనకి కనీసం ఎలా తినాలో కూడా తెలీదు. మనకి కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా రాదు. అలాంటి సమయంలో కూడా వాళ్లు మనల్ని పెంచి పెద్ద చేశారు.
8. మనం జీవితంలో సాధించిన విజయానికి కారణం మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులకి చదువు ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, మన విజయానికి కారణం వాళ్లే. అందరు తల్లిదండ్రులు ఉండే ఒక లక్షణం ఉంటుంది. ఏం చేసైనా పిల్లల్ని బాగా పెంచాలనే కోరిక.వాళ్ల పిల్లలు జీవితంలో విజయవంతం కావాలని ఆరాటం. ఆ అవధులు లేని ప్రేమ నిరంతరం వాళ్ళు ఇచ్చే మద్దతు ఆశీర్వాదాలు మనం విజయం సాధించడానికి ప్రధాన కారణాలు.
9. పిల్లల్ని కనడానికి తల్లి ఎంతో కష్టపడుతుంది. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది తల్లికి పునర్జన్మ లాంటిది. ఆ సమయంలో అంతటి బాధను భరిస్తారు. డెలివరీ సమయం లోనే కాదు 9 నెలలు మోయడానికి ఎన్నో రకాల సమస్యల్ని భరిస్తారు. నిద్ర లేకపోవడం శ్వాస సరిగా తీసుకోలేకపోవడం ఒళ్ళు నొప్పులు జీర్ణ సమస్యలు ఇవన్నీ భరిస్తారు. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఇంత కష్టపడుతుంది.
10. ఒక వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తించే పోవడం పాపం. కాబట్టి తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం పాపం తో సమానం. ప్రతి చేసే పనికి కచ్చితంగా మనం అనుభవిస్తాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు పట్టించుకోవాలి అనే డానికి కొన్ని కారణాలు ఇవి. భార్యకి మరియు తల్లిదండ్రులకు మధ్య కొన్ని గొడవలు రావడం సహజం. పిల్లలతోనే గొడవలు వస్తాయి. అలాంటిది కోడలితో రావడం పెద్ద కొత్తేమీ కాదు. బంధాలలో గొడవలు చాలా సహజం వాటిని కారణంగా చూపించి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదు. మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినట్టే మన భార్యకి లేదా భర్తకి వాళ్ల తల్లిదండ్రులు కూడా అలానే చేశారు. వారు లేకపోతే భార్య లేదు భర్త లేడు. ఈ జన్మలో అత్తమామలు గత జన్మలో తల్లిదండ్రులు అంటారు. కాబట్టి వాళ్ళని వేరుగా చూడకండి. ఇద్దరి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలకి మంచి మాదిరిగా ఉండండి.
ఆర్థిక పరమైన విషయాలకి వస్తే తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలకి కొంత డబ్బు అవుతుంది. మన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకోండి. వాళ్ల కష్టమే ఈరోజు మనం డబ్బు సంపాదించేలా చేస్తుంది. కాబట్టి వాళ్ల మందుల ఖర్చుకి ఆలోచించకండి. ఈ రోజుల్లో మనకి సమయం కుదరట్లేదు కానీ ఆ కారణం చేత తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఉండకండి. మన వినోదాలకి, విలాసాలకు ఫంక్షన్ కి వీటన్నిటికీ సమయం ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూసుకోవడానికి కాస్త సమయం లేదా ఖచ్చితంగా ఉంటుంది. దానికి కాస్త ప్లానింగ్ అవసరం అంతే.
కాబట్టి ఏ కారణం చేతనైనా మీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండకండి. ఇది మన కనీస ధర్మం మన పురాణాలు తల్లిదండ్రులను గురువుకన్నా పై స్థానంలో ఉంచుతాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటారు. తల్లిదండ్రులు దైవంతో సమానం అని మన సంస్కృతి చెబుతుంది. మన తల్లిదండ్రులు ని జాగ్రత్తగా చూసుకుని ఈ ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మారుద్దాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రేమ, ప్రశాంతత దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.