పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి 11 సూచనలు

పెద్దవాళ్ళు
Share

వయసు పెరగడం అనేది జీవితంలో ఒక భాగం. దానినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనమందరం ఏదో రోజు వృద్ధాప్యాన్ని చూడవలసిన వాళ్ళమే. వృద్ధాప్యం అనేది చాలా సమస్యలు తెస్తుంది. వాటిని చాలా సున్నితంగా పరిష్కరించాలి. మనలో చాలామందికి ఇలా వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులు లేదా తాతయ్యలు, నానమ్మలు ఉంటారు. వాళ్లకి మన అవసరం ఉంటుంది.  వాళ్లు తమ జీవితాన్ని అంతా మనం బాగుండడానికి ఖర్చు చేశారు. మనం ఆనందంగా ఉండడానికి వాళ్ళ నిద్రని, డబ్బుని, ఎనర్జీని, సమయాన్ని త్యాగం చేశారు.

మనం ఏం చేసినా  వాళ్ళు చేసిన దానికి రుణం తీర్చుకోలేము. రామాయణంలో అంధులైన తన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకునే శ్రవణ కుమార గురించి  మనం చదువుకున్నాం.  వాళ్ళ కోరిక తీర్చడానికి వాళ్ళని భుజాలపై మోసుకుంటూ వెళ్తాడు శ్రవణ కుమార.  అలాగ మనం కూడా మన తల్లిదండ్రులని జీవితాంతం మన భుజాలపై మోసినా వాళ్ళు మనకి చేసినదానికి అది సరిపోదు.

వాళ్ళకి మనం చేయగలిగిన ఒకే ఒక చిన్న పని వృద్ధాప్యంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం.  అది మన బాధ్యత. కేవలం బాధ్యత మాత్రమే కాదు, వాళ్ల మీద మన కృతజ్ఞతలు చూపించే ఒక చిన్న అవకాశం కూడా.

కాబట్టి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో  కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మనసు విప్పి మాట్లాడండి : పెద్దవాళ్లు మనుషులతో మాట్లాడాలి అనుకుంటారు. వాళ్లతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడండి.  వాళ్ల అవసరాలు, ఇష్టాలు, కోరికలు వాళ్లకి నచ్చనివి తెలుసుకోండి.  మనం ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాం.  కానీ కాస్త సమయం తీసుకుని వాళ్లతో మాట్లాడండి.  మాట్లాడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు.  మీరు ఏం మాట్లాడుతున్నారు ఎంత మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం కాదు.  మీరు ప్రతిరోజు మాట్లాడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం.  వీలైతే హత్తుకుని మాట్లాడండి.

2. వాళ్ల సౌకర్యాల్ని పట్టించుకోండి : వృద్ధాప్యంలో వచ్చే సమస్యల కారణంగా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉండవచ్చు. వాటిని మీరు పట్టించుకుని  వాళ్ళకి కావలసినవి అందేలా చేయండి.  కొన్నిసార్లు మీకు అనవసరంగా శ్రమ ఎందుకు అని వాళ్ళు చెప్పడం మానేస్తారు.  వాటిని తెలుసుకుని ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసినందుకు ఈ చిన్న సౌకర్యం వాళ్లకి ఇవ్వడం మీ బాధ్యత.

3. వాళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోండి : వృద్ధాప్యం అనేది జీవితంలో పెద్ద మలుపు. దానిని జీర్ణించుకోవటం చాలా కష్టం. బలం లేకపోవడం, వయసు తాలూకు ఆరోగ్య సమస్యలు, స్వతంత్రం లేకపోవడం, మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వృద్ధాప్యం లో వచ్చే సమస్యలు. వీటివల్ల వాళ్ళు చిరాకుగా, నిరాశతో కొన్నిసార్లు కోపంగా కూడా ఉంటారు. వాళ్ళ మూడ్  ఎప్పుడూ  మారుతూ ఉంటుంది. వాళ్లని అపార్థం చేసుకునే ముందు వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

4. ఓపిగ్గా వినండి : పెద్ద వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ జీవితంలో చూసిన ఎత్తుపల్లాలని మీతో పంచుకోవాలి అనుకుంటారు. వాళ్ళు జీవించిన అద్భుతమైన జీవితాన్ని చెప్పాలి అనుకుంటారు.  వాళ్ల దగ్గర కథలు ఉన్నాయి, వాళ్లకి ఇప్పుడు ప్రేక్షకులు కావాలి.  కొన్ని సార్లు వాళ్ళు చెప్పిందే చెప్పవచ్చు.  అది వాళ్ల జీవితం మీద ఉన్న ప్రేమ.  మీరు ఓపిగ్గా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి.  వాళ్ళ కథలు మీకు పాఠాలు నేర్పుతాయి.

5. స్వేచ్ఛ ఇవ్వండి : వాళ్లకి నచ్చినట్టు వాళ్ళు జీవించడానికి స్వేచ్ఛ ఇవ్వండి. వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళని జీవించనివ్వండి.  రోజు రకరకాల టైంలో నిద్రలేస్తారు.  రకరకాల టైంలో పడుకుంటారు.  ఇవన్నీ వాళ్ల తీసుకునే మందుల వల్ల ఇంకా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి.  రోజు ఒకే పనిచేయడం సౌకర్యంగా ఉండకపోవచ్చు.  కాబట్టి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించకండి.  వాళ్ళని స్వేచ్ఛగా ఉండనివ్వండి.

6. వాళ్ల జ్ఞానానికి గౌరవం ఇవ్వండి : వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఉంటారు. వాటి నుంచి వాళ్లు ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించి ఉంటారు. గతంలో వాళ్లు కూడా ఇప్పుడు మనలాగే ఉండి ఉంటారు.  మనలాగే భయాలు, అపనమ్మకాలు చూసి ఉంటారు.  కాబట్టి వారి జ్ఞానాన్ని గౌరవించండి.  వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి.  వాళ్లని సలహాలు అడగండి.  మీరు వాళ్లకి ఎంత విలువ ఇస్తారో తెలిసేలా చేయండి.  ఇంటి విషయాలు వాళ్ళతో మాట్లాడి సలహాలు తీసుకోండి.

7. వాళ్లకి పనులు చెప్పకండి : పెద్ద వాళ్ళు వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, చిన్న పిల్లల్ని చూసుకోవడం లాంటి పనులు చేయలేరు. అది వాళ్ళకి చాలా పెద్ద శ్రమ.  వాళ్ళ నుండి ఇలాంటి పనులు ఆశించకండి వాళ్లకి ఎలాంటి బాధ్యతలు అప్పగించడకండి.  ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు దానిని చేయలేరు.  వాళ్ళ శరీరం దానికి సహకరించదు.  వాళ్లు చేయాల్సినంత ఎప్పుడో చేసేశారు.  కాబట్టి వాళ్ళకి ఎక్కువ పనులు చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించండి.

8. వాళ్లకి కావాల్సిన వినోదాన్ని పంచండి : వృద్ధాప్యంలో పెద్ద వాళ్ళకి ఆనందంగా గడపడానికి కావలసిన బలం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా మీరే చూడాలి. ఒకవేళ వాళ్ళకి పుస్తకాలు చదవడం ఇష్టమైతే కొన్ని కొత్త పుస్తకాలు కొన్ని వాళ్ళకి ఇవ్వండి. సినిమాలు చూడడం ఇష్టమైతే ఒక మంచి సినిమాకి తీసుకు వెళ్ళండి. వాళ్ళకి ప్రయాణాలు ఇష్టమైతే ఒక మంచి టూర్ ప్లాన్ చేయండి.  ఆనందంగా ఉండగలిగేది ఏదైనా చేయండి.  వాళ్ళ కోరికలు,  ఇప్పటివరకు బాధ్యతల వల్ల వాళ్ళు చేయలేకపోయినవి నెరవేర్చండి.

9. వాళ్లని అంగీకరించండి : వృద్ధాప్యంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. వాళ్లు మార్పుని ఒప్పుకోరు. వాళ్లకి తెలిసిన దానికే కట్టుబడి ఉంటారు.  కాబట్టి వాళ్ళని అంగీకరించండి.  ఒక సమయం తర్వాత వాళ్ళ ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం ఎవరికైనా చాలా కష్టం.  కాబట్టి మీ అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకండి.

10. ఆర్థిక పరంగా సిద్ధంగా ఉండండి : వృద్ధాప్యంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి మందుల అవసరం ఉంటుంది.  దానికి అవసరమైన డబ్బు  ఉండే విధంగా మీ ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోండి.

11. ఆధ్యాత్మికతకి వాళ్ళని పరిచయం చేయండి: ఆధ్యాత్మికత వల్ల జీవితాన్ని అంగీకరించడం తెలుస్తుంది. వృద్ధాప్యంలో వాళ్లని ఆధ్యాత్మికతకు పరిచయం చేస్తే మీరు చాలా మంచి పని చేసిన వారు అవుతారు. ధ్యానం చేయడం నేర్పండి.  ధ్యానం వల్ల భయం, ఆందోళన,  మానసిక సమస్యలు అన్ని దూరం అవుతాయి.  వాళ్ళు ఆనందంగా ఉండడానికి భగవంతుడిని ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఇది.

వృద్ధాప్యంలో పెద్ద వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇవి కొన్ని సూచనలు.  జీవితాంతం స్వేచ్ఛగా బలంగా బతికిన తర్వాత ఒకరి మీద ఆధారపడడం అనేది చాలా కష్టం.  కానీ వృద్ధాప్యంలో అదే జరుగుతుంది.  70, 80 సంవత్సరాల తర్వాత చాలా తక్కువ మంది దృఢంగా ఎవరిమీద ఆధారపడకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎంతో  చేసిన వాళ్ల మీద కృతజ్ఞతలు చూపించడానికి ఇదే సరైన మార్గం. అందుకనే మన పురాణాలు మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెబుతాయి.

మీరు, మీ కుటుంబ సభ్యులు ఎప్పడూ ప్రేమతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము.

Registration

Forgotten Password?

Loading