థాంక్యూ – సాధారణంగా మనం రోజూ ఎక్కువగా వాడే పదాల్లో ఇది కూడా ఒకటి. థాంక్యూ చెప్పడం, థాంక్యూ చెప్పించుకోవడం మనకు చాలా మామూలు విషయం. క్యాబ్ డ్రైవర్స్ కి, కస్టమర్ కేర్ వాళ్ళకి, clients కి, తెలియనివాళ్ళకి కూడా మనం థాంక్యూ చెప్తూ ఉంటాం. థాంక్యూ లేదా thanks మన రోజువారీ జీవితంలో చాలా సార్లు వాడుతూ ఉంటాము. కాకపోతే ఇవి వాడుతున్నప్పుడు మనకి ఎలాంటి ఎమోషన్ ఉండదు. థాంక్యూ చెప్పడాన్ని ఒక మంచి అలవాటుగా మాత్రమే చూస్తాం. కృతజ్ఞత (gratitude) అంటే దీనికి మించిది.
కృతజ్ఞత అనేది ఒక గాఢమైన ఎమోషన్. కృతజ్ఞత కలిగి ఉండడం గొప్ప లక్షణం. మన ఆరోగ్యం విషయంలో, మనం తినే మంచి ఆహారం విషయంలో, మనకి ఉన్న సంపద విషయంలో, మన కుటుంబంలో ప్రేమ ఆప్యాయతల విషయంలో, ఎదుటి వాళ్ళ నుండి పొందిన సహాయం విషయంలో మనం కృతజ్ఞతని కలిగి ఉంటాం.
శ్రీ రాముడు పురుషోత్తముడు. 16 గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తిగా మన పురాణాల్లో చెప్పబడిన వ్యక్తి. ఆ పదహారు లక్షణాల్లో కృతజ్ఞత ఒకటి. తనకి సహాయపడ్డ ఎవరి విషయంలో అయిన కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తిగా శ్రీ రాముడు మనకి గుర్తుండి పోతాడు. జంతువులు, పక్షులు, రాజ్యంలోని ప్రజలు,అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా అందరి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం రాముడి లక్షణం. జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో రామాయణం మనకి నేర్పుతుంది. కృతజ్ఞత కనీస ధర్మం అని రామాయణం చెప్తుంది. కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల ఇంకా ఏమన్నా లాభాలు ఉన్నాయా? అవును, చాలా లాభాలున్నాయ్.
మనలో చాలామంది మన ఆరోగ్యాన్ని, సంపదని, రిలేషన్ షిప్స్ ఇలా మంచి విషయాలని పట్టించుకోకుండా మన లైఫ్ లో లేని వాటిగురించి బాధపడుతూ ఉంటారు. మనకి మంచి ఆరోగ్యం ఉన్నా, ఆర్థికంగా బావున్నా, ప్రేమించే రిలేషన్ షిప్స్ ఉన్నా, ప్రమోషన్ లేదనో, ఇంకా పెద్ద ఇల్లు లేదనో, కొత్తగా వచ్చిన కార్ మన దగ్గర లేదనో బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు మనకి లేని దానిగురించే ఆలోచిస్తాము. జీవితం మనం అనుకున్నట్టు లేదని బాధపడతాం.
ఉదాహరణకి, ఏదో బాధలో ఉన్న వ్యక్తికి మంచి ఆహారం పెట్టినా, అతను ఆ ఆహారాన్ని ఎంజాయ్ చెయ్యగలడా ? లేదు. ఎలాంటి ఆనందం లేకుండానే ఆ ఆహారం తింటాడు. అది బావున్నా బాలేకపోయినా అతనికి ఎలాంటి తేడా తెలీదు. ఎందుకంటే అతను ఏదో బాధలో కూరుకుపోయి ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి తన జీవితం మీద, తనకి పెట్టిన ఆహారం విషయంలో కృతజ్ఞత ఉంటే అతను అందులో ప్రతీ అణువును ఎంజాయ్ చేస్తూ సంతృప్తిగా తింటాడు. జీవితం విషయంలో కూడా అంతే.
మనం ఎప్పుడు మనకి లేని దానికోసం బాధపడుతూ ప్రస్తుతం మన జీవితంలో ఉన్న ఎన్నో ఆనందాలని పట్టించుకోము. మనం ఎంత సాధించినా మనకి ఎన్ని ఉన్నా మనం నిరాశగా ఏమీ సాధించని వ్యక్తిగా బాధపడుతూ ఉంటాం. దీనంతటికి కారణం మన దృక్కోణం. మనం జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలా లేదా అన్నది మన చూసే విధానంలోనే ఉంటుంది.
మనం ఎప్పుడూ మన జీవితంలో ఉన్న మంచి విషయాల మీద దృష్టి పెట్టి కృతజ్ఞతతో ఉంటే మన దృష్టి మనకి లేనివాటిమీద ఉండదు. మన దృష్టి failure మీద నుండి success కి మారుతుంది. జీవితం మీద దృక్పధం మారితే మన జీవితమే మారిపోతుంది.
కృతజ్ఞత కలిగి ఉండడానికి డబ్బు, సమయం తో పనిలేదు.
కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.
1. మనం ఎప్పుడు కృతజ్ఞత చూపించడం అలవాటు చేసుకుంటే, parasympathetic nervous system activate అయ్యి శరీరం రిలాక్స్ అవుతుంది. అందువల్ల మన ఆరోగ్యం మెరుగుపడి మంచి నిద్ర పడుతుంది.
2. మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. మన మైండ్ అన్నిటినీ తీసుకోలేదు. దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి మన మైండ్ లో Reticular Activating System (RAS) అని ఉంటుంది. RAS మనం ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయాలనే మైండ్ కి ఇస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటే RAS ఇంకా ఎక్కువ సమస్యలని అతని దృష్టికి తీసుకువచ్చి జీవితం అంతా సమస్యలే అనుకునేలా చేస్తుంది. మనం థాంక్యూ కలిగి ఉంటే మనం మనకి ఉన్న మంచి విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల RAS మన జీవితంలోకి ఇంకా మంచి విషయాలు వచ్చేలా చేస్తుంది. కాబట్టి మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో అవే మనకి తిరిగి వస్తాయి. కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తికి ఆశీర్వాదాలు కూడా ఎక్కువ ఉంటాయి.
3. కృతజ్ఞత మనల్ని ఆనందంగా ఉంచుతుంది
4. డిప్రెషన్ నుండి బయట పడడానికి సహాయపడుతుంది.
5. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మన జీవితంలో ఉన్న విషయాల మీద దృష్టి పెడితే మనం ఎంతో సాధించిన భావన వల్ల మనలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
6. ఒత్తిడిని తగ్గిస్తుంది
7. మన జీవన ప్రమాణం పెంచుతుంది. కృతజ్ఞతతో, ఆనందంగా ఉండే వ్యక్తులు ఎక్కువ కాలం బతుకుతారని పరిశోధనలు చెప్తున్నాయి.
8. ఇంట్లో గానీ, ఆఫీస్ లో గానీ ఎవరైనా వారు చేసిన పనికి కృతజ్ఞత పొందడాన్ని ఇష్టపడతారు. గొప్పవాళ్ళకి ఎక్కువగా మంచి సంబంధాలు ఉండడానికి కారణం ఎదుటివారి పట్ల కృతజ్ఞత కలిగిఉండడమే. వాళ్ళ కుటుంబ జీవితం బావుంటుంది. పిల్లలు గొప్పగా పెరుగుతారు.
9. గొప్ప వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారు. అలాంటి వారి దగ్గర పనిచెయ్యడం అందరికీ నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళకి విలువ ఉంటుంది కాబట్టి.
10. మనకి ఉన్నవాటి విషయంలో మనం కృతజ్ఞతతో ఉంటే మనం ఇంకా ఎక్కువ సాధిచగలం.
11. కృతజ్ఞత శారీరకంగా, మానసికంగా, మరియు ఎమోషనల్ గా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కృతజ్ఞత కలిగి ఉండడం వల్ల కలిగే లాభాలు ఇవి. కృతజ్ఞతని ఎలా అలవాటు చేసుకోవాలి? ఈ కింద తెలిపిన పద్దతుల ద్వారా కృతజ్ఞతని అలవాటు చేసుకోవచ్చు.
ఇందులో మీకు నచ్చినవి ఎంచుకుని ప్రతీరోజూ పాటించండి.
1. పడుకునే ముందు మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాల గురించి ఆ దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ చెప్పండి
2. ఉదయం లేచిన తర్వాత మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాల గురించి ఆ దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ చెప్పండి
3. మీరు తినేటపుడు లేదా మంచి నీళ్ళు తాగుతున్నప్పుడు ఇదే పద్దతి పాటించండి
4. Gratitude journal పెట్టుకుని ప్రతీరోజూ మీ జీవితంలో ఉన్న ఐదు మంచి విషయాలు రాసుకోండి
5. మీకు నచ్చిన చోట నడుస్తూ మీ జీవితంలో ఉన్న ఆశీర్వాదల గురించి ఆలోచించండి.
6. మీ చేతి వేలికి ఒక gratitude ring పెట్టుకుని దాన్ని టచ్ చేస్తూ మీకు ఉన్న ఐదు మంచి విషయాల గురించి కృతజ్ఞత కలిగి ఉండండి
7. మీ కుటుంబ సభ్యులు మీకు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరన్నా మీకు మంచి భోజనం చేసి పెడితే అందులో మీకు ఏం నచ్చిందో చెప్తూ వాళ్ళకి మీ కృతజ్ఞతని తెలపండి.
8. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళకి కృతజ్ఞత తో ఉత్తరాలు రాస్తూ ఉండండి. వాళ్ళ వల్ల మీ జీవితం ఎలా మారిందో వాళ్ళకి చెప్పండి
9. మీకు జీతం వచ్చిన ప్రతీసారి దేవుడికి లేదా విశ్వానికి థాంక్యూ చెప్పండి.
10. మీకు నచ్చిన పని చేసిన ప్రతీసారి మీ మీద మీరు కృతజ్ఞత చూపించుకోండి
మన జీవితంలో కృతజ్ఞతని అలవాటు చేసుకోవడానికి కొన్ని పద్దతులు ఇవి. మీరు ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ప్రతీరోజూ ఇంకా ఇంకా మంచి వ్యక్తి అవుతారు. మీ పూర్తిగా పాసిటివ్ వ్యక్తిగా మారతారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రేమగా ఆనందంగా ఉంటారు.
ఈరోజే కృతజ్ఞతని చూపించడం ప్రారంభించి మీ జీవితాన్ని అద్బుతంగా మార్చుకోండి.