మన అందరికీ ఆనందంగా ఉండడం అంటే చాలా ఇష్టం. మనకి తెలిసినా, తెలియకపోయినా ఆనందమే మన నిజమైన వ్యక్తిత్వం. ఆనందంగా ఉండటం కోసమే మనం కన్న కలలు, లక్ష్యాలు సాధిస్తాం. కానీ మనలో చాలామంది ఆనందంగా ఉండడానికి ఏదో గొప్ప అద్భుతం జరగాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఇల్లు ఉంటే ఆనందంగా ఉందాం. లేదా ప్రమోషన్ వస్తే ఆనందంగా ఉందాం. లేదా పెళ్లి చేసుకున్నాక ఆనందంగా ఉందాం అని ఆనందాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఆనందంగా ఉండడానికి పెద్ద పెద్ద విషయాలు జరగాల్సిన అవసరం లేదు. ఆనందం మనుషుల కనీస అవసరం. ప్రతిరోజు ఆనందంగా ఉండడం అనేది శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆనందం అనేది అప్పుడప్పుడు పొందేది కాకూడదు. ప్రతిరోజూ ఆనందాన్ని పొందాలి. అరిస్టాటిల్ ఆనందం గురించి ఒక మంచి మాట చెప్పాడు.
మానవ ఉనికి యొక్క ఉద్దేశం, లక్ష్యం, జీవితానికి అర్థం.. ఆనందంగా ఉండడమే.
అలాంటి కనీస అవసరం అయిన ఆనందం కోసం పెద్ద పెద్ద విషయాలు జరగనవసరం లేదు. మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మన రోజు వారి జీవితం ఎన్నో పనులుతో నిండి ఉంటుంది. ఇలా బిజీగా గడిచిపోయే జీవితంలో ఆనందాన్ని పొందడం ఎలా ? మనకి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి.
అలాంటి 12 చిన్న చిన్న ఆనందాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రకృతిలో నడవండి : ప్రకృతిలో నడవడం లేదా కాసేపు సమయం గడపడం ఎన్నో లాభాలను చేకూరుస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మనకి చాలా ఆనందం ఇస్తుంది. అందమైన చెట్లను చూస్తూ, పక్షులు చేసే శబ్దాలు వింటూ, సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అది అద్భుతమైన ఆనందం. మీకు సమయం దొరికినప్పుడు మీకు దగ్గరలో ఉన్న పార్క్ లేదా ఏదైనా గార్డెన్లో కాస్త సమయం గడపండి.
2. Awareness తో మీకు ఇష్టమైన ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి : మంచి ఆహారం ఆనందాన్నిస్తుంది. చాలాసార్లు మనం హడావిడిగా తింటాం. లేదా ఏదో మాట్లాడుతూ తింటాం. నిజంగా ఆహారం యొక్క రుచిని ఆస్వాదించం. మనకు ఇష్టమైన ఆహారం తింటున్నప్పుడు మనస్ఫూర్తిగా దాని రుచిని, సువాసనని ఆస్వాదిస్తూ తింటే చాలా ఆనందం ఉంటుంది.
3. నీ మనసుకు నచ్చిన వ్యాపకం పెట్టుకోండి : పెయింటింగ్, డాన్స్ చేయడం, పాటలు పాడడం, ఫోటోగ్రఫీ ఇలా మనకు ఇష్టమైన వ్యాపకాలు చాలా ఉంటాయి. వాటిలో మీరు ఎక్స్పర్ట్ కానవసరం లేదు. మీకు నచ్చిన దేన్నైనా ఎంచుకుని కొన్ని నిమిషాలు దానిలో మునిగిపోయి కాలాన్ని, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మర్చిపోయి మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. ఈ చిన్న పని మీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది.
4. మీరు ప్రేమించే వారితో సమయం గడపండి : మనం ప్రేమించే వ్యక్తులు మన జీవితానికి ఒక విలువ తీసుకొస్తారు. కొన్నిసార్లు ఈ హడావిడి జీవితంలో మనం వారితో సమయం కడపలేకపోతున్నాము. కాస్త సమయం తీసుకుని మీరు ప్రేమించే వారితో గడపండి. వారితో మాట్లాడండి. వారి అభిప్రాయాలను తెలుసుకోండి. అర్థం చేసుకోండి.
5. మొక్కలు నాటండి : ఒక మొక్కను నాటి రోజు దానికి నీళ్లు పోయడం చాలా ఆనందాన్నిస్తోంది. ఆ మొక్క ఒక పువ్వు గాని, ఒక పండు గానీ కాసినప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి మొక్కలు నాటండి. దీనికోసం మీకు పెద్ద గార్డెన్ అవసరం లేదు. ఒక చిన్న కుండీ చాలు. దీనితో పాటు మీకు తెలిసిన వారిని కూడా మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించవచ్చు.
6. స్నేహితులతో సరదా మాటలు ఆనందించండి : స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడం చాలా ఆనందం ఇస్తుంది. స్నేహితులతో చిన్న చిన్న మాటలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి సమయం తీసుకుని తరచూ స్నేహితులతో గడుపుతూ ఉండండి.
7. కామెడీ చూస్తూ ఆనందించండి : ఒక మంచి కామెడీ మీకు ఆనందాన్ని ఇచ్చి ఒత్తిడి నుండి దూరం చేస్తుంది. నవ్వు మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి బిగ్గరగా నవ్వండి.
8. ఎవరైనా ఆనందంగా ఉండేలా చేయండి : ఎవరినైనా సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేయండి. ఒక కేక్ చేయడం, లేదంటే వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టడం, వారు ఊహించని బహుమతితో ఆశ్చర్య పరచడం మొదలగునవి.. మనం వాళ్ళని ఆనందంగా ఉంచినప్పుడు ఆనందం మనకు కూడా వస్తుంది. ఏదైతే ఇస్తామో అదే తీసుకుంటాము అనేది ప్రకృతి నియమం. కాబట్టి మీరు ఆనందం ఇస్తే మీరు పదింతల ఆనందాన్ని పొందుతారు.
9. ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి : కొత్త విషయాలను నేర్చుకోవడం అనేది మనల్ని ఆనందంగా ఆత్మవిశ్వాసం గా ఉండేలా చేస్తుంది. జీవితం చాలా పెద్దది మన నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన దేన్నైనా ఎంచుకునే నేర్చుకోండి. మీరు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
10. మీకు నచ్చిన సంగీతాన్ని వినండి : మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కోరకమైన సంగీతం నచ్చుతుంది. సంగీతం ఒక నూతన ఉత్సాహాన్ని మరియు జీవితాన్ని కొత్తగా చూసే ఒక దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రతిరోజు మీకు నచ్చిన సంగీతాన్ని వినండి.
11. ఆనందకరమైన క్షణాలు తలచుకోండి : మనం ఆనందంగా గడిపిన క్షణాలు తలుచుకుంటే మనం ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉండడానికి ఇది చాలా సులువైన పద్ధతి. ఒక్కసారి వెనక్కి చూసుకుని మీ జీవితంలో ఉన్న అద్భుతమైన క్షణాలను తలచుకుని సంతోషంగా ఉండండి.
12. దయ కలిగి ఉండటం అలవాటు చేసుకోండి : మనం దయ కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. అభినందించడం, ఒక మంచి సలహా ఇవ్వడం, మీ దగ్గర ఉన్నది ఎదుటివారితో పంచుకోవడం. ఇలాంటివి చేయడం వల్ల ఎదుటి వాళ్ళ జీవితాన్ని మనం ప్రభావితం చేయడమే కాదు, ఈ ప్రపంచాన్ని ఒక ప్రశాంత ప్రదేశంగా మార్చడంలో ఒక భాగం అవుతాం.
ఆనందాన్ని సృష్టించడానికి ఇవి కొన్ని మార్గాలు. జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆనందంగా ఉండటం మన బాధ్యత. జీవితం చాలా చిన్నది. కాబట్టి ప్రతిరోజు ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండటమే జీవితం యొక్క పరమావధి అని గుర్తుంచుకోండి.
Stay happy