ఈ ప్రపంచం అనేది ఒక పుస్తకం. ట్రావెలింగ్ చేయనివారు అందులో కేవలం ఒక పేజీ మాత్రమే చదువుతారు. – Saint Augustine.
మీరు గతంలో విహార యాత్రకు వెళ్లిన సమయం గుర్తుందా ? కొత్త కొత్త వంటలను రుచి చూడడం ఎంత ఉత్సాహంగా ఉంది? ఇప్పుడు తలుచుకుంటే ఆనందంగా ఉండే జ్ఞాపకాలను ఎన్ని సంపాదించారు ? ఒక కొత్త ప్రదేశంలో ఉండటం మీకు ఎలా ఉంది ? ఉత్సాహంగా, చాలా కొత్తగా ఉంది కదా ?
ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. చాలా పట్టణాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఉన్న రక రకాల సంస్కృతులు ఉన్నాయి. ప్రపంచం వీటన్నిటి సమ్మేళనం. ప్రతి ప్రదేశం మీకు చెప్పడానికి కొన్ని కథలతో సిద్ధంగా ఉంటుంది. ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన సంప్రదాయాలు, మరియు ఒక కొత్త భాష. ఒకే రాష్ట్రంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఇవన్నీ మారిపోతాయి. ఆహారం విషయానికి వస్తే నోరూరించే ప్రత్యేకమైన వంటలు ప్రతి ఊరిలోనూ ఉంటాయి.
కొత్త కొత్త ప్రదేశాలను చూడడం, ప్రపంచాన్ని తెలుసుకోవడం చాలా సరదాగా ఉంటుంది. ఇదే అందులో ఉన్న అందం. జీవితానికి అత్యంత గొప్ప బహుమతి. ట్రావెలింగ్ అనేది కేవలం సరదానా ? లేక దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ? సరదా విషయాన్ని కాసేపు పక్కన పెడితే ట్రావెలింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.
1. మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుంది : మనం కొత్త సంస్కృతుల గురించి, కొత్త ప్రదేశాల గురించి తెలుసుకున్నప్పుడు మన ఆలోచనా పరిధి పెరుగుతుంది. మనం పరిధులు దాటి ఆలోచించడం మొదలు పెడతాం. సాధారణంగా మనం చాలా పరిధులకు లోబడి ఆలోచిస్తాం. ట్రావెలింగ్ చేయడంవల్ల మనం గొప్పగా ఆలోచిస్తాం. అన్నిటినీ ఇముడ్చుకునే శక్తి మనలో పెరుగుతుంది.
2. సృజనాత్మకతను పెంచుతుంది : మనకి కొత్త కొత్త ఐడియాలు, ఒక పనిని చేయడానికి రకరకాల మార్గాలు ట్రావెలింగ్ వల్ల తెలుస్తాయి. మన సృజనాత్మకత పెరిగి జీవితాన్ని ఒక కొత్త దృక్కోణంలో చూస్తాం, జీవితానికి ఒక కొత్తదనాన్ని, ఒక ప్రత్యేకతను తీసుకువస్తుంది.
3. మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తుంది : రోజు వారి జీవితంలో మనం చాలా రొటీన్ జీవితాన్ని గడుపుతుంటాం. ఈ రొటీన్ నుండి ట్రావెలింగ్ మనకు బ్రేక్ ఇస్తూ, మనల్ని నూతన ఉత్సాహంతో ఉండేలా చేస్తుంది. మనం నేచర్ కి దగ్గరగా ఉన్న చోట్లకి వెళ్ళినప్పుడు మన మైండ్, శరీరం, ఆత్మ నూతన ఉత్సాహంతో నిండిపోతాయి. నేచర్ మన ట్రావెల్ లో భాగం అయినప్పుడు ఆ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. దానివలన ఆనందం, ప్రశాంతత లభిస్తుంది.
4. ఆనందాన్నిస్తుంది : మనం ఏదైనా కొత్త విషయాన్ని చూసినప్పుడు. ఆనందంగా ఫీల్ అవుతాము. కొత్త ఫుడ్ తిన్నప్పుడు, కొత్త అనుభవాలు, ఆ ప్రయాణం, కొత్త ప్రదేశాలు, కొత్త సంస్కృతులు, మన చుట్టూ ఉన్న నేచర్ఇ వన్నీ మనకి ఆనందాన్ని, ఒక సంతృప్తిని ఇస్తాయి. జీవితం బోరింగ్ గా, బాధగా ఉందా ? బ్రేక్ తీసుకుని ట్రావెలింగ్ కి వెళ్లండి.
5. ఒత్తిడిని తగ్గిస్తుంది: ఆధునిక జీవితం ఒత్తిడితో నిండి ఉండి మనకి తెలియకుండానే ప్రతిరోజూ ఒత్తిడికి గురవుతూ ఉంటాము. కొంతకాలం తర్వాత ఒత్తిడి పేరుకుపోతుంది. ట్రావెల్ చేసినప్పుడు శరీరంలో ఉన్న ఈ ఒత్తిడి విడుదల అవుతుంది. మనకు నిజంగా ప్రశాంతంగా రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. ట్రావెల్ చేస్తే మన సమయం అంటూ ఒకటి దొరుకుతుంది. సాధారణ జీవితంలో ఇలా కొంత సమయం దొరకడం ఇష్టం. మనం చేసే ట్రావెల్స్ నేచర్ లో కలిపే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దానివల్ల శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఎన్నో లాభాలు ఉన్నాయి.
6. మిమ్మల్ని మీరు మరింత అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది : మీరు ట్రావెల్ చేసే సమయంలో పరిస్థితులు కొన్ని కొత్త సవాళ్లను తీసుకువస్తాయి. అన్నిసార్లూ మనం ప్లాన్ చేసుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు పరస్తితులు మన అదుపు దాటి వెళ్లిపోతాయి. మనకి తెలియనివి, సరిగా ప్లాన్ చేసుకోనివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి పరస్తితుల్ని ఎదుర్కొన్నప్పుడు మనల్ని మనం మరింత అర్థం చేసుకుంటాము. అందులో మన బలాలు, బలహీనతలు బయట పడతాయి. మనలోకి మనం దూకి మన గురించి మనం మరింత తెలుసుకునే ఆద్యాత్మిక ప్రక్రియ ట్రావెలింగ్.
7. కొత్త రిలేషన్ షిప్స్ ఇస్తుంది: ట్రావెలింగ్ లో కొత్త పరిచయాలు అవుతాయి. వాళ్ళు మనకి స్పూర్తిని ఇచ్చే, ఆనందాన్ని పంచే ఎన్నో అనుభవాలు చెప్తారు. ఆ కథలు వినే మనసు, సమయం మన దగ్గర ఉంటే చాలు. ఆ ప్రయాణంలో ఎన్నో కొత్త పరిచయాలని, స్నేహితులని ఇస్తుంది.
8. ఎన్నో విషయాలు నేర్పుతుంది : ట్రావెలింగ్ మనకి ఎన్నో కొత్త విషయాలు నేర్పుతుంది. కొత్త ప్రదేశానికి అలవాటు పడడం అన్నిసార్లూ అంత తేలిక కాదు. కొత్తది నేర్చుకోవడం, మనకి తెలిసింది మరచిపోవడం అనే కళ కావాలి. అక్కడి సంస్కృతిని, ఆచారాలను అర్థం చేసుకుని దాని ప్రకారం నడచుకోవలసివస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి మనం ఒక కొత్త విధానం నేర్చుకోవలసి వస్తుంది. అప్పుడు మనకి ఎన్నో సంవత్సరాలుగా అలవాటు అయిన పద్దతిని మర్చిపోవల్సి వస్తుంది. నిజ జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలను నేర్పుతుంది.
9. సాదించాం అనే అనుభూతిని ఇస్తుంది: ట్రావెలింగ్ వల్ల మన జీవితం మనకి గొప్పగా అనిపిస్తుంది. సాధించాం అనే అనుభూతిని ఇస్తుంది. మనం ఇంటి దగ్గర కూర్చుని పట్టించుకోవడం మానేసిన మన జీవితాల్లో ఉన్న ఎన్నో అదృష్టాలని చూసేలా చేస్తుంది.
10. గొప్ప జ్ఞాపకాలని ఇస్తుంది: అందమైన జ్ఞాపకాలని పోగేసుకోవడమే జీవితం. అలాంటి జ్ఞాపకాలు దాచుకోవడానికి ట్రావెలింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్ని ఏళ్ల తర్వాత అయినా మనకి ఆనందాన్ని ఇస్తాయి. ట్రావెలింగ్ నుండి మనం ఇంటికి వచ్చినపుడు ఆ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలు మనలో నిండిపోతాయి.
11. ఒక ఆధ్యాత్మక అనుభూతిని ఇస్తుంది: మనం ట్రావెలింగ్ చేసినపుడు ఒక కొత్త సంస్కృతిలో, ఆ ప్రదేశంలో ఉన్న ఎనర్జీలు మనల్ని తాకుతాయి. వీటికి మన జీవితాన్ని సమూలంగా మార్చేసే శక్తి ఉంది. ఇది ఒక గొప్ప అధ్యాత్మక అనుభూతి.
12. కృతజ్ఞత ని నేర్పుతుంది: కొన్ని చారిత్రక ప్రదేశాలు చూసినపుడు మన పూర్వీకుల ప్రయాణం, వారి త్యాగాలు మనకి అర్థం అవుతాయి.
ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం మన పూర్వీకుల త్యాగ ఫలితం అని మనకి అర్థం అయ్యి మనలో కృతజ్ఞత నిండిపోతుంది. ఇది ఒక గొప్ప అనుభూతి.
ట్రావెలింగ్ చెయ్యడం వల్ల కొన్ని లాభాలు ఇవి.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, లేదా ఒంటరిగా ట్రావెలింగ్ చెయ్యవచ్చు. దగ్గర ఉన్న ప్రదేశాలు లేదా వేరే దేశం ఎక్కడికైనా మీరు వెళ్ళవచ్చు. కొన్ని రోజులు లేదా నెలలు ట్రావెలింగ్ చెయ్యవచ్చు. ప్రతీ ప్రయాణం ప్రత్యేకమైన అనుభవాన్ని, జ్ఞాపకాలని ఇస్తుంది. మీకు నచ్చిన విధంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోండి. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలో ఎక్కడికైనా మీ ఫ్యామిలీతో గానీ, ఒంటరిగా గానీ వెళ్ళేలా మీ సమయాన్ని, డబ్బుని సిద్దం చేసుకోండి.
ట్రావెలింగ్ స్వేచ్ఛకి ప్రతీక. జీవితం మీకోసం దాచి ఉంచిన గొప్ప అనుభవాల కోసం ట్రావెలింగ్ చెయ్యండి.
ట్రావెలింగ్ మిమ్మల్ని వినమ్రంగా మారుస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఎంత చిన్న తునకలమో మనకి తెలిసేలా చేస్తుంది. – Gustav Flaubert