13 ఆరోగ్యకరమైన స్నాక్స్

ఆరోగ్యకరమైన స్నాక్స్
Share

సాయంత్రం 4 లేదా 5 అవ్వగానే పెద్దవాళ్ళనుండి పిల్లల వరకూ అందరికీ ఏదైనా రుచికరంగా, లైట్ గా స్నాక్స్ లాంటివి తినాలి అనిపిస్తుంది. ఛాయ్, బిస్కట్,చిప్స్, పకోడీ, సమోసా మొదలైనవి బాగా ఎక్కువమంది తీసుకునే స్నాక్స్. నూడిల్స్, నిల్వ ఉంచే రసాయనాలతో నిండి ఉన్న చాకొలెట్స్, స్వీట్స్ ఇలా  ఎన్నో స్నాక్స్ మనకు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. ఇవన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అందులో ఉన్న నిల్వ ఉంచే రసాయనాల వల్ల, డీప్ ఫ్రై వల్ల, వాడిన నూనెను మళ్ళీ వేడి చెయ్యడం వల్ల, మైదా వల్ల, ఎక్కువ పంచదార ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం.

ఇలాంటి స్నాక్స్ తినడం వల్ల ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే ఇవి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా మనం వాటికి బానిస అయిపోతాం. అనారోగ్యకరమైన స్నాక్స్ ఎక్కువ తినాలి ఆనించేలా చేసి మీ జీర్ణ వ్యవస్థ మీద భారం పెరిగిపోయేలా చేస్తాయి.

కాబట్టి,  రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? రుచికరంగా ఉంటూ దీర్ఘకాలంలో మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయని స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి స్నాక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇవి మిమ్మల్ని బానిస చేసుకోవు. మీరు తక్కువ భోజనం చేసేలా కూడా చేసి మీ ఆరోగ్యానికి చాలా ఉపకారం చేస్తాయి.

13 ఆరోగ్యకరమైన స్నాక్స్ 

1. గుప్పెడు వేయించిన వేరు శెనగలు మరియు బెల్లం: ఇది ఆయిల్ లేని, నిల్వ ఉంచే రసాయనాలు లేని ఇంటి దగ్గరే చేసుకోగల మంచి ఆరోగ్యకరమైన స్నాక్. తీపిని ఇష్టపడే వాళ్ళకి చాలామంచి స్నాక్. దీనిలో ఐరన్, ప్రోటీన్స్, సీలీనీయం, మెగ్నీషియం, ఉంటాయి.

2. వేరు శెనగల చాట్: ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, నిమ్మకాయలతో పాటు ఉడికించిన వేరుశెనగ కలిపి చేస్తారు ఇది. రుచికరమైనది మరియు ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు. కూరగాయల నుండి వచ్చే ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉండే అద్భుతమైన స్నాక్ ఇది.

3. మొలకల చాట్: పచ్చి మొలకలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అలా పచ్చివి తినడం చాలామందికి నచ్చదు. అంతేకాకుండా కొంతమందికి జీర్ణం అవ్వకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. అందుకే మొలకలని ఉడకబెట్టి, ఉల్లిపాయ, టమోటా,పచ్చి మిర్చి ముక్కలు కలిపి, కాస్త నిమ్మరసం పిండితే మాంచి రుచికరమైన స్నాక్ రెడీ. ఇది చాలా ఆరోగ్యకరం. దీనిలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి.

4. అటుకులు: అటుకుల్ని నూనె లేకుండా వేపి వేరుశెనగలు, ఉప్పు, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి రుచికరమైన స్నాక్ తయారు చేయవచ్చు. ఇది ఆయిల్ లేకుండా, మైదా లేకుండా, ఎలాంటి నిల్వ ఉంచే రసాయనాలు లేకుండా చాలా ఆరోగ్యకరం.  దీనిలో ఫైబర్ మరియు పోషకాలు ఉంటాయి.  ఐరన్ ఉండడంవల్ల  మన ఆరోగ్యం మరింత మెరుగు అవుతుంది. దీని నుండి మరింత ప్రయోజనాలు పొందడానికి ఎర్ర బియ్యం నుండి తయారు చేసిన అటుకులు వాడండి.

5. పళ్ళు : అరటి పళ్ళు, ఆరెంజ్, ద్రాక్ష పళ్ళు, స్ట్రాబెర్రీస్, బొప్పాయితో మంచి సలాడ్ లాగా చేసుకోవచ్చు. తీపిని ఇష్టపడే వారికి ఇది చాలా నచ్చుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.  రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది.

6. డ్రై ఫ్రూట్స్ : జీడిపప్పు,  కిస్మిస్, బాదం, పిస్తా, వాల్ నట్స్ ఇలా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.  ఇవన్నీ కలిపి లేదా మీకు నచ్చినది ఏదైనా  తీసుకోవచ్చు.  సూపర్ మార్కెట్లో దొరికే సాల్ట్ కలిపిన డ్రై ఫ్రూట్స్ లో సోడియం ఎక్కువ ఉంటుంది.  కాబట్టి ఇలాంటి వాటిని దూరం పెట్టండి.  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు ,ప్రొటీన్లు ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

7. బఠానీ చాట్ : నీటిలో 12 గంటలు నానబెట్టిన బఠాణీలను ఉడకబెట్టి ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర నిమ్మరసం కలిపి తింటే ఆరోగ్యకరం మరియు రుచిగా కూడా ఉంటుంది. దీనిలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి.

8. ఉడకబెట్టిన చిలగడదుంపలు : చిలగడదుంపలు దొరికే సీజన్లో వీటిని తీసుకోండి. చిలకడ దుంపలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటంవల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభ

9. నువ్వుల లడ్డు : నువ్వుల లడ్డూలలో  క్యాల్షియం మరియు ఐరన్ ఉంటాయి.  బెల్లాన్ని వాడి ఇంటి వద్దనే తయారుచేసుకోవచ్చు.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

10. డ్రై ఫ్రూట్ లడ్డు : దీనిని ఇంటి వద్దనే బెల్లం మరియు తేనె వాడి చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనిలో ఐరన్ మరియు ప్రోటీన్స్ ఉండడం వల్ల మన శరీరానికి చాలా మంచిది.

11. స్మూతీస్ : ఇంటి వద్దనే తయారు చేసుకునే స్మూతీస్ ఎన్నో ఉన్నాయి. అరటిపళ్ళు, క్యారెట్, బీట్ రూట్, ఆపిల్స్ బొప్పాయి, కీరదోస, టమోటాలు మొదలైనవాటితో స్మూతీస్ తయారుచేసుకోవచ్చు. వీటిపైన డ్రైఫ్రూట్స్ వేసి తీసుకోవచ్చు. ఇవి రుచికరంగా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లతో సమృద్దిగా ఉంటాయి.  మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

12. కొబ్బరి నీళ్లు మరియు కొబ్బరి బొండం: కొబ్బరి నీళ్ళలో పొటాషియం, ఎలక్ట్రో లైట్స్ మరియు విటమిన్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లతో పాటు కొబ్బరి కాయ కూడా మనకి ఆరోగ్యకరం.

13. రాగి జావ : రాగి జావలో, ఉప్పు మరియు మజ్జిగ కలిపి తీసుకోవచ్చు.  ఇది  ఆరోగ్యానికి మంచిది.  మన ప్రేగులలోప్రొబయాటిక్ వాతావరణాన్ని పెంచుతుంది.  రాగిలో క్యాల్షియం మరియు ఐరన్ ఉంటాయి.  బెల్లం వాడి తీపిగా కూడా చేసుకోవచ్చు.

వీటిని మీరు ఇంటి వద్దనే తయారు చేసుకోగల ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవి .  వీటిని తయారు చేసుకునే సమయంలో గుర్తుంచుకోవాలసిన సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. ఇవి చేసుకోడానికి మీరు ఏం వాడినా వీలైనంతగా ఆర్గానిక్ వాడడానికి ప్రయత్నించండి.

2. మీరు డయాబెటిక్ అయితే తేనే మరియు బెల్లం వాడేటప్పుడు జాగ్రత్త వహించండి.

3. మీరు ఊబకాయంతో బాధపడుతుంటే మీరు స్నాక్స్ ఎంచుకునే ముందు మీ డైట్ ప్లాన్ కి తగ్గట్టు ఎంచుకోండి.

వీటితో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని స్నాక్స్ మీరు ఇక్కడ కొనవచ్చు ఈ స్నాక్స్ లో ఎలాంటి రసాయనాలు, నిలవ ఉంచే పదార్థాలు, మైదా, షుగర్ ఉండవు.

Registration

Forgotten Password?

Loading