పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం. ఒకరినొకరు ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునే ఒక అరుదైన బంధం. పెళ్ళిలో ఇద్దరు వ్యక్తులు వేరు వేరు కుటుంబాల నుండి వస్తారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. ఎవరి ఇష్టాలు వారికుంటాయి. ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఈ విభేదాలు సాధారణం.
అలాంటి ఇద్దరు వ్యక్తులు పెళ్ళి ద్వారా ఒకటైనప్పుడు సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. ఇది అనివార్యం. కొన్నిసార్లు వాదోపవాదాలు జరుగుతాయి. ఈ ఒత్తిడిని తగ్గించుకుంటూ పెళ్ళి తర్వాత జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలమా? అవును.
ఒత్తిడిని తగ్గించి పెళ్ళి తర్వాత జీవితాన్ని అద్భుతంగా మార్చే 16 సూచనలు ఇప్పుడు చూద్దాం.
1. తక్కువ అంచనాలు : పెళ్ళి తర్వాత ఎక్కువగా కోరుకుంటారు. తమ భాగస్వామి ఎలాంటి లోపాలు లేకుండా perfect గా ఉండాలి అనుకుంటాను. కానీ వాళ్ళు అర్థం చేసుకోనిది ఏమిటంటే, మనందరం perfect కాదు. ప్రతిరోజు మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుతూ ఉంటాం అంతే. అలానే మీ భాగస్వామి కూడా. కాబట్టి తక్కువ అంచనాలు ఉండటం ఆనందకరమైన జీవితానికి ఉపయోగపడుతుంది.
2. అంగీకరించడం : మనందరం జీవితాన్ని చూసే విధానం ఒకటి ఉంటుంది. ఎవరు తప్పు కాదు, ఒప్పు కాదు. అది కేవలం మనం చూసే కోణం మాత్రమే. కేవలం మన భాగస్వామి అయినంత మాత్రాన మనకున్న అభిప్రాయమే తనకి ఉండాలి అని లేదు. వాళ్లు జీవితాన్ని వేరే కోణంలో చూస్తూ ఉండవచ్చు. వాళ్ళ విలువలు, అలవాట్లు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. మనం వాళ్ళని అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు జీవితం మరింత మెరుగవుతుంది.
3. ఒకరి కుటుంబాలని ఒకరు గౌరవించుకోవడం : ప్రతి ఒక్కరు తమ కుటుంబానికి, తోబుట్టువులకు దగ్గరై ఉంటారు. వాళ్ల మీద అమితమైన ప్రేమ ఉంటుంది. ఇది సహజం. పెళ్ళిలో ఇద్దరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఒకరి కుటుంబాలని ఒకరు గౌరవించుకోవాలి. తమ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచారని ఎవరు కోరుకోరు. మీ భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల్ని మీరు గౌరవించినప్పుడు మీకు చాలా విలువ వస్తుంది.
4. అభినందన : మీ భాగస్వామిని అభినందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు అడక్కుండానే మీకోసం ఎంతో చేస్తూ ఉండవచ్చు. ఒక్క చిన్న అభినందనలతో వాళ్ళని మీరు ఎంత ప్రేమిస్తున్నారో విలువ ఇస్తారో అర్థమవుతుంది. మీ భాగస్వామి ఏదైనా సహాయం చేసినప్పుడు, మంచి చేసినప్పుడు అభినందించండి.
5. గౌరవం : పెళ్ళిలో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండడం సహజం. ఒకరి దాన్ని ఒకరు ఒప్పుకోక పోవడం సహజం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే గౌరవంగా మన అభిప్రాయాన్ని చెప్పడం. మనం పనిచేసే చోట కూడా ఇలాంటివి జరుగుతాయి. కానీ మనం చాలా గౌరవంగా మన అభిప్రాయం చెబుతాము. అదే మన వ్యక్తిగత సంబంధాలు దగ్గరకు వచ్చేసరికి అగౌరవంగా మన అభిప్రాయం చెబుతాం. ఇక్కడే ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రేమ కన్నా గౌరవం అనేది పెళ్ళికి మరింత దృఢంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారుస్తుంది.
6. బాధ్యతలు పంచుకోవడం : ఇంటిని నడపడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం. వంట చేయడం, శుభ్రం చేయడం, డబ్బు సంపాదించడం, షాపింగ్ చేయడం పిల్లల గురించి పట్టించుకోవడం మొదలైనవి. ఇద్దరూ కూర్చుని వీటిని సరిగా ప్లాన్ చేసుకోవాలి. ఇది జీవితాన్ని చాలా సులభం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఈ పనులను పంచుకుంటే మీ ఇంటి బాధ్యతలను చాలా సులువుగా నిర్వర్తించవచ్చు.
7. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం : సినిమాలు, నవలలు వల్ల మన భాగస్వామి మన మనసులో ఏముందో తెలుసుకుని దానికి తగ్గట్టు ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజం కాదు. మన మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీకు ఏదైనా కావాల్సినప్పుడు లేదా మీకు ఏదైనా నచ్చినప్పుడు ఎదుటివారే తెలుసుకోవాలి అనుకునే దానికంటే మనస్ఫూర్తిగా మీ అభిప్రాయాలు చెప్పండి. చెప్పి దాని గురించి పట్టించుకోమని చెప్పండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం అనేది ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది.
8. సమయం ఇవ్వండి : ఏదైనా రిలేషన్ షిప్ సమయం వల్లే ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మీ ఇద్దరికీ ఇష్టమైన పనులు చేయండి. ఈ ఆధునిక జీవితంలో ఎన్నో destractions ఉన్నాయి. మీ భాగస్వామికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం లాంటి చిన్న చిన్న విషయాల్ని ఆనందించండి.
9. వారికి ఏకాంతం ఇవ్వండి : మనందరికీ మనకంటూ ఒక సమయం కావాలి. మనకి ఇష్టమైన హాబీస్, మన స్నేహితులతో సమయం గడపడం మొదలైనవి. మీ భాగస్వామికి ఇష్టమైన పని చేయడానికి వాళ్ళకంటూ కొంత సమయం ఇవ్వండి. ఇద్దరు వ్యక్తులకి పెళ్ళిఅయిన కారణంగా ఇద్దరికీ ఓకే హాబీ, ఒకే స్నేహితులు ఉండాలని లేదు. మీ భాగస్వామికి పెళ్ళికి ముందు హాబీలు, స్నేహితులు ఉన్నారని అర్థం చేసుకోండి. వాళ్లు మీ భాగస్వామికి చాలా ముఖ్యం.
10. స్నేహం : పెళ్ళిలో ప్రేమించబడడం అనేది చాలా ఎక్కువగా చెప్పబడింది. ప్రేమ అనేది ఒక భావోద్వేగం. వస్తుంది, పోతుంది. ఒకరిని ఎప్పటికీ ప్రేమించడం అనేది వాస్తవం కాదు. మనం మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తాం. వాళ్ల గురించి శ్రద్ధ తీసుకుంటాం. వాళ్ల గురించి ప్రతిరోజు ప్రేమగా ఫీల్ అవ్వకపోవచ్చు. ఇది మనల్ని చెడ్డవాడని చేయదు అలాగే పెళ్ళిలో కూడా. కొన్నిసార్లు మీ భాగస్వామి విషయంలో మీరు ప్రేమగా ఉండకపోవచ్చు లేదా మీ భాగస్వామి మీ విషయంలో ప్రేమగా ఉండకపోవచ్చు. అది మామూలు విషయమే. మీ ఇద్దరి మధ్య దృఢమైన స్నేహం ఉండటం చాలా ముఖ్యమైన విషయం. పెళ్లి తర్వాత జీవితం ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి.
11. మీ భాగస్వామి యొక్క అవసరాలను గుర్తించండి : పెళ్ళిలో ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. మీ భాగస్వామి శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా మీ నుంచి కొన్ని ఆశించవచ్చు. వాటి గురించి మీరు పట్టించుకోండి. వాటిని తీర్చడానికి వీలైనంత ప్రయత్నించండి. అవి మీరు చేయలేకపోతే గౌరవంగా మీరు ఎందువల్ల చేయలేకపోయారు వివరించండి.
12. మనమీద మనకి ప్రేమ : జీవితంలో మనందరికీ కొన్ని అవసరాలు ఉంటాయి. వాటిని మన భాగస్వామి తీర్చలేరు. మన అలాగే మన భాగస్వామి కూడా ప్రతిరోజు మారుతూ ఉంటారు. మనకి ఉన్న కొన్ని అవసరాలు వాళ్ళు తీర్చగలరు కానీ అన్నీ తీర్చలేరు. మీ అవసరాలు మీరే చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.
13. దృఢంగా ఉండండి : మీరు వ్యక్తిగతంగా దృఢంగా ఉండటం మీ భాగస్వామిని కూడా గొప్పగా మారుస్తుంది. దృఢంగా ఉండడం అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా , ఆధ్యాత్మిక పరంగా, ఆర్ధిక పరంగా, దృఢంగా మారండి. ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఉండండి. ఎప్పుడూ పక్క వాళ్ళ మీద ఆధారపడే వ్యక్తి తన భాగస్వామిని అద్భుతంగా మార్చుకోలేరు.
14. విశ్వాసం కలిగి ఉండండి : విశ్వాసం కలిగి ఉండడం అనేది పెళ్ళిలో చాలా ముఖ్యం. ఆలోచనల పరంగా, ఎమోషనల్ గా , మాటల్లో, పనుల్లో ఒకరిమీద ఒకరు విశ్వాసంతో ఉండండి.
15. క్షమించండి : జీవితంలో తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు మీకు కోపం రావచ్చు లేదా మీ భాగస్వామికి కోపం రావచ్చు. గొడవలు జరగవచ్చు. అన్ని వేళలా ప్రేమించడం, గౌరవించడం ఎవరికీ సాధ్యం కాదు. మిమ్మల్ని మీరు క్షమించడం మీ భాగస్వామిని క్షమించడం చాలా ముఖ్యం. ఎంత త్వరగా క్షమించడం అలవాటు చేసుకుంటే నీ జీవితం అంత గొప్పగా ఉంటుంది.
16. జ్ఞాపకాలు భద్రంగా ఉంచుకోండి : పెళ్ళి సమయంలో మీ కుటుంబ ఆచారం ప్రకారం మీరు ఉంగరాలు మార్చుకోవడం లేదా మంగళ సూత్రం కట్టడం జరుగుతాయి. ఇవి పెళ్లి యొక్క పవిత్రమైన గుర్తులు. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మీ పెళ్లికి పవిత్రతని తీసుకొస్తా యి.
ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పెళ్ళికి ఇవి కొన్ని సూచనలు. పెళ్ళికి ప్రేమ ముఖ్యం . కానీ అదే ముఖ్యం కాదు పైన తెలిపిన అన్ని సూచనలు ముఖ్యమే. మీ భాగస్వామిని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను అనే కట్టుబాటు పెళ్ళి. దానిని ఎంజాయ్ చేయండి.