మిమ్మల్ని మీరు ప్రేమించడానికి 16 మార్గాలు

మిమ్మల్ని మీరు ప్రేమించడానికి
Share

ప్రేమించడం ప్రేమించబడడం మనందరికీ ఎంతో కొంత అనుభవమే. కానీ తమని తాము ప్రేమించుకోవడం అనేది చాలా తక్కువ మంది మాత్రమే అనుభవిస్తారు. చాలామందికి తమని తాము ప్రేమించుకోవడం అనేది చాలా కొత్తగా, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫిలాసఫీగా అనిపిస్తుంది. తమని తాము ప్రేమించుకోవడం గురించి బుద్ధుడు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ‘మీ ప్రేమ పొందడానికి అర్హత కలిగిన వ్యక్తి కోసం మీరు ప్రపంచమంతా వెతకొచ్చు. కానీ మీకు దొరకరు. ఈ విశ్వంలో మీ ప్రేమను పొందడానికి పూర్తి అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి మీరు మాత్రమే’ అని బుద్ధుడు అన్నాడు.

మనల్ని మనం ప్రేమించడం అనేది ఫిలాసఫీ కాదు. అవసరం. మనం మన ప్రేమను పొందడానికి అర్హులం. మనల్ని మనం ప్రేమించుకోవడానికి చాలామందికి అడ్డు వచ్చేవి మనం గతంలో చేసిన తప్పులు. మన మీద మనకి సాధ్యం కానీ అంచనాలు ఉంటాయి. మన విషయంలో మనం చాలా కఠినంగా ఉంటాము. అందువల్ల మన మైండ్ మన గురించి ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది.

కాబట్టి , మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలి ? ఎనర్జీ  విషయాల్లో ఆలోచిస్తే ప్రతి వ్యక్తి  తమ ఆలోచనలు, ఎమోషన్స్ మరియు ఎనర్జీల వల్ల ఏర్పడిన ఒక Aura లో ఉంటారు. ఒక వ్యక్తి తన గురించి తాను ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచిస్తూ ఉంటే వేరే వాళ్ల నుంచి కూడా అలాంటి ఆలోచనలు ఆకర్షిస్తాడు. మీ గురించి మీరు గొప్పగా ఆలోచిస్తే ఎదుటివారు కూడా మీ గురించి గొప్పగానే అనుకుంటారు.  ఎందుకంటే మీ Aura అలా మారుతుంది కాబట్టి. మీరు అందంగా లేరు అని మీరు అనుకుంటే,  ఎదుటివారు కూడా అలాగే అనుకుంటారు.

చాలాసార్లు మనకి బయట ఎదురయ్యే సంఘటనలు మన లోపల ఫీల్ అయ్యే ఆలోచనలను, మన లోపలి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. ఎదుటి వారు మిమ్మల్ని ప్రేమించాలి,గౌరవించాలి అని మీరు కోరుకుంటే మీరు మొదట చేయవలసిన పని మిమ్మల్ని మీరు ప్రేమించాలి, గౌరవించాలి. ఆనందంగా ఉండాలంటే మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం.

ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో మనకి ఎంతో కొంత తెలుసు.

కానీ మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించాలి? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.

1. మీ శరీరం ఎలా ఉందో అలానే అంగీకరించండి. మీరు తక్కువ బరువు ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. పొట్టిగా ఉండొచ్చు.  పొడుగ్గా ఉండొచ్చు.  మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండకపోవచ్చు. కానీ మీ శరీరం మీకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. అస్సలు విరామం తీసుకోకుండా 24 గంటలు మన శరీరం పని చేస్తూనే ఉంటుంది. కానీ మనం ఆలోచించకుండా తీసుకునే జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి ఇలాంటివన్నీ మన శరీరాన్ని పాడుచేస్తాయి. మీ శరీరాన్ని ప్రేమించండి. మీరు స్నానం చేస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఈ శరీరానికి థాంక్యూ చెప్పండి. ప్రేమగా మీ శరీరం తో మాట్లాడండి.

2. మీరు గతంలో చేసిన తప్పులకు గానూ మిమ్మల్ని మీరు క్షమించండి. వాటి గురించి సిగ్గు పడకండి. చేసిన తప్పు నుండి పాఠాలు నేర్చుకుని ఆ తప్పుని మళ్లీ చేయకండి.  మీరు గతంలో చేసిన తప్పులు గురించే పదే పదే ఆలోచించడం వల్ల  మీ ఎనర్జీ మరియు సమయం వృధా అవుతుంది.

3. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలో ఉన్న పాజిటివ్ విషయాల గురించి  ప్రతిరోజూ రాసుకోండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ ఉంటే మీలో చాలా గొప్ప లక్షణాలు బయటపడతాయి.

4. మీరు అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు మనస్ఫూర్తిగా నవ్వండి. ప్రేమగా మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ నాలుగు మాటలు చెప్పండి.

5. మీ బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలుసుకుని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీ బలాల విషయంలో మిమ్మల్ని మీరు అభివృద్ది చేసుకుని మీ బలహీనతలను దూరం చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి.

6. మిమ్మల్ని ఆనందంగా ఉంచే పనులు చేయండి. మీకు ఇష్టమైన హాబీలు కొనసాగించండి.  మనలో చాలామంది ఎదుటి వారు మనల్ని ఆనందంగా ఉంచాలి అని కోరుకుంటారు.  మనకి మనమే ఆనందాన్ని సృష్టించ కలిగినప్పుడు ఎదుటివారి కోసం ఎదురుచూడడం ఎందుకు? ఎదుటి వాళ్లు మిమ్మల్ని ఆనందంగా ఉంచాలని అనుకోకండి.  మీ ఆనందమే మీకు  ప్రధానం.

7. మీరు సాధించిన విజయం చిన్నదైనా, పెద్దదైనా సెలబ్రేట్ చేసుకోండి. మీరు సాధించిన విజయాలన్నీ ఒకచోట రాసుకోండి. మీరు ఏదైనా సాధించినప్పుడు మీకు మీరు ఒక చిన్న పార్టీ ఇచ్చుకోండి.  ఉదాహరణకు  ఒక ఆరోగ్యకరమైన అలవాటు చేసుకున్నా లేదా అనారోగ్యకరమైన అలవాట్లు వదులుకున్నప్పుడు ఇలా మీ గురించి మీరు గర్వపడే విజయాలు సాధించిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు అభినందించుకోండి.

8. మీ మీద మీకున్న ప్రేమను మీరు చేసే పనుల ద్వారా వ్యక్తపరచండి. మీ శరీరాన్ని ఆరోగ్యకరమైన,రుచికరమైన ఆహారంతో మరియు వ్యాయామంతో గొప్పగా మార్చుకోండి. పాజిటివ్ ఆలోచనలు మరియు ఎమోషన్స్ తో మీ మైండ్ ని,  ప్రార్థన మరియు మెడిటేషన్ తో మీ ఆత్మ ని గొప్పగా మార్చుకోండి. మీ శరీరానికి, మీ మైండ్ కి, మీ ఆత్మకి ప్రతిరోజు మీరు ఏమిస్తున్నారో  స్పృహతో ఉండి గమనించండి.

9. అప్పుడప్పుడు మీరు మీ లా ఉన్నందుకు మీకు మీరు బహుమతులు ఇచ్చుకోండి. మీ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు గొప్ప విజయాలు అవసరం లేదు.  ప్రతీరోజు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొంటూ మీ జీవితాన్ని జీవించడమే గొప్ప విజయం.

10. మీతో మీరు మంచి సమయం గడపండి. ఏదైనా పుస్తకం చదువుతూ, మెడిటేషన్ చేస్తూ  లేదా మీకు ఆనందాన్ని ఇచ్చే మరేదైనా చేస్తూ మీతో మీరు కాస్త సమయం గడపండి.  మీ లక్ష్యాల గురించి ఆలోచించి మీ జీవితాన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి.

11. మీరు గతంలో సాధించిన వాటి గురించి గర్వపడండి. మరియు మీరు సాధించబోతున్న వాటి గురించి దృఢనిశ్చయంతో ఉండండి.  మీరు సాధించిన మెడల్స్ మీకు సులువుగా కనబడే చోట పెట్టుకోండి.  దీనివల్ల మీరు గతంలో సాధించిన విజయాలు మీకు  ఎప్పుడూ గుర్తు ఉంటాయి.

12. మిమ్మల్ని మీరు మెరుగైన వ్యక్తిగా మార్చుకోవడానికి ఎప్పుడు కట్టుబడిఉండండి. ఎందుకంటే మీకు మీరు మరియు మీ జీవితం ముఖ్యం.  మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అద్దంలోకి చూస్తూ నేను ప్రతిరోజు ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పండి.

13. ఎదుటి వారికి మీ మీద ఉన్న అభిప్రాయాలు మీరు మీ మీద అభిప్రాయాలు ఏర్పరుచుకునే లాగా చేయనివ్వకండి. మిమ్మల్ని విమర్శించేవారు మీలో తప్పులను చూపించే వారు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయనీయకండి. వాళ్ళ అభిప్రాయాలే మీరు మీ గురించి చెప్పుకునే మాటలు అవ్వకుండా  జాగ్రత్త వహించండి వాళ్ళని క్షమించి  ముందుకు సాగిపోండి.

14. మీతో మీరు పాజిటివ్ గా మాట్లాడుకోండి మిమ్మల్ని మీరు ప్రోత్సహించే మాటలు చెప్పుకోండి

15. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు క్షమించండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదని గుర్తుంచుకోండి.

16. తరచూ ఈ క్రింద చెప్పిన మాటలు మీతో మీరు చెప్పుకోండి.

1. నాకు ఆరోగ్యకరమైన శరీరం ఉన్నందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను

2. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను

3. నాలో అణువణువు నేను ప్రేమిస్తున్నాను

4. జీవితం నాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది

5. ఎల్లప్పుడూ దైవం నన్ను నడిపిస్తూ ఉంటుంది

మిమ్మల్ని మీరు ప్రేమించుకోడానికి సహాయపడే కొన్ని సూచనలు ఇవే.  మనల్ని మనం ప్రేమించడం చాలా ముఖ్యం.  ఎందుకంటే మనకి అందరికంటే దగ్గర అయిన వ్యక్తి మనం మాత్రమే. మనల్ని మనం ప్రేమించుకోకపోతే ప్రేమ అనే ప్రయాణం అసంపూర్ణంగా ఉండిపోతుంది.  మిమ్మల్ని మీరు అంగీకరించండి మీమీద మీకు ఎలాంటి అంచనాలు లేకుండా షరతులు లేకుండా ప్రేమించుకోండి.

మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. – లూయిస్ హే

Registration

Forgotten Password?

Loading