మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడవడానికి చాలా కష్టపడ్డాం. అలా నడిచే క్రమంలో ఎన్నో సార్లు పడిపోయాం. కానీ నడవడానికి చేసే ప్రయత్నం మాత్రం ఆపలేరు. ఆఖరికి ఒక రోజు మనం నడవడం మొదలుపెడతాం. క్రమేణా మనకి నడవడం పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం పరిగెడతాం, గంతులు వేస్తాం. శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉంటాం. మనకి ఎప్పుడు అమితమైన శక్తి ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా ఆడుకోవడానికి సిద్ధంగా ఉంటాం. పెరుగుతున్న కొద్దీ కదల కుండా ఉండటానికి అలవాటు పడిపోతాం. ఈ మోడల్ ప్రపంచంలో ఉన్న సౌకర్యాలు మన జీవన విధానం మనల్ని అలా తయారుచేసాయి.
ఇప్పుడు మన ఇళ్ళల్లో పని మనుషులు ఉన్నారు. మన ఇంట్లో పని చేయడానికి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఈ టెక్నాలజీ వల్ల పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. మన ఆఫీస్ పని ఎక్కువగా మానసికంగా ఉంటుంది తప్ప, శారీరకశ్రమ తక్కువే. మనం ఎక్కువ నడవడం లేదు. ఏ పనైనా ఇంట్లో ఉండి కనీసం బయటికి వెళ్ళనవసరం లేకుండా చేయవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళాలి అన్నా మనకి కార్ లు లేదా, బైక్స్ వున్నాయి. ఈ మార్పులన్నీ మన జీవితంలో పెద్ద కదలిక లేకుండా చేశాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కావాలని శారీరక శ్రమ చేస్తే తప్ప శారీరక శ్రమ ఉండే అవకాశం లేదు.
మనం శారీరకంగా దృఢంగా ఉండడానికి ఉన్న సులువైన పద్ధతి నడవడం. దీనికి ఎలాంటి యంత్రాలు, ప్రత్యేక ప్రదేశాలు అవసరం లేదు. మనం ఎక్కడైనా నడవచ్చు. మన బాల్కనీలో, టెర్రస్ పైన, హాల్లో ఎక్కడైనా. మనం నడవాలి అనుకుంటే చాలు. నడవడం అనేది మనం చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకున్నాం కాబట్టి దానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. నడవడం అనేది శారీరకంగా మానసికంగా ఎమోషనల్గా ఎన్నో లాభాలను ఇస్తుందని సైన్స్ చెప్తుంది.
నడవడంవల్ల వచ్చే లాభాలు ఏమిటి ? ఇప్పుడు చూద్దాం.
1. ఒక వ్యక్తి వారానికి నాలుగు గంటల కన్నా ఎక్కువ నడిస్తే అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని, గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది.
2. ఎక్కువ కదలిక లేకుండా గడపడంవల్ల వచ్చే మొదటి సమస్య ఊబకాయం. ఊబకాయం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నడవడం అనేది బరువును తగ్గించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఊబకాయం రాకుండా కాపాడుతుంది.
3. మన బీపీని నియంత్రిస్తుంది.
4. మన శరీరాన్ని సరైన విధంగా ఉంచుతుంది.
5. ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్లు కూడా డయాబెటిస్, ఎక్కువ కొలెస్ట్రాల్, ఎక్కువ బిపి లాంటి సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవి రాకుండా చూసుకోవడం చాలా సులువు. రోజు క్రమం తప్పకుండా నడవటం అనేది ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
6. మన శరీరానికి తనని తాను నయం చేసుకునే శక్తి ఉంది. నడవడం వల్ల ఆ శక్తి మరింత పెరుగుతుంది.
7. ఎముకల బలాన్ని పెంచుతుంది.
8. క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెంచుతుంది. సరైన నిద్ర మన శరీరానికి, మైండ్ కి, ఆత్మకి ఎంతో మేలు చేస్తుంది.
9. ఈ రోజుల్లో ఒత్తిడి అనేది చాలా సాధారణం అయిపోయింది. ఒత్తిడిని జయించడానికి నడక సరైన పద్ధతి.
10. మన శక్తిని పెంచి కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
11. నడక మన మూడ్ ని మెరుగు పరుస్తుంది.
12. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుకోవడానికి మన రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నడక మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
13. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తీసివేస్తుంది
14. రోజంతా బలంగా ఉండేలా చేస్తుంది.
15. నడక ఒక వ్యక్తిలో సృజనాత్మకతని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి
16. నిరాశను తగ్గిస్తుంది
17. ఆందోళనకి బాధకి విరుగుడుగా పనిచేస్తుంది
18. మన ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుంది దీనివల్ల మన ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది.
19. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
20. జీర్ణశక్తిని పెంచుతుంది.
21. జీవన ప్రమాణాన్ని పెంచుతుంది
నడవడం వల్ల ఉపయోగాలు ఇవే. నడవడం చాలా సులభం.
నడవడం వల్ల మరిన్ని లాభాలు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
1. నడిచేటప్పుడు మీకు సౌకర్యంగా ఉండే బట్టలు, షూ వేసుకోండి. షూ వేసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది.
2. మొదట రోజుకి 15 నిమిషాలు మొదలు పెట్టండి. తరువాత అలా పెంచుకుంటూ 60 నిమిషాలు నడవండి. మొదటి రోజే 60 నిమిషాలు నడవడం మొదలు పెడితే కష్టంగా అనిపించి పూర్తిగా మానేసి అవకాశం ఎక్కువ ఉంటుంది.
3. మొదట మెల్లగా నడవండి తర్వాత వేగం పెంచండి.
4. మీకు దగ్గరలో ఏదైనా గార్డెన్ గాని పార్కు గానే ఉంటే అక్కడ నడవండి. ప్రకృతిలో నడవడం అనేది మరింత లాభాల్ని చేకూరుస్తుంది.
5. నడిచేటప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వడం వల్ల శారీరకంగా మానసికంగా ఎమోషనల్గా ఎన్నో లాభాలు ఉన్నాయి.
6. నడకని ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తే ప్రతి రోజు చేస్తారు. నడవడాన్ని ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. నడుస్తుండగా Awareness కలిగి ఉండండి. దీనివల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది. నడిచేటప్పుడు awareness ఎలా కలిగి ఉండాలి ? చాలా సులభం. మీరు వేసే ప్రతి అడుగుని గమనించండి. అక్కడక్కడ మీ awareness తప్పినా మళ్ళీ మెల్లగా గమనించండి.
2. నడుస్తుండగా మీరు డీప్ బ్రీథింగ్ చేయవచ్చు. ఒక అడుగు వేయగానే శ్వాస తీసుకోవడం ఇంకొక అడుగు వేయగానే శ్వాస వదలడం చేయవచ్చు.
3. మీకు నచ్చిన మంత్రాన్ని జపిస్తూ నడవచ్చు.
4. మిమ్మల్ని ఉత్సాహపరిచే మ్యూజిక్ లేదా మీకు నచ్చిన మంత్రాలు వింటూ నడవచ్చు.
5. సానుకూల ప్రభావం చూపించే మాటలు ఉదాహరణకి నేను ఆరోగ్యంగా ఉన్నాను. నన్ను క్షమించు కొంటాను. నేను దయ కలిగిన వాడిని. నేను ఆనందంగా ఉన్నాను లాంటివి చెప్పుకుంటూ ఉండవచ్చు.
6. మీతో మీరు మాట్లాడుకుంటూ నడవచ్చు. నన్ను నేను ప్రేమిస్తున్నాను ఇలాంటివి చెప్పవచ్చు.
7. మోటివేషనల్ లేదా ఆడియో బుక్స్ వింటూ నడవచ్చు.
7. కృతజ్ఞత కలిగి ఉండటం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా మీకు నడవడం విసుగ్గా అనిపిస్తే దాన్ని మరింత ఆసక్తిగా ఆనందకరంగా మార్చుకోండి.
నడక నుంచి మరిన్ని లాభాలు పొందడానికి కొన్ని సూచనలు ఇవే. ఇది చాలా సులువైన మరియు ఎన్నో లాభాలు ఉన్న పద్ధతి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. కానీ అసలైన రహస్యం మన కాళ్ళ లోనే ఉంది. కాబట్టి ఈరోజే నడవడం మొదలు పెట్టండి.
నడుస్తూ ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.