మిమ్మల్ని అడ్డుకునే నమ్మకాలనుండి బయట పడడానికి 5 సూచనలు

నమ్మకాలను పరిమితం చేయడం
Share

మన మనసుకు నచ్చింది చేస్తూ మన కలలను సాకారం చేసుకోవాలని మనందరం కోరుకుంటాం. మనలో కొంతమంది వారు అనుకున్నది సాధించడానికి ప్రాణం పెట్టి కష్టపడతారు. మన ప్రయత్నాన్ని, మన సమయాన్ని, మన ఆలోచనలని, మన కష్టాన్ని పెట్టి పని చేస్తాం. కొన్నిసార్లు ఎలాంటి ఫలితమూ కనపడదు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, వంద శాతం కష్టపడినా ఎందుకు మన కలలు నిజం కావట్లేదో అర్థం కాదు.

మన కలల కోసం కష్టపడే సమయంలో మనం అందరం మర్చిపోయే ఒక ముఖ్యమైన విషయం, మన నమ్మకాలు. మనలో నెగిటివ్ నమ్మకాలు లేదా మనల్ని అడ్డుకునే నమ్మకాలంటే మనం అనుకున్నది సాధించడం అసాధ్యం. కొన్నిసార్లు ఒకే సమస్యతో ఎన్నో ఏళ్ళు ఉండిపోతాము.  ప్రతిదీ ప్రయత్నిస్తాము. కానీ ఎక్కడా విజయం దొరకదు. దీనికి కారణం మన నమ్మకాలు. మనల్ని అడ్డుకునే నమ్మకాలు ఉండడంవల్ల మన జీవితం ఎలా ప్రభావితం అవుతుందో ఇప్పుడు చూద్దాం.

మనకి ఎన్నో నమ్మకాలు ఉంటాయి. కొన్ని మనకి మంచివని, కొన్ని మనకి చెడ్డవి అని ఇలా కొన్ని నమ్మకాలు ఉంటాయి. నమ్మకం అనే దానికి నిర్వచనం ఏమిటంటే “మీరు ఎలాంటి ఆధారం లేకుండా ఇది నిజం అని నమ్మేది మీ నమ్మకం”. చాలా నమ్మకాలు మనం తరచూ చూసిన లేదా విన్న, చదివిన, అనుభవించిన అనుభవాల నుండి ఏర్పడతాయి. అవి నిజం అవ్వాల్సిన అవసరం లేదు. మన తల్లిదండ్రులు, టీచర్స్, మన అనుభవాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఇలా చాలా విషయాలు మన నమ్మకాలు రూపుదిద్దుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

మనం గతంలో మనకి తెలియకుండానే ఈ నమ్మకాల ని ఏర్పరుచుకుని ఈ నమ్మకాల ఆధారంగా ప్రస్తుత జీవితాన్ని, భవిష్యత్తులో రాబోతున్న జీవితాన్నిప్లాన్ చేసుకుని  జీవిస్తాం. ఈ నమ్మకాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం.

టీనేజ్ లో ఉన్న ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ ఉంది అనుకుందాం. ఆ అమ్మాయి అతన్ని మోసం చేసింది. ఈ అబ్బాయి కూడా ఆ విషయం మర్చిపోయి ముందుకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరంగా ఇతని బెస్ట్ ఫ్రెండ్ ను కూడా ఒక అమ్మాయి మోసం చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయి తనకి తెలియకుండానే ‘అందరు అమ్మాయిలు మోసం చేస్తారు’ అనే నమ్మకాన్ని ఏర్పరుచుకునే అవకాశం ఉంది. ఈ నమ్మకం ఏర్పరచుకోవడానికి అతనికి రెండు అనుభవాలు సహాయం చేశాయి. ఈ నమ్మకం ఇతని విషయంలో నిజమే. ఈ రెండు సంఘటనల తర్వాత అతను ఈ నమ్మకం ఆధారంగా తన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు.  ఇప్పుడు పెళ్లి చేయడానికి చూస్తున్నారు. అతను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా ఎక్కడో తన లోపల పెళ్లి అనే బంధం లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదు.  తనకి తెలియకుండా తనలో ఉన్న ఈ నమ్మకం తనకు గుర్తు చేస్తూ ఉంటుంది ‘అమ్మాయిలు అందరూ మోసం చేస్తారు’ అని. అందుకని ఎలాంటి కారణం లేకుండా అతని పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలా కష్టపడి తర్వాత పెళ్లి అయినా తన భార్య తనని మోసం చేస్తుంది అనే భయాన్ని అతను మోస్తూ ఉంటాడు. ఎలాంటి కారణం లేకుండా తన భార్యని అనుమానిస్తున్నట్లు ప్రవర్తిస్తాడు. దీనివల్ల వాళ్ళ బంధంలో సమస్యలు మొదలవుతాయి.

ఈ విధంగా  మనం తెలియకుండా ఏర్పరుచుకున్న నమ్మకాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

చాలాసార్లు మన లోపల ఈ నమ్మకం ఉంది అన్న విషయం మనకు తెలియదు. అది ఎప్పుడో జరిగి ఉండవచ్చు కానీ మనం ఎప్పటికీ ఆ నమ్మకాన్ని మోస్తూనే ఉంటాం. అలా మనకు ఉన్న నమ్మకాలు అన్ని మన subconcious mind లో ఉంటాయి.  మనం చేసే ప్రతి పని ఆ నమ్మకాల ఆధారంగానే ఉంటుంది. తెలుసో తెలియకో ప్రతీ ఒక్కరూ వాళ్లని అడ్డుకునే ఇలాంటి నమ్మకాల ను మోస్తూ ఉంటారు.

డబ్బే అన్ని చెడు పనులకి మూలం అని మీరు నమ్మితే, మీరు ఎంత కష్టపడ్డా, మీరు డబ్బుని ఎంత కోరుకున్నా మీకు డబ్బు రాదు.  ఎందుకంటే డబ్బు చెడ్డది అనే నమ్మకం మీలో ఉంది కాబట్టి. కాబట్టి మీ సొంత నమ్మకమే మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపుతుంది. ఈ విధంగా మన అమ్మకాలు మనకి విజయాన్ని లేదా అపజయాన్ని తీసుకువస్తాయి. కాబట్టి మీ నమ్మకాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అవే మీ ఆలోచనలని, నిర్ణయాలని, ప్రవర్తనని మీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి.  మీ ఆరోగ్యం, మీ సంపద, రిలేషన్ షిప్స్, విజయం, ఆనందం ఇలా జీవితంలో అన్ని మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.

గుడ్ న్యూస్ ఏంటంటే నేను నా నమ్మకాన్ని మార్చుకున్నట్టే మీరు కూడా మార్చుకోవచ్చు.  మీ ఎదుగుదలకి తోడ్పడే నమ్మకాలని ఏర్పరచుకోవచ్చు.  మిమ్మల్ని అడ్డుకునే నమ్మకాలకి బదులు మీ కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడే నమ్మకాలను ఏర్పరచుకోవచ్చు.

మీ ఎదుగుదలకు ఉపయోగపడే నమ్మకాల ని ఏర్పరుచుకోవడం ఎలాగో  5 దశలలో ఉదాహరణతో ఇప్పుడు చూద్దాం.

1. మీరు సాధించాలనుకుని సాధించలేక పోతున్న ఒక లక్ష్యాన్ని కనుక్కోండి. ఉదాహరణ:  బరువు తగ్గాలి అనుకోవడం.

2. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బరువు తగ్గడం విషయంలో మీ నెగిటివ్ నమ్మకం ఏమిటి ? నేను ఎంత కష్టపడినా ఎందుకు బరువు తగ్గలేకపోతున్నాను ? మీ సమాధానాలు ఒక పేపర్ మీద రాసుకోండి. మిమ్మల్ని అడ్డుకునే నమ్మకాలు ఈ విధంగా ఉండవచ్చు.

1. బరువు ఎక్కువగా ఉండటం అనేది నా జీన్స్ లోనే ఉంది.

2. నా తల్లిదండ్రులు లావుగా ఉంటారు కాబట్టి నేను బరువు తగ్గలేకపోతున్నాను.

3. నేను ఎక్కువ కాలం బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టలేక పోతున్నాను.

4. బరువు తగ్గడం అనేది చాలా కష్టం.

5. బరువు తగ్గడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఆకలితో మాడిపోవడం.

6. నేను తక్కువ తిన్నా లావైపోతాను

7. నేను ఏం తిన్నా లావైపోతాను

3. ఇలా మీలో ఉన్న నెగటివ్ నమ్మకాలని గుర్తించండి. మీ సంభాషణలు మరియు ఆలోచనలు శ్రద్ధగా వింటూ మిమ్మల్ని ఆపుతున్న నమ్మకాలు ఏంటో తెలుసుకోవచ్చు.

4. మీన నెగటివ్ నమ్మకాలు ఏంటో తెలుసుకున్న తర్వాత వాటిని తీసేసి వాటి స్థానంలో మీ ఎదుగుదలకు ఉపయోగపడే నమ్మకాలు ఏర్పరుచుకోవాలి. మీ నెగటివ్ నమ్మకాల ఆధారంగా ఒక కొత్త నమ్మకాన్ని ఏర్పరుచుకోండి. అవి ఈ విధంగా ఉంటాయి.

1. నా ఫిట్నెస్ నా చేతుల్లోనే ఉంది.

2. నేను ఒక సరైన స్ట్రాటజీతో ఉంటే నేను ఎప్పుడూ ఫిట్ గా ఉండగలను.

3. నేను చాలా తేలికగా బరువు తగ్గగలను.

4. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. నాకు కావలసినంత తిని కూడా నేను ఫిట్ గా  ఉండగలను.

5. ఫిట్నెస్ అనేది ఆరోగ్యకరంగా తినడం వల్ల వస్తుంది.

6. మీ పాత నమ్మకానికి వ్యతిరేకంగా ఉండే ఒక నమ్మకాన్ని ఏర్పరుచుకోండి.

5. ఇలా మీకు సహాయపడే నమ్మకాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాన్ని ఒక దృఢమైన నమ్మకంగా మార్చుకోవాలి. దానికి రెండు మార్గాలు ఉన్నాయి.

1. రోజూ మెడిటేషన్ చేస్తూ ఈ కొత్త నమ్మకాన్ని దృఢంగా మీలో ఏర్పరుచుకోవడం. నేను పాటించిన పద్ధతి ఇదే దీనివలన అద్భుతమైన ఫలితం ఉంటుంది

2. మీరు మెడిటేషన్ చేయకపోతే ఈ పద్ధతిని వాడవచ్చు. మీ కొత్త నమ్మకాన్ని నిజం చేసే కొన్ని ఉదాహరణలు మీరు తీసుకోవాలి. ఉదాహరణకి మీ కొత్త నమ్మకం బరువు తగ్గడం చాలా తేలిక అని అనుకుందాం. ఎవరైతే బరువు తగ్గి తరచూ బరువు తగ్గడం చాలా తేలిక అని చెబుతారో అలాంటి వారి మాటలు వినాలి. ఆ నమ్మకం నిజం అనే మీరు నమ్మే వరకు ఇదే పని చేయాలి.

ఈ విధంగా మిమ్మల్ని అడ్డుకునే నమ్మకాలను తొలగించి మీకు సహాయపడే నమ్మకాలని ఏర్పరచుకోవాలి. కొన్నిసార్లు ఈ మార్పు రాత్రికి రాత్రి జరగదు.  దీనికి సమయం అవసరం.  సమయం తీసుకుని మీ నమ్మకాలను మార్చుకోండి.  ఒక్కసారి మీ నమ్మకం మారిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యాలు, మీ కలలు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరైన నమ్మకం మీలో ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు ఒక దారి కనుగొంటారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు. సరైన వ్యక్తుల్ని కలుస్తారు.  కాలక్రమేణా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

మీ నమ్మకాలను మార్చుకుని మీ జీవితాన్ని మార్చుకోండి.

మీరు చేయగలరు అనుకున్నా లేదా చెయ్యలేము అనుకున్నా మీరు అనుకున్నది కరెక్టే. – హెన్రీ ఫోర్డ్

Registration

Forgotten Password?

Loading