సరైన విధంగా వాడుకుంటే ఉదయం అనేది ఒక రోజులో అత్యంత విలువైన సమయం. జీవితంలో ఎన్నో విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. మనం ఒక రోజుని ఎలా మొదలు పెడతాం, మరియు ఉదయం మనం ఏం చేస్తాం అనేది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఒకరోజు హడావిడిగా మొదలు పెడితే ఆరోజంతా అలానే ఉంటుంది. ఒక రోజుని బాధాకరమైన వార్తలు చదివి మొదలుపెడితే ఆ రోజంతా ఆందోళనగానే ఉంటుంది.
చాలామంది వాళ్లకి సమయం సరిపోవట్లేదు అనుకుంటారు. రోజుని హడావిడిగా మొదలుపెడతారు. అలానే ఆ రోజంతా హడావిడిగా ముగిసిపోతుంది. వాళ్ల ఉదయాన్ని అదుపు చేయ గలిగిన వారు జీవితాన్ని కూడా అదుపు చేయగలరు అంటారు. రోజంతా ఉత్సాహవంతంగా ఉండాలంటే ఉదయం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో విజయం సాధించడం యొక్క రహస్యం మనం ఉదయం ఏం చేస్తాం అనేదానిలోనే ఉంది
జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు ఉదయం లేవగానే ఏం చేస్తారు ? ఆశ్చర్యకరంగా విజయం సాధించిన చాలామందికి ఒకే రకమైన అలవాట్లు ఉంటాయి.
విజయం సాధించిన వారి 7 అలవాట్లు ఇప్పుడు చూద్దాం.
1. త్వరగా నిద్రలేవడం : వాళ్లు త్వరగా నిద్రలేస్తారు. ఆరు గంటల కన్నా ముందే నిద్రలేస్తారు. త్వరగా నిద్రలేవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉదయం మనం అనుకున్న దాని మీద ఏకాగ్రతగా ఉండగలం. మన సమయం మీద మనకు అదుపు ఉంటుంది. మనం ఆలస్యంగా నిద్రలేస్తే సమయం మనల్ని అదుపు చేస్తుంది. మీరు చేయవలసిన పనులు పరిస్థితులని అదే అదుపుచేస్తుంది. మనం త్వరగా నిద్ర లేస్తే అన్నీ మీ అదుపులో ఉంటాయి. మీరోజు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు. సమయం మీద అదుపు రావడం అనేది గొప్ప స్వేచ్ఛ. అలా చేయగలిగిన వారు జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించగలరు. కాబట్టి చాలామంది విజయం సాధించిన వ్యక్తులు త్వరగా నిద్ర లేస్తారు. Apple CEO tim cook ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తాడు.
2. వ్యాయామం : చాలా మంది విజయం సాధించిన వ్యక్తులు ఉదయం లేవగానే వ్యాయామం చేస్తారు. వ్యాయామం శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేసే సృజనాత్మకత పెంచి మన మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. మనకి ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. మన మానసిక శక్తిని పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన జీవితం కావాలంటే వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన రోజుని ఇలా ఆనందకరంగా శక్తివంతంగా మొదలుపెడితే ఆ రోజంతా అలానే ఉంటుంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా తన రోజున మొదలు పెట్టేముందు వ్యాయామం చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు.
3. ప్రణాళిక : వాళ్ల రోజుని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు. ముఖ్యమైన విషయాలు ఉదయమే చేస్తారు. అలా ఒక ప్రణాళిక ప్రకారం చేయడంవల్ల సమయం వృధా అవడం తగ్గుతుంది. దానివల్ల పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. మనలో చాలామంది సమయం సరిపోవట్లేదు అని అంటారు. దానికి కారణం మనకి ఒక ప్రణాళిక లేకపోవడమే. ఏది ముఖ్యమైనదో, ఏది ముఖ్యం కాదో ఆలోచించండి. అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది. ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి అనుకున్న దానికన్నా ఎక్కువ పని చేయగలం. సరిగా ప్రణాళిక లేని రోజులు మనకు ఎన్నో సమస్యల్ని తీసుకువస్తాయి. కాబట్టి ఒక ప్రణాళిక చాలా ముఖ్యం. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ తన రోజు ఎలా ఉండబోతుంది అని ముందే ఒక 10 నిమిషాలు విజువలైజ్ చేసుకుంటాడు.
4. మెడిటేషన్ : ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చాలా గొప్పగా పనిచేస్తుంది. ఈ విశ్వం తో అనుసంధానం చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గం. జీవితంలో విజయం సాధించడానికి, మన ఆలోచనలో స్పష్టత రావడానికి, సృజనాత్మకతకి, మానసికంగా దృఢంగా ఉండడానికి, ఏకాగ్రత పెరగడానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో విజయం సాధించిన చాలామంది తమ రోజుని మెడిటేషన్ తో మొదలుపెడతారు. కేవలం కొన్ని నిమిషాల మెడిటేషన్ తో ప్రశాంతమైన స్థితిలోనికి వెళతారు. LinkedIn CEO Jeff Weiner తన రోజునే మెడిటేషన్ తో ప్రారంభిస్తారు. అలాగే తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా మెడిటేషన్ చేయమని ప్రోత్సహిస్తాడు.
5. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చెయ్యండి : మనం తినే ఆహారం మన శరీరానికి ఇంధనము లాంటిది. ఆ రోజంతా మన శరీరం ఎలా పనిచేయాలో అదే నిర్ణయిస్తుంది. మనం ఒక రోజుని అనారోగ్యకరమైన ఆహారంతో మొదలుపెట్టినా లేదా అసలు తినకపోయినా రోజంతా ఎనర్జీ గా ఉండటం సాధ్యపడదు. అనారోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ మన శక్తిని నిర్వీర్యం చేస్తుంది. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మన రోజుని ఆరోగ్యకరమైన ఆహారంతో మొదలు పెట్టాలి. వర్జిన్ గ్రూప్ అధినేత Richard Branson ఉదయం పళ్ళు, muesli బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటాడు.
6. పాజిటివ్ విషయాలు చదవడం : వాళ్లు తమ రోజుని పాజిటివ్ విషయాలు చదవడం ద్వారా ప్రారంభిస్తారు. అలా చేయడం వల్ల ఆ రోజంతా పాజిటివ్ గా ఉంటుంది. చదువు అనేది మన ఆలోచనా పరిధిని పెంచుతుంది. కొత్త ఐడియాలు వస్తాయి. ముఖ్యమైన పనులు చేయడానికి మనకి కావాల్సిన బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఉదయమే మిమ్మల్ని ప్రోత్సహించే పాజిటివ్ విషయాలు చదవడం చాలా మంచి పద్ధతి.
7. ముఖ్యమైనది ఏదైనా సాధించండి : జీవితంలో విజయం సాధించిన వారు ఉదయమే ఏదైనా ముఖ్యమైనది లేదా కష్టమైనది చేస్తారు. ఇలాంటి కష్టమైన పని ఉదయమే చేయడంవల్ల చాలా ఆత్మ విశ్వాసం వస్తుంది. విజయం మరిన్ని విజయాలను తెస్తుంది.
జీవితంలో విజయం సాధించిన వారు ఉదయం చేసే పనులు ఇవి. మన విజయాన్ని మన ఉదయం నిర్ణయిస్తుంది.
‘మీరు ప్రతీరోజూ ఉదయం ఎప్పుడు నిద్ర లేస్తారు. లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది మీ జీవితంలో ప్రతీదాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాగ్రతతో, సమర్థవంతంగా మొదలుపెట్టిన ఉదయాలు మన రోజుల్ని కూడా అలానే మారుస్తాయి. దానివల్ల మన జీవితం చాలా విజయవంతంగా మారుతుంది. మీరు నిద్ర లేచే విధానం మార్చుకోవడం ద్వారా మీ జీవితంలో ఏదైనా మార్చుకోవచ్చు. – Hal Elrod, the author of ‘The miracle morning.’