కొత్త అలవాటు నేర్చుకోవడానికి 7 మార్గాలు

కొత్త అలవాటు
Share

సెలవు రోజుల్లో కూడా మన అమ్మమ్మ ఉదయం 5 గంటలకు ఎందుకు లేస్తుంది? కొంతమంది తమ టవల్స్‌ను ఎన్నిసార్లు చెప్పినా షెల్ఫ్ లో ఎందుకు పెట్టలేరు ? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవి కాదని తెలిసి కూడా కొందరు డీప్ ఫ్రైడ్ స్నాక్స్ కోసం ఎందుకు ఆరాటపడతారు? ఏది తమకి అనుకూలంగా జరగగపోయిన కొంతమంది ఎలా సానుకూలంగా ఆలోచించగలరు ? గొప్పవి సాధించిన వారు నిలకడైన పనితీరుని అంత తేలికగా ఎలా కనబరచగలరు ?

మన చుట్టూ ఉన్న చాలామంది కొన్నేళ్లుగా మళ్లీ మళ్లీ అదే పనులు చేయడం మనం చూస్తాం. అదే ఆలోచన విధానాలు, అదే భావోద్వేగాలు సంవత్సరాలు కొనసాగుతాయి. మనల్ని మార్చడం ఎందుకు అంత కష్టం ? అదే తప్పులు చేయడానికి లేదా అదే మంచి పని మళ్ళీ మళ్ళీ చెయ్యడానికి కారణం ఏంటి ? కారణం అవి మనకు అలవాటుగా మారాయి. మన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మార్చాలనుకున్నా, మనలో చాలా మంది చేయలేకపోతున్నారు.  ఎందుకంటే అవి మన అలవాట్లుగా మారాయి. అలవాట్లను మార్చడం చాలా కష్టం. ఒక అలవాటును మార్చడం కష్టమే కాని అసాధ్యం కాదు.

అలవాటు అంటే ఏమిటి? మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేసే పనిని అలవాటు అంటారు. అవి అలా అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయ్. దానికి మోటివేషన్ గానీ, గుర్తు చేసుకోవడం గానీ అవసరం లేదు. మన ఆలోచనలు, ఎమోషన్స్ , మనం మాట్లాడే మాటలు మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటాయి. మనకున్న అలవాట్లని కలిపితే మన జీవితంలో కొంత భాగం. గొప్ప వ్యక్తులకి గొప్ప అలవాట్లు, సాధారణ వ్యక్తులకి సాధారణ అలవాట్లు ఉంటాయి. మనం విజయం సాధించాలన్నా, ఫెయిల్ అవ్వాలన్న అందులో మన అలవాట్ల పాత్ర చాలా ఉంటుంది.

అలవాట్లు ఎలా ఏర్పడతాయి? ఒకే పనిని కొంతకాలం పాటు మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి రోజూ మెడిటేషన్ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది అతనికి అలవాటుగా మారుతుంది. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు అరవడం (చిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి, చుట్టూ ఉన్నవాళ్ళ నుండి నేర్చుకున్నది) మొదలు పెడితే కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఏదైనా అలవాటుగా మారాలంటే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. అది మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అన్నది అనవసరం. ఎవరైనా బలవంత పెట్టడం వల్ల చేస్తున్నారా, లేక వాళ్ళ ఆసక్తి వల్ల, ఏదైనా సాధించాలని చేస్తున్నారా, లేదా తల్లిదండ్రుల్ని చూసి చేస్తున్నారా అనే కారణం అనవసరం. మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటు అవుతుంది.

ఒక కొత్త అలవాటుని ఎలా అలవాటు చేసుకోవాలి?

కొత్త అలవాటు చేసుకోవడానికి కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. చిన్నగా మొదలుపెట్టండి: ఉదాహరణకి, రోజుకి ఒక గంట నడవాలి అనే అలవాటు నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకుందాం. రోజుకి పది నిముషాలతో మొదలు పెట్టండి. లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు చాలా సంకల్పం ఉంటే కానీ మన మైండ్ చెయ్యడానికి ఇష్టపడదు. మనలో చాలామంది రోజువారీ పనుల్లో బిజీగా, కుటుంబ బాధ్యతలతో ఉండడం వల్ల ఒక కొత్త అలవాటుకి కావాల్సిన మోటివేషన్ ఉండదు. కాబట్టి చిన్నగా మొదలు పెడితే మనం ఆ అలవాటుకి కట్టుబడి ఉంటాం. మీరు అనుకున్న లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టండి. అవి విజయవంతంగా పూర్తిచేసినపుడు ఇంకా ఎక్కువ సాధించడానికి మీకు ఉత్సాహం వస్తుంది.

2. మీ లక్ష్యాన్ని చిన్నగా పెంచండి: ప్రతీరోజూ మీ లక్ష్యాన్ని చిన్నగా పెంచుకుంటూ వెళ్ళండి. రోజుకి ఒక గంట నడవాలి అనే లక్ష్యమే తీసుకుంటే మొదట్లో రోజుకి పది నిముషాలు నడవాలి అని పెట్టుకోండి. ఆ తర్వాత రోజుకి 30 సెకన్లు పెంచుకుంటూ వెళ్ళండి. రోజుకి గంటసేపు నడవాలి అనే లక్ష్యాన్ని వందరోజుల్లో చేరుకుంటారు. ఓపికగా ఉండలేక ఒకేసారి ఎక్కువ లక్ష్యం పెట్టుకోకకండి దానివల్ల మీరు మధ్యలోనే మానేస్తారు.

3. నిలకడ ముఖ్యం: క్రమం తప్పకుండా నిలకడగా ఉండడం అలవాటు చేసుకోవడానికి చాలా ముఖ్యం. మీరు పెట్టుకున్న చిన్నచిన్న లక్ష్యాలు క్రమం తప్పకుండా చెయ్యండి. ఒకవేళ పది నిముషాలు నడవడం కుదరని రోజుల్లో కనీసం ఐదు నిముషాలన్నా నడవండి. మీరు అనుకున్నది చెయ్యడం మాత్రయం ఒక్కరోజు కూడా మానవద్దు.

4. పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో వేరే ప్లాన్ ఉండాలి : కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. వర్షం, ఇంటిదగ్గర ఫంక్షన్, ఒంట్లో బాగోకపోవడం ఇలా కానెపు కూడా మీరు అనుకున్నది చేయలేని రోజుల్లో ఏం పర్లేదు. అందరికీ ఇలాంటివి ఎదురవుతాయి. తర్వాత ఎంత త్వరగా మళ్ళీ మన లక్ష్యాన్ని మొదలు పెడతాం అన్నది ముఖ్యం. వీలైనంత త్వరగా మళ్ళీ మీరు మొదలుపెట్టాలి. ‘ చేస్తే రోజూ చెయ్యాలి లేదా మానేయాలి” అనే ఆలోచన రానివ్వకండి. మధ్యలో విరామం వచ్చినా వీలైనంత త్వరగా మొదలు పెట్టండి.

5. ఉన్న అలవాటుతో పాటూ కొత్త అలవాటుని చేర్చండి: ఒక క్రొత్త అలవాటును చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దానిని ఇప్పటికే ఉన్న అలవాటుతో చేర్చండి. ఉదాహరణకు, మీ ప్రస్తుత అలవాటు బ్రష్ చేసుకోవడం. మీకు ఇప్పటికే ఉన్న ఈ అలవాటుతో రోజుకు 10 నిమిషాలు నడవడం అనే మీ కొత్త అలవాటును చేర్చవచ్చు . కాబట్టి మీరు బ్రష్ చేసుకున్న ప్రతిసారీ నడవండి. ఇలా చెయ్యడం వల్ల  కొత్త అలవాట్లను కొనసాగించడం సులభం అవుతుంది.

6. ఒక సమయంలో ఒక కొత్త అలవాటుని మాత్రమే మొదలు పెట్టండి: ఒక సమయంలో ఒకే అలవాటును నేర్చుకోండి. మీరు మీ క్రొత్త అలవాటును విజయవంతంగా నేర్చుకున్న తర్వాత, మీరు తదుపరి అలవాటుకు వెళ్ళవచ్చు. ఒకేసారి ఎక్కువ అలవాట్లను పెట్టుకుంటే  ఎక్కువకాలం కొనసాగించడం కష్టం అవుతుంది.

7. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి: మీరు అనుకున్న అలవాటుని ఒక వారం లేదా 15 రోజులు కొనసాగించిన తర్వాత ఒక కొత్త పుస్తకామో, లేదా మీకు నచ్చిన స్మూతీ చేసుకోవడం ఇలా మీ చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. దీనివల్ల ఇంకా కొనసాగించే ఉత్సాహం వస్తుంది.

పై దశలను ఉపయోగించి మీరు వ్యాయామం, వంట, ధ్యానం, రాయడం, డబ్బు ఆదా చేయడం వంటి ఏదైనా అలవాటును పెంచుకోవచ్చు. మీరు క్రొత్త అలవాటును ఏర్పరచుకున్న తర్వాత, అది మీ వ్యక్తిత్వంలో భాగం అవుతుంది ఆ అది ఆటోమాటిక్ గా జరిగిపోతుంది . మీ క్రొత్త అలవాటును కొనసాగించడానికి మీకు ఎటువంటి ప్రేరణ అవసరం లేదు.

“విజయం మరిన్ని విజయాలను ఇస్తుంది” లేదా “ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు, పేదవారు మరింత పేదవారు అవుతారు” ఇలాంటి కోటేషన్స్  వెనుక అలవాట్లే కారణం. ఒకరికి విజయం అలవాటు అయితే, వారు ప్రారంభించే ప్రతి కొత్త వెంచర్‌కు కూడా అదే అలవాటుని కొనసాగిస్తారు . ఒకరి అలవాటు ఫెయిల్  అవ్వడం అయితే , వారు వెళ్ళే ప్రతిచోటా అదే ఎదురవుతుంది. ఏ వయసులో అయినా ఉన్నవి మార్చుకుని, కొత్త అలవాటు చేసుకోవచ్చు. మీరు ఒక్క అడుగు ముందుకు వెయ్యడం మాత్రమే అవసరం.

మంచి అలవాట్ల ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకోండి.

Registration

Forgotten Password?

Loading