నిజాయితీ కలిగి ఉండడం వల్ల 8 ప్రయోజనాలు

నిజాయితీ
Share

ఎప్పుడూ నిజాలే చెప్పాలనీ, అబద్ధం ఆడకూడదు అని చిన్నప్పటినుంచి పెద్దవాళ్లు మనకి చెప్తారు. గొప్ప గొప్ప గురువులు మరియు అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారు అయిన ఎన్నో కథలు రామాయణ మహాభారతాలలో ఉన్నాయి. కానీ  ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్దాలు ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకువస్తుంది.

అబద్ధం చెప్పడం వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు చూద్దాం.

1. మనం అబద్దాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్దాలకోరుగా మారిపోతాము.

2. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటివాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం. కానీ మనం అబద్ధం చెబుతున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్ లో గాని, మనం పనిచేసే చోట గాని నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ల నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే.

3. అబద్ధం చెప్పేటప్పుడు మనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు. ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్ళడమే.

4. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది.

5. “మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది” అనేది ప్రకృతి నియమం. కాబట్టి ఎదుటివాళ్ళకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్దాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు.

6. అబద్దాలు చెప్పడం మొదలు పెడితే మనం నెగిటివ్ కర్మను సృష్టించుకోవడం మొదలుపెడతాం.

7. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతావు అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది.

8. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి.

9. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి.

10. మైండ్ లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి.

11. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఆ వ్యక్తిని అగౌరవ పరచడంతో సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ ని మనం బాధ పెట్టినట్టే.

అబద్దాలు చెప్పడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఇవి.

దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. మనం నిజాయితీగా ఉంటే ఎదుటివాళ్ళ నమ్మకాన్ని గౌరవాన్ని పొందుతాం. మనం ఉన్నతమైన స్థానానికి వెళ్లడానికి ఈ నమ్మకం చాలా ఉపయోగపడుతుంది.

2. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు. ఎందుకంటే మనం నిజాయితీ గా ఉంటామని వారికి తెలుసు కాబట్టి.

3. మన పిల్లలకి ఆదర్శవంతమైన వ్యక్తులుగా మనం ఉంటాం.

4. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది.

5. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది.

6. మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

7. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగు పరుస్తుంది.

8. మన ఆలోచనల్లో స్పష్టత తీసుకువస్తుంది.

కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది.

నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు ఇప్పుడు చూద్దాం.

1. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీ గా ఉండేలా చూసుకోవాలి.

2. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరు ఎవరికైనా నా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చేముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి. లేదంటే చేయలేను అని చెప్పండి.

3. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్దం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రుల్ని చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది.

4. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయట పడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి, తర్వాత దొరకక పోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి.

5. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఉదాహరణకి, ఎవరైనా హెయిర్ కట్ చేసుకుని వచ్చినప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా ఉంది అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే సరైన పద్ధతి.

6. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టవచ్చు. నిజాయితీ మరియు దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి.

7. మన విషయంలో కూడా మనం నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలు ఏమిటి ?  బలహీనతలు ఏమిటి ? అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి.

8. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాన్ని ఎక్కువగా చేసి చెప్తాం. అది కూడా అబద్ధం కిందికే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి.

మనలో చాలామంది అబద్ధం చెప్పడం అనే అలవాటును మానుకోవాలి అనుకుంటారు. కానీ ఎలా ?

1. అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండాలి.

2. మనం మాట్లాడుతున్నప్పుడు awareness కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి.

3. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి వస్తుంది.

4. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవునికి ప్రార్థన చేయండి.

నిజాయితీగా నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన సూచనలు ఇవే. మన పురాణాలలో ఒక గొప్ప మాట ఉంది. సత్యమేవ జయతే. అంటే ఎప్పటికీ సత్యం మాత్రమే గెలుస్తుంది అని. కాబట్టి మన జీవితంలో నిజాన్ని నింపుకుందాం.

సత్యమేవ జయతే.

Registration

Forgotten Password?

Loading