డైట్ అవసరం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి 8 వేద సూచనలు

ఆరోగ్యకరమైన ఆహారం
Share

గాలి మరియు నీరు తరువాత భూమి మీద మన జీవితాన్ని నిలబెట్టే ముఖ్యమైనది ఆహారం. వేదాలు ఆహారాన్ని దైవంలా పరిగణిస్తాయి. ఆహారం పవిత్రమైనది మరియు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ భూమి మీద అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలు మన కుటుంబం వల్ల, కొన్ని సంప్రదాయం ప్రకారం, కొన్ని మనం జీవిస్తున్న ప్రాంతంబట్టి ఉంటాయి. ఇప్పుడు ప్రపంచమే చిన్న గ్రామంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అనేక రకాలైన ఆహార పదార్థాలకు మనం అలవాటు పడుతున్నాము. మన చుట్టూ ఎన్నోరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో నుండి సరైనవి మనం ఎంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మనమందరం ప్రయత్నిస్తాము ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని మరియు బరువును ప్రభావితం చేస్తుందని మనకి తెలుసు. కానీ ఆహారాన్ని మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం, కానీ ఆహారాన్ని సరైన మార్గంలో తినడం కూడా చాలా ముఖ్యం.  ఎందుకంటే సరైన ఆహారాన్ని సరైన విధానంలో తిన్నప్పుడు అది విషపూరితం మరియు అనారోగ్యంగా మారుతుంది. మనం తినేది ముఖ్యం.  అంతే కాకుండా ఎలా తినాలో మరింత ముఖ్యం. మనం సరైన మార్గంలో ఆహారాన్ని తినగలిగితే, మనం అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఆహారాన్ని సరైన మార్గాల్లో తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. సరిగ్గా తినడం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మనస్పూర్తిగా తినడం: మనస్పూర్తిగా తినడం అంటే ఆహారంలోని ప్రతీ అణువుని awareness తో తినడం. తినేసమయంలో టీవి చూడడం లేదా మాట్లాడుతూ తినడం వల్ల అసలు తినే ఆహారం యొక్క రంగు, రుచి కూడా గమనించకుండా తింటున్నాం. Awareness తో తినకపోవడం వల్ల మనకి అవసరమయిన దానికంటే ఎక్కువ తింటున్నాం. మనస్పూర్తిగా తినడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. ఎప్పుడు తినడం ఆపాలో మనకి తెలుస్తుంది

2. ఆహారాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం

3. ఎంత తినాలో అంత మాత్రమే తింటాం

2. నమలడం : ఆహారాన్ని నమలడం చాలా ముఖ్యం. ఆహారాన్ని సరిగ్గా నమిలినప్పుడు, లాలాజలంలోని ఎంజైమ్‌లు ఆహారంతో కలిపి జీర్ణక్రియ సులభం అవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కడుపు తేలిక అవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. ఇది ఆహారం నుండి పోషకాలను ఎక్కువ గ్రహించేలా చేస్తుంది.

2. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మరియు శరీరంలో ఆమ్లాలు మరియు టాక్సిన్స్ లేకుండా ఉంటుంది

3. బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది

4. ఆరోగ్యం మెరుగుపరుస్తుంది

నమలడం నుండి ప్రయోజనాలు పొందడం కోసం  32 సార్లు ఆహారాన్ని నమలడం మంచిది. ఆహారం విషయంలో ఒక సామెత ఉంది.  మీ ఆహారాన్ని తాగండి, నీళ్ళను నమలండి. అవును, అంటే ఆహారాన్ని బాగా నమిలి, అది దాదాపుగా ద్రవంగా మారుతుంది. అప్పుడు మింగాలి. నీటిని తక్కువ తక్కువగా తీసుకోవాలి. తినేటపుడు నీరు ఎక్కువ తాగకూడదు.

3. తినే ఆహారం యొక్క పరిమాణం: అందరికీ ఒకే పరిమాణంలో ఆహారం అవసరం అని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. అవసరమైన దానికంటే తక్కువ లేదా ఎక్కువ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. రెండు భాగాల ఆహారం, ఒక భాగం నీరు, ఒక భాగం గాలి మనం తీసుకోవాల్సిన సరైన ఆహారం అని ఆయుర్వేదం చెప్తుంది. దీని అర్థం ఏమిటంటే మన జీర్ణాశయంలో గాలికి కూడా కాస్త చోటు ఉంచాలి. అతిగా తినడం వల్ల జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. ఎంత అవసరమో అంతే తినడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. జీర్ణ శక్తి పెరుగుతుంది

2. బరువు తగ్గడానికి మరియు సరైన బరువును కొనసాగించడానికి సహాయపడుతుంది.

4. కృతజ్ఞత: తినేముందు ఆహారం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి చిన్న ప్రార్థన చెయ్యడం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనది. ఈ ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలకి ఆహారం లేదు. కానీ మనకి తినాలనుకున్నప్పుడల్లా ఆహారాన్ని తినగలిగే అవకాశం ఉంది. తినడానికి ముందు కృతజ్ఞత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

1. శరీరాన్ని, మైండ్ ని ఆహారం కోసం సిద్దం చేస్తుంది.

2. కృతజ్ఞత మంచి హార్మోన్స్ విడుదల అయ్యేలా చేస్తుంది. వాటివల్ల మనం మంచి వ్యక్తిగా తయారయ్యే అవకాశం ఉంటుంది.

3. ఆహారాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తుంది

మీరు ఏదైనా తిన్న ప్రతిసారీ, మీకు ఆహారాన్ని అందించినందుకు దేవునికి లేదా విశ్వానికి లేదా ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే ఒక సాధారణ ప్రార్థనని కృతజ్ఞత అని చెప్పవచ్చు.

5. సమయం: ప్రకృతిలో, ప్రతిదానికీ నిర్దిష్ట సమయం ఉంటుంది. ఒక లయ ఉంది. ఆహారాన్ని తినడం కూడా అదే. ఆయుర్వేద మరియు పురాతన గ్రంథాలు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం సమయంలో ఆహారం తినాలని సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకంటే జీవక్రియ రోజు చివరిలో మందగిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. పడుకోవడానికి ఒక గంట ముందు తినడం శరీర బరువును పెంచుతుంది మరియు ఆరోగ్యానికి అనారోగ్యకరమైనది. ఖాళీ కడుపుతో నిద్రకి వెళ్ళడం మంచి పద్దతి. రాత్రి భోజనానికి, పడుకోవడానికి మధ్య నాలుగు గంటల సమయం ఉండేలా చూసుకోవడం కష్టమని భావిస్తే పడుకోవడానికి గంట ముందు ఏదన్నా పండు తీసుకోవచ్చు. ఇలా అనుసరించడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. బరువు తగ్గడానికి మరియు సరైన బరువును కొనసాగించడానికి సహాయపడుతుంది.

2. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ మీద భారం పడకుండా శరీరం నూతన ఉత్సాహంతో ఉండడానికి అవసరమైన మరమత్తుల మీద శ్రద్ద పెడుతుంది. ఉదయం లేవగానే చాలా ఉల్లాసంగా ఉంటారు.

ఇది అమలు చేయడానికి కొంత సాధన మరియు ప్రణాళిక అవసరం. సూర్యాస్తమయం లో భోజనం చెయ్యడం కుదరకపోతే భోజనానికి నిద్రకు మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోండి.

6. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తినండి. ఆహారం జీర్ణం కావడానికి సగటున 4 గంటలు పడుతుంది. ఆహారం జీర్ణం కానప్పుడు మరియు ఆకలితో లేకపోయినా తింటున్నప్పుడు, అలాంటి ఆహారం కడుపుకు భారంగా మారి శరీరంలో విషాన్ని సృష్టిస్తుంది. ఆకలి లేనప్పుడు తినడం మానుకోండి.

7. మీరు కోపంగా లేదా విచారంగా ఉన్నప్పుడు ఆహారం తినవద్దు. మనసు బాలేనపుడు తినే ఆహారం శరీరానికి విషపూరితంగా మరియు అనారోగ్యంగా మారుతుంది. ఆహారం తినడానికి ముందు మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను శాంతపరచుకోండి మరియు తినేటప్పుడు సానుకూల విషయాల గురించి మాత్రమే మాట్లాడటం ముఖ్యం. మంచి విషయాల గురించి మాట్లాడటం సాధ్యం కాకపోతే మౌనం పాటించండి.

8. కూర్చుని మాత్రమే ఆహారం తినండి. నిలబడి తినడం వల్ల మీరు మనస్పూర్తిగా తినలేరు. కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మరియు మన కండరాలకి బలాన్ని ఇస్తుంది.

ఇవి సరైన ఆహారం తీసుకోవడానికి సూచనలు. ఈ సూచనలు కొన్ని ఓం స్వామి యొక్క పుస్తకం – Wellness Sense నుండి కృతజ్ఞతగా స్వీకరించబడ్డాయి. రోజువారీ జీవితంలో ఈ సూత్రాలను పాటిస్తున్నప్పుడు, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడం సులభం అవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినప్పుడు, బుద్ధిపూర్వకంగా, కృతజ్ఞతతో, సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు అది ధ్యానంతో సమానమైన అనుభవంగా మారుతుంది. ఇటువంటి ఆహారం శరీరానికి అమృతం అవుతుంది, ఇది ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇస్తుంది. తినేసమయంలో మౌనంగా ఉండాలని వేదాలు చెప్పడానికి కారణం ఇదే కావొచ్చు.

Registration

Forgotten Password?

Loading