కొన్నిసార్లు మనం జీవితంలో జరిగే అనేక విషయాలలో తలమునకలై ఉంటాము. ఇంట్లో అప్పుడే పుట్టిన బిడ్డ ఉండడం, లేదా ఏదైనా ఫంక్షన్ కోసం మొత్తం మీరు ప్లానింగ్ చేయాల్సి రావడం. ఆఫీస్ లో బాగా పని ఒత్తిడి, పనికి మీ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత కోసం ప్రయత్నించడం ఇలా సమయం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాల చేత మనకి వ్యాయామం చెయ్యడం కూడరాకపోవచ్చు. కానీ మనం ఎంత బిజీగా ఉన్న మన ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకూడదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం సామర్థ్యానికి తగ్గట్టు పనిచెయ్యగలం. ఆరోగ్యం లేకపోతే జీవితం యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించలేము.
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఆరోగ్యానికి పునాది వ్యాయామం. రోజూ చెయ్యాలి అని కాదు గానీ మన శరీరానికి అవసరమయిన వ్యాయామం మాత్రం అందరికీ అవసరం. కేవలం బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి మాత్రమే వ్యాయామం అవసరం అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. మనలో అందరికీ వ్యాయామం అవసరం ఎందుకంటే మన శరీర నిర్మాణమే ఆ విధంగా ఉంది. మనం తరచూ వ్యాయామం చేస్తే మన శరీరం దాని సామర్థ్యానికి తగినట్టు పనిచేస్తుంది. మన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ మంచి ఆకారంతో ఫిట్ గా, యంగ్ గా ఉంటాం.
కాబట్టి సమయం లేదని వ్యాయామం చెయ్యకుండా ఉండడం సరైన పద్దతి కాదు. మనలో చాలా మంది వ్యాయాయం చెయ్యాలి అనుకుంటారు కానీ జిమ్ కి వెళ్ళే సమయం గానీ, ఒక గంట నడిచే సమయం గానీ వాళ్ళకి ఉండదు.
కాబట్టి, మనకి సమయం లేకపోయినా వ్యాయామం చెయ్యడం ఎలా ? ఇప్పుడు చూద్దాం.
1. మెట్లని వాడండి : లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ కి బదులు మెట్లని వాడండి. దీనికి పెద్ద సమయం కూడా పట్టదు.కానీ మీ శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది. మెట్లు దిగడం సులువే కానీ మెట్లు ఎక్కడం కాస్త కష్టమే. మొదటి రోజు కొన్ని మెట్లు మాత్రమే ఎక్కండి. ఆ తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి. అంతేగానీ మీకు ఇబ్బందిగా ఉన్నా ఎక్కువ మెట్లు ఎక్కకండి. మన శరీరం మరియు ఊపిరితిత్తులు కాస్త అలవాటు పడాలి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అవి చాలా త్వరగా అలవాటు పడిపోతాయ్. మీ సామర్థ్యానికి మించి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరగా అలసిపోయే ఇక మెట్లు ఎక్కడ మానేయాలి అనిపించవచ్చు. రోజూ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతే అతి త్వరలోనే మీరు సునాయాసంగా ఎన్ని మెట్లయినా ఎక్కగలరు.
2. వాకింగ్ బ్రేక్ తీసుకోండి: కుర్చీలో కూర్చుని గంట అయితే లేచి కాసేపు అలా నడవండి. కనీసం 5 నిముషాలు అలా నడవండి. మీ పని రోజుకి 9 గంటలు అయితే గంటకి 5 నిముషాలు చొప్పున రోజుకి 45 నిముషాలు మీరు నడుస్తారు. ఇది చాలా మంచి వ్యాయామం. అద్భుతం కదా. ఇలా వాకింగ్ బ్రేక్ తీసుకోవడం వ్యాయామం మాత్రమే కాకుండా మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. మన మైండ్ చాలా బాగా పని చేస్తుంది. ప్రతీ గంటకి గుర్తు పెట్టుకుని మరీ 5 నిముషాలు నడవండి.
3. స్ట్రెచ్ : ఉదయం లేవగానే stretches చెయ్యండి. stretches చెయ్యడానికి మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు. మీరు మంచం మీదే చెయ్యవచ్చు. ఇలా చెయ్యడం ఆ రోజుకి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆరోజు కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. సానుకూల దృక్పథంతో రోజుని ప్రారంభిస్తారు. ఒక ఐదు నిముషాలు stretches చేసుకోవచ్చు. వీపు, కాళ్ళు, చేతులు, మెడని మెల్లగా తిప్పడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు.
4. ఐదు నిముషాలు సూర్య నమస్కారాలు చెయ్యండి: సూర్య నమస్కారాల వల్ల మన శరీరానికి, మైండ్ కి, మన ఆత్మకి ఎన్నో లాభాలు ఉన్నాయి. వేరే యోగాసనాలు ఎన్నో చేసిన ఫలితం ఒక్క సూర్య నమమస్కారాలు చెయ్యడం ద్వారా పొందవచ్చు. ఇవి చెయ్యడం తేలిక మరియు ఎక్కువ సమయం కూడా పట్టదు. ఉదయం టిఫిన్ చేసేముందు రోజూ ఒక ఐదు నిముషాలు సూర్య నమస్కారాలు చెయ్యండి. దీనివల్ల మన శరీరంలో ఉన్న అన్ని ప్రధాన అవయవాల ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. ఆలోచనలలో స్పష్టత మరియు మానసిక బలం పెరుగుతుంది.
5. వంట చేస్తుండగా వ్యాయామం చెయ్యండి: ఏదైనా వంట చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఏ వంట అయినా కనీసం ఒక 30 నిముషాలు పడుతుంది. కాబట్టి వంట చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు నిముషాలు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యండి. మీరు రోజుకి రెండు సార్లు వంట చేస్తే రోజుకి 5 నిముషాలు వ్యాయామం చెయ్యండి. గుర్తుంచుకోండి, ఎంత తక్కువసేవు చేసినా వ్యాయాయం మీ శరీరానికి ఎంతో కొంత మేలు చేస్తుంది.
6. TV లో యాడ్స్ వస్తున్నపుడు వ్యాయామం చెయ్యండి : టీవీలో గానీ, మొబైల్ లో గానీ ఏవైనా చూస్తున్నప్పుడు మనం యాడ్స్ రాగానే ఛానెల్ మార్చుతాo లేదా యాడ్స్ స్కిప్ చేస్తాం. ఇక నుండి అలా చెయ్యకండి. అవి మీకు వ్యాయామం చెయ్యాలి అని గుర్తుచేస్తున్నాయ్ అనుకోండి. యాడ్స్ రాగానే వ్యాయామం చెయ్యండి. చిన్నగా stretches గానీ, Jumping jacks లేదా అలా నడవండి చాలు. ఇలా చేస్తే రోజుకి ఒక గంట tv చూసినా కనీసం మనం 10-15 నిముషాలు వ్యాయామం చేస్తాం.
7. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నిలబడి ఉండండి లేదా నడవండి : మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడుస్తూ మాట్లాడండి. కుదరకపోతే కనీసం నిలబడి మాట్లాడండి. దీనివల్ల పెద్ద కష్టం లేకుండా శరీరానికి వ్యాయామం అందుతుంది. ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మనకి తెలియకుండానే మన శరీరానికి వ్యాయామం అందుతుంది.
8. నిలబడండి : 30 నిముషాలు కూర్చుని ఉంటే లేచి కాస్త stretches చెయ్యండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.అలా ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం చాలా ప్రమాదం. కాబట్టి ప్రతీ ముప్పై నిముషాలకి లేచి stretches చెయ్యండి.
మనకి సమయం లేకపోయినా వ్యాయామం చెయ్యడానికి కొన్ని సూచనలు ఇవి. కదలికకి ఉపయోగపడే విధంగా మన శరీరం నిర్మించబడినది. మనం ఎలాంటి కదలిక లేకుండా రోజూ గడిపేస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లని తక్కువ అంచనా వెయ్యకండి. మీ బిజీ జీవితంలో వీటిని చాలా తేలికగా చెయ్యవచ్చు ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు.
వ్యాయామం చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి.