అపరాధ భావం నుండి బయటపడడానికి 8 మార్గాలు

అపరాధ భావం
Share

జీవితంలో చాలాసార్లు తెలిసో, తెలియక మనం తప్పు చేస్తాం. మనకి తెలియకుండానే ఇతరులను బాధపెడతాం. కోపంలో మాటలు అనేసి ఆ తర్వాత అలా అన్నందుకు బాధపడతాం. కొన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటికోసం ఒక ప్లాన్ సిద్దం చేసుకుంటాం. కానీ మన అంచనాలకు తగ్గ జీవితాన్ని మాత్రం జీవించం. మనల్ని ప్రేమించే వారిని, మనల్ని మనం కూడా చిన్నబోయేలా చేస్తాం. ఇలాంటి పరిస్తితులు అపరాధ భావాన్ని సృష్టించి మనల్ని మనం క్షమించుకోవడం కూడా కష్టం అయ్యేలా చేస్తాయి. మనం చేసిన తప్పులని అంగీకరించలేము. వాటి గురించే ఆలోచిస్తూ అపరాధ భావం తో ఉంటాం.

ఈ అపరాధ భావన మనల్ని చాలా నెగెటివ్ గా ప్రభావితం చేస్తుంది. మనకి ప్రశాంతతని దూరం చేసి మనకి ఎలాంటి విలువ లేదనే భావాన్ని మన కళ్ళల్లో కనపడేలా చేస్తుంది. మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మనలో ఉన్న మంచి కూడా చూడకుండా చేస్తుంది. అంతేకాదు అపరాధ భావన మన శారీరక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసి రోగాల పాలు అయ్యేలా చేస్తుంది. మన రోగ నిరోధక శక్తిని తగ్గించి ఒత్తిడిని కలిగిస్తుంది. అపరాధ భావన శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా మనల్ని నెగెటివ్ గా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనల్ని మనం క్షమించుకుని అపరాధ భావన నుండి బయట పడడం చాలా ముఖ్యం.

మనల్ని మనం క్షమించుకోవాలి అని చెప్పడం తేలిక కానీ చెయ్యడం చాలా కష్టం.  మన గతాన్ని అంగీకరించి, అపరాధభావాన్ని దూరం చెయ్యడం సవాలే, కానీ మనం ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మనల్ని మనం క్షమించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అని దృఢమైన కోరిక ఉంటే మనల్ని మనం క్షమించుకునే  ప్రయాణాన్ని ప్రారంభించాలి.

కాబట్టి మనల్ని మనం క్షమించుకోవడం ఎలా? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.

1. అర్థం చేసుకోవడం : ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరూ పరిపూర్ణులు మరియు ఎల్లప్పుడూ కరెక్ట్ కాదు. ఎవరికీ ప్రతిదీ తెలియదు. జీవితంలో తప్పులు జరుగుతాయి. మనం జీవితంలోఎదుగుతున్నప్పుడు మనం తప్పులు చేస్తాము. కాబట్టి, మీరు గతంలో చేసిన  తప్పుల గురించి బాధపడకండి. తప్పులు చేయడం ఎదిగే ప్రక్రియలో భాగమని అర్థం చేసుకోండి. తప్పులు లేకుండా జీవితంలో ఎదుగుదల లేదు.

2. పాఠాలు నేర్చు కోండి : ఏదైనా తప్పు చేసినప్పుడు దాని గురించి అపరాధ భావంతో ఉండడం కన్నా ఆ అనుభవం నుండి ఒక పాఠం నేర్చుకోవడం మంచిది. ఈ పరిస్థితుల నుండి మీరు ఏ పాఠం నేర్చుకుంటారు ? మీ ప్రవర్తనలో మార్చుకోవలసినది ఏమిటి ? మీరు పాఠాలు నేర్చుకుంటే మీరు చేసిన తప్పులు వల్ల మీరు మంచి వ్యక్తిగా మారుతారు. దాని వలన మీ అపరాధభావం తగ్గుతుంది. మీరు పాఠాలు నేర్చుకుంటే మీరు చేసిన తప్పులే మీకు గొప్ప సాధనాలుగా ఉపయోగపడి మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇవి మీ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుతాయి.

3. మీ విషయంలో కరుణ కలిగి ఉండండి : మీ విషయంలో కాస్త కరుణ కలిగి ఉండండి. మీ పిల్లలు తప్పు చేసినప్పుడు మీ పిల్లలని క్షమించడానికి మీరు మొగ్గుచూపుతారు. అదేవిధంగా మీరు తప్పు చేసినప్పుడు క్షమించండి. మిమ్మల్ని మీరు ఒక చిన్న పిల్లాడిగా చూసుకోండి.

4. మెడిటేషన్ సాధన చేయండి : గతాన్ని అంగీకరించడానికి మెడిటేషన్ ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి. అవతలి వ్యక్తి మనల్ని క్షమించినా మనం ఇంకా ఆ బాధని, అపరాధ భావాన్ని మోస్తూనే ఉంటాం. మెడిటేషన్ చేసినప్పుడు ఈ అపరాధ భావం పోతుంది. కాబట్టి ప్రతి రోజూ కాసేపు మెడిటేషన్ చేయండి. గతాన్ని మర్చి పోయి ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించడానికి మెడిటేషన్ చాలా మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.

5. ఈ మాటలు మీతో చెప్పుకోండి : మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి మనతో మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి. అపరాధ భావానికి తొలగించడానికి కొంత సమయం పడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఈ ప్రయాణంలో ఈ మాటలు మీకు స్నేహితుల్లా సహకరిస్తాయి. మీతో మీరు ప్రతిరోజు పాజిటివ్ మాటలు చెబుతూ ఉంటే ఆ గతం నుండి బయటకు రావడం తేలిక అవుతుంది. ఈ కింది వాటిలో మీకు నచ్చిన మాటలని మీతో రోజు చెప్పుకోండి.

1. నన్ను నేను క్షమిస్తాను

2. నాలో ఉన్న అపరాధభావాన్ని ఈ క్షణమే విడుదల చేస్తున్నాను.

3. నామీద నాకు కరుణ ఉంది

4. నన్ను నేను ప్రేమిస్తున్నాను.

5. నా గతం విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాను

6. ప్రస్తుతం మరియు భవిష్యత్తు మీద మీ దృష్టి నిలపండి : గతాన్ని వదిలి ముందుకు సాగిపోండి. గతం గతః. మీరు ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా గతాన్ని మీరు మార్చలేరు. కాబట్టి గతాన్ని వదిలేసి ప్రస్తుత క్షణం లో ఆనందంగా ఉండండి. మరియు మీ భవిష్యత్తుని అందంగా ప్లాన్ చేసుకోండి. గతాన్ని మరిచిపోయి ఆనందంగా జీవించడంలో బిజీగా ఉండండి.

7. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి : మీ కుటుంబ సభ్యులని మరియు స్నేహితులని ప్రేమించినట్టు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. మీలో ఉన్న లోపాలను మర్చిపోయి మిమ్మల్ని మీరు మనస్పూర్తిగా ప్రేమించుకోండి. మీరు చేసిన తప్పులు, మీరు పొందిన అపజయాలు మిమ్మల్ని నిర్వచించనివ్వకండి. మీ తప్పుల కన్నా మీరు చాలా పెద్దవారు. ఆ దేవుడి యొక్క అందమైన సృజన మీరు అని గుర్తుపెట్టుకోండి. ఆ దైవత్వాన్ని మీలో ఉండనివ్వండి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకుని ఆ దైవత్వం మీలో మొక్క తొడగడానికి అనువుగా ఉండండి.

8. మీలో ఉన్న మంచి లక్షణాలు ఒక లిస్టు రాసుకోండి : మీలో ఉన్న మంచి లక్షణాలను రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఏదైనా ఒక విషయం గురించి మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటే అది రాసుకోండి. అపరాధ భావం లో ఉన్నప్పుడు ఈ భూమ్మీద అత్యంత చెడ్డ వ్యక్తి మనమే అనే భావనలోకి వెళ్ళి పోతాం. దానివల్ల మనలో ఉన్న మంచి లక్షణాలను కూడా చూడలేము. అలాంటి సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని మీరు సరిగా అంచనా వేసుకోవడానికి సహాయపడుతుంది.

అపరాధ భావం నుండి బయటపడి,  మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి కొన్ని సూచనలు ఇవి. గతం గురించి బాధ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని గుర్తు చేసుకోండి. ఆఖరికి గొప్ప మహర్షి అయిన వాల్మీకి కూడా దొంగగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాడు. జీవితాంతం గతంలోనే ఉండిపోయి ఆయన చేసిన తప్పుల గురించి అపరాధ భావంతో కృంగిపోయి ఉంటే అత్యంత గొప్ప గ్రంథమైన రామాయణాన్ని రాసే శక్తి, ప్రశాంతత ఆయనకి వచ్చేది కాదు. ఆయన విలువైన జీవితం వృధా అయిపో ఏది.

కాబట్టి జీవితంలో తప్పులు చేయడం సహజం. మనుషులందరికీ ఇది చాలా సాధారణ విషయం. మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే. చేసిన తప్పు మళ్లీ చేయకూడదు. మీ గతాన్ని అంగీకరించి దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు క్షమించు కునే ప్రయాణాన్ని ఈ రోజే మొదలు పెట్టండి. ఈ క్షణమే, ఈరోజే,  ఇప్పుడే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ముందుకు కదలండి.

Registration

Forgotten Password?

Loading