ఆరోగ్యం ప్రతీ మనిషికి చాలా ముఖ్యం. మనకి అద్భుతమైన కెరీర్ మరియు మంచి రిలేషన్ షిప్స్ ఉండవచ్చు. కానీ సరైన ఆరోగ్యం లేకపోతే మనం జీవితంలో దేనిని ఆనందించలేము. ఆరోగ్యకరమైన మరియు దృఢమైన శరీరం ఉండటం ఒక వరం. అలాంటి శరీరాన్ని నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మన రోజువారి జీవితం మన ఆరోగ్యాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పాత రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే మన పెద్దవాళ్ళు 50-60 సంవత్సరాలు వచ్చే వరకు దృఢంగా ఉండేవారు. ఎందుకంటే వారు తక్కువ రసాయనాలు వాడే ఆహారం తీసుకునే వారు. వారి జీవనశైలిలో ఎంతో శారీరకశ్రమ ఉండేది. ఇప్పటి రోజులతో పోల్చుకుంటే తక్కువ కాలుష్యం ఉండేది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపేవారు. అప్పటి జీవితం తక్కువ ఒత్తిడితో ప్రశాంతంగా ఉండేది. కానీ ఆధునిక రోజుల్లో రసాయనాలు నిండిన ఆహారం, పెద్దగా కదలిక లేని జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన జీవితం చాలా కష్టమైంది. ఈ రోజుల్లో మనం పూర్తి శ్రద్ధ పెడితే గానీ ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందడం కష్టం.
ప్రతిరోజు మన ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి ఇదే సరైన సమయం. మనం తినే ఆహారం, వ్యాయామం మరియు జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధునిక కాలంలో వస్తున్న రోగాలకి ప్రధాన కారణం ఒత్తిడి. 75 నుండి 90% మంది ఒత్తిడి వల్లనే డాక్టర్స్ ని సంప్రదిస్తారు అని పరిశోధనలో తేలింది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఒత్తిడి తగ్గించుకోవడం మీద దృష్టి సారించాలి.
మనం రోజూ మెడిటేషన్ చేస్తే మన ఒత్తిడి తగ్గుతుంది.
అంతేకాకుండా మెడిటేషన్ వల్ల ఈ కింది ప్రయోజనాలు ఉన్నాయి.
1. జీవనశైలి వల్ల వచ్చే రోగాలు ఆపుతుంది : డయాబెటిస్, బిపి మొదలైన జీవనశైలి వల్ల వచ్చే రోగాలను పూర్తిగా నయం చేయడం వీలు కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ కళ్ళ సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవి వచ్చిన తర్వాత బాధపడడం కన్నా అవి రాకుండా ముందే జాగ్రత్త పడటం చాలా ఉత్తమం. ఈ విషయంలో మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది.
2. రాత్రి బాగా నిద్ర పట్టేలా చేస్తుంది : ఎక్కువ ఒత్తిడి వల్ల రాత్రి నిద్రలేమితో మనలో చాలామంది బాధపడుతున్నారు. రాత్రి వేళల్లో మన శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం వల్ల మనం శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా అనారోగ్యకరంగా ఉంటాం. మెడిటేషన్ వల్ల ప్రతిరోజు మన ఒత్తిడి తగ్గి రాత్రి వేళల్లో బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సరైన నిద్ర వలన యవ్వనంగా ఉండడం, నూతన ఉత్సాహంతో ఉండడం, శరీరము మరియు మైండ్ దృఢంగా ఉండడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.
3. బలమైన రోగ నిరోధక శక్తి : రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమైనదో covid 19 మనకు నేర్పింది. బలమైన రోగనిరోధక వ్యవస్థ ఫ్లూ, covid 19 లాంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. మనం ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితం గడిపితే మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. ఎక్కువ ఎనర్జీ ఉండేలా చేస్తుంది : మనం జీవితంలో ఉన్న రకరకాల దశలైన పిల్లల్ని పెంచడం లేదా మన లక్ష్యాల కోసం పనిచేయడం, ట్రావెలింగ్ చేయడం లాంటివి ఆనందించాలంటే మనకి దృఢమైన శరీరం మరియు ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆరోగ్యకరమైన మరియు పోషకాలు ఉన్న ఆహారంతో పాటు మెడిటేషన్ కూడా తోడైతే ఎక్కువ ఎనర్జీ మరియు ఆరోగ్యకరమైన శరీరం మన సొంతమవుతుంది. అప్పుడు జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించగలము.
5. ఎక్కువ తినాలనే కోరికలను అదుపు చేసుకోవడం : మనలో చాలా మంది అనారోగ్యకరమని తెలిసినా జంక్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. వాటిని తినకుండా ఉండలేరు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడే మనకి జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. దీనివలన జీర్ణసమస్యలు, ఊబకాయం లాంటివి వస్తాయి. మనం తరచు మెడిటేషన్ చేస్తే ఈ కోరిక తగ్గుతుంది. తినాలనే కోరిక తగ్గుతుంది. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో ఆలోచిస్తాం. ఆరోగ్యకరమైన ఆహారం తినడం మీద శ్రద్ధ పెడతారు.
6. యంగ్ గా ఉండడం : ఒత్తిడి వలన త్వరగా వయసు అయిపోతుంది. మెడిటేషన్ చేయడం వలన మనం ఎప్పుడు ఆరోగ్యంగా, యంగ్ గా ఉంటాం.
7. ఆనందకరమైన శరీరం : మన శరీరం జీర్ణక్రియ, శ్వాసక్రియ, పునరుత్పత్తి మొదలైన ఎన్నోరకాల సంక్లిష్టమైన పనులు చేసే ఒక యంత్రం. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ పనులు చేసే శక్తి ప్రభావితం అవుతుంది. మనం రోజు మెడిటేషన్ చేస్తే మన ఒత్తిడి తగ్గి, మన శరీరం తన విధులను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించగలరు. దీని వలన మన శరీరం ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది.
8. ఆరోగ్యకరమైన జీవన శైలి: మనలో చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలి కావాలని కోరుకుంటారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు సరైన సమయంలో నిద్రపోవడం, త్వరగా నిద్రలేవడం లాంటివి చేయాలి అనుకుంటారు. ఇవన్నీ చేయకుండా మనల్ని ఆపుతున్నది ఏంటి ? . మనకి దృఢసంకల్పం లేకపోవడం. మనం తరచూ మెడిటేషన్ చేస్తే మన దృఢసంకల్పం పెరుగుతుంది. మన అంతర్గత శక్తి పెరిగి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటాము.
9. ఫిట్ నెస్ పెంచుతుంది : ఒత్తిడి తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం, అంతర్గత శక్తిని దృఢంగా చేసి ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండేలా చేయడం వీటితో పాటు మన ఫిట్ నెస్ కూడా మెరుగుపరుస్తుంది. మనకి ఊబకాయం రాకుండా మరియు ఊబకాయం వల్ల వచ్చే అనేక సమస్యలు రాకుండా మెడిటేషన్ అడ్డుకుంటుంది.
మెడిటేషన్ చేయడం వల్ల కలిగే 9 ప్రయోజనాలు ఇవే.
ఆరోగ్యమే అసలైన సంపద. ఆరోగ్యం పాదయిన తర్వాత మాత్రమే చాలామందికి ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాగే ఉంటాం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒత్తిడి మరియు ఆధునిక జీవితంలో ఉన్న సమస్యలు ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మనకి ఎంత సంపద ఉన్నా, మన ఆరోగ్యం పాడయిన తర్వాత అది తిరిగి రాదు.
అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ అలాంటి సమయంలో వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం సాధ్యం కాదు. డాక్టర్స్ ని సంప్రదించడం తప్ప మనం ఇంకేమీ చేయలేం. అప్పుడు ఇక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటి గురించి పట్టించుకోవాలి. నివారణ అన్నిటికన్నా మంచి వైద్యం. మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యకరమైన ఎంపికలను పెంచుకుంటూ జీవనశైలి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. ఆరోగ్యంగా, ఆనందంగా, దృఢంగా ఉందాం.
మెడిటేషన్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి.