అలెక్స్ ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాడు. కానీ నెల తర్వాత కూడా తనకి ఎలాంటి మార్పు కనపడలేదు. ఇక మానేశాడు. కొన్ని నెలల తర్వాత అప్పటికి ట్రెండింగ్ లో ఉన్న కొత్త వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి చదివాడు. అది మొదలు పెట్టి ఇంకో ముప్పై రోజులు ప్రయత్నించాడు. అప్పటికి ఇంకోటి ఏదో బాగా ఫేమస్ అయిన ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి దీన్ని వదిలేశాడు.
బాబ్ వాకింగ్ కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒక రోజు వెళ్ళి వారం రోజులు విరామం తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఒక రోజు వెళ్ళి ఇంకో పదిహేను రోజులు విరామం తీసుకున్నాడు.
నిలకడ లేని పనులు ఎలా ఉంటాయో చెప్పడానికి పై రెండు ఉదాహరణలు. విజయం సాధించిన వారికి, సాధించలేనివారికి మధ్య తేడా ఈ నిలకడే. ఇద్దరికీ ఒకే విధమైన సామర్థ్యం, టాలెంట్ ఉంది. కానీ ఎందువల్ల కొంతమంది విజయం సాధించలేకపోతున్నారు ? అదృష్టం వల్ల లేక దేవుడి వల్ల ? కాదు. వాళ్ళకి నిలకడ లేక. విజయం సాధించే వారి సీక్రెట్ నిలకడ. వాళ్ళు ఏదైనా ఒక పని అనుకుంటే ప్రతిరోజూ చేస్తారు. నెలలు, సంవత్సరాలు అయినా, ఎలాంటి ఫలితం లేకపోయినా వారు ఆ పని చేస్తూనే ఉంటారు. ఫలితం రావాలంటే కాస్త సమయం పడుతుంది అని వాళ్ళకి తెలుసు.
చాలామంది నిలకడ లేకపోవడం వల్లే జీవితంలో ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఏ పని ఎక్కువకాలం చెయ్యరు. అందుకే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రావు. వాళ్ళ ప్లాన్స్ ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటారు. దానితో పాటు నిలకడ ఉండదు. ఒక రోజు పనిచేస్తారు. ఒక వారం సెలవు తీసుకుంటారు. నిలకడ లేకుండా దేన్నీ సాధించలేము. విజయం సాధించాలంటే నిలకడతో కూడిన ప్రయత్నం అవసరం. కాబట్టి నిలకడ చాలా ముఖ్యం.
జీవితంలో నిలకడ సాధించడం ఎలా ? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.
1. ఎక్కువ రీసెర్చ్ చెయ్యండి: ఏదైనా ఒక పనిని కానీ, అలవాటుని కానీ ఎంచుకునే ముందు అవసరమైన రీసెర్చ్ చెయ్యండి. మీరు అనుకున్నడానికి కనీసం ఆరు నెలలు కట్టుబడి ఉండాలి. అప్పుడే మీకు అనుకున్న ఫలితం వస్తుందని అర్థం చేసుకోండి. మీరు అది ఎందుకు కావాలి అనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఏదో పుస్తకంలో చదవగానే, మీ ఫ్రెండ్ చెప్పగానే ఆ పని చేసేయాలి అని దూకేయకండి. మీరు మొదలు పెట్టేముందు ఆ పనిని అర్థం చేసుకుని మీ పునాది ధృఢంగా ఉండేలా చూసుకోండి.
2. ప్రేమలో పడండి : మీరు చెయ్యాలనుకున్న పని మీద మీకు ప్రేమ ఉండాలి. ఉదాహరణకి మీరు రోజుకి 30 నిముషాలు నడవాలి అనుకుంటే, దానివల్ల కలిగే ఉపయోగాలను అర్థం చేసుకోండి. అప్పుడు మీకు దానమీద ప్రేమ కల్గుతుంది. ఆపని చేసి విజయం సాధించిన వ్యక్తుల మాటలు వినండి. మీరు అనుకున్నది నిలకడగా చెయ్యడానికి అవి ఇవి చాలా ఉపయోగ పడతాయి.
3. చేసే పనిని ఎంజాయ్ చెయ్యండి: మీరు చేసే పనిని ఎంజాయ్ చెయ్యడానికి దారులు వెతకండి. ఉదాహరణకి మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ వాకింగ్ చెయ్యండి. గ్రాట్టిట్యూడ్ సాధన చెయ్యండి లేదా నేచర్ లో నడవండి. వాకింగ్ మీకు నచ్చేలా చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు చేసే పని మీరు ఎంజాయ్ చేసేలా చేసుకోండి. అలా చేస్తే అది చెయ్యడం మీకు చాలా తేలిక అవుతుంది. మరియు మీరు ప్రతీరోజూ చెయ్యగలుగుతారు. కుదరని సమయాల్లో కూడా మీరు వాకింగ్ ఆపరు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించే వారి సీక్రెట్ ఇదే. వారు ఆ పనిని ఎంజాయ్ చేస్తారు కాబట్టే ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఆపకుండా విజయం సాధిస్తారు.
4. ఆరు నెలలు కట్టుబడి ఉండండి: మీరు అనుకున్న దానికి కనీసం ఆరు నెలలు కట్టుబడి ఉండండి. మీరు అలా కట్టుబడి ఉంటే జీవితం మీకు కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది. మీరు అనుకున్న దాన్ని మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకొకటి మొదలు పెట్టకండి. మీరు ఒక రీసెర్చ్ చేసి మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండండి. మీకు మధ్యలో వచ్చిన జ్ఞానం తో మీ ప్రయత్నం మరింత గొప్పగా మారాలి.
5. కొత్తగా చెయ్యండి : మీరు అనుకున్న పనిని కొత్తగా చెయ్యడానికి ప్రయత్నించండి. అదే పని పదే పదే చెయ్యడం వల్ల మన మైండ్ కి విసుగు వస్తుంది. అలా విసుగు వస్తే ఆ పని చేయాలన్న ఆసక్తి పోతుంది. కాబట్టి మీరు చేసే పని కొత్తగా చేసే మార్గాలు ఎప్పుడూ వెతకండి. ఉదాహరణకి వాకింగ్ ని తీసుకుంటే ఒకరోజు ట్రెడ్ మిల్ మీద నడవండి. ఒకరోజు మీకు దగ్గరలో ఉన్న పార్క్ లో నడవండి. ఆ తర్వాత రోజు బయట నడవండి. మీరు కొత్తగా చెయ్యడానికి ప్రయత్నిస్తే మీ నిలకడ పెరుగుతుంది.
6. ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి : మీ ప్రయత్నాలను, నిలకడని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. అలా చేస్తే అసలు మీరు అనుకున్నది ఎంతవరకు సరిగా చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ట్రాక్చే సుకోకపోతే మనం నిలకడ గానే చేస్తున్నాం అనే భ్రమలో ఉండిపోతాం. ట్రాక్ చేసుకోవడం వల్ల మనకి అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అది ఫీడ్ బ్యాక్ లా ఉపయోగపడుతుంది.
7. చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకోండి: మీరు ఆ పని మొదలు పెట్టేముందే ఏం సాధిస్తే మీరు సెలబ్రేట్ చేసుకుంటారో నిర్ణయించుకోండి. దానివల్ల మీకు మోటివేషన్ వస్తుంది. ఇది మీ నిలకడ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రయాణం చెయ్యడం చాలా బావుంటుంది. మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన ఉత్తేజాన్ని ఆ సెలబ్రేషన్ ఇస్తుంది.
8. జవాబుదారీగా ఉండండి : ఎవరికైనా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని ఎవరికన్నా చెప్పి వారికి జవాబుదారీగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ నిలకడగా చేస్తున్నారో లేదో వారితో చెప్తూ ఉండండి. మనం జవాబుదారీగా ఉంటే మన నిలకడ మరింత పెరుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. మీ ఫ్రెండ్ కి గానీ మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా గానీ జవాబుదారీగా ఉండండి.
9. మధ్యలో విరామం వచ్చినా వదలకండి: మన పని మీద ఉన్నప్పుడు మధ్యలో రకరకాల అవరోధాలు రావడం సహజం. పని చేసే మూడ్ లేకపోవడం, కొన్ని సార్లు మనకి చెయ్యాలి అనిపించకపోవడం, కొన్ని తప్పని పరిస్థితుల వల్ల మధ్యలో విరామం రావొచ్చు. అప్పుడు ఒడిపోయినట్టుగా ఫీల్ అవ్వకుండా వీలైనంత తొందరగా మీరు అనుకున్న పని చెయ్యడం మళ్ళీ మొదలు పెట్టండి. మీరు మళ్ళీ ఎంత త్వరగా మొదలు పెడతారు అనేదాని మీద మీ విజయం ఆధారపడి ఉంటుంది.
మీ నిలకడని పెంచుకోవడానికి కొన్ని సూచనలు ఇవి. నిలకడగా చేసేపనులు ఎప్పుడూ ఫలితాలు ఇస్తాయి. నిలకడ మీ నైపుణ్యాన్ని పెంచుతుంది.
“మన జీవితం గొప్పగా ఉండాలంటే మన తరచూ చేసే పనుల మీద మనకి అదుపు ఉండాలి. మనం అప్పుడప్పుడు చేసేపనులు మన జీవితాన్ని ప్రభావితం చెయ్యవు. మనం నిలకడగా చేసే పనులే మనం జీవితాన్ని నిర్ణయిస్తాయి.” – Anthony Robbins
నిలకడగా ఉండండి, విజయాలు సాధించండి.