మెడిటేషన్ చేయడం వల్ల కలిగే తొమ్మిది లాభాలు

మెడిటేషన్
Share

మన జీవితాన్ని అధ్భుతంగా మార్చే శక్తి మన మైండ్ కి ఉంది. మన మైండ్ కి ఉన్న ఈ శక్తే మనల్ని మిగతా జంతువుల నుండి వేరు చేస్తుంది. ఈ శక్తే మనలో ప్రతీ ఒక్కరినీ ప్రత్యేకంగా చేసింది. ప్రపంచంలో ఉన్న గొప్ప ఆవిష్కరణలు, ఈ అబివృద్ది మన మైండ్ కి ఉన్న ఈ శక్తి వల్ల జరిగినవే. మన ఆలోచనలు, ఎమోషన్స్ మన మైండ్ వల్ల కలుగుతాయి. మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో మన ఎంచుకునే ఆలోచనలు మరియు ఎమోషన్స్ బట్టి జీవితంలో మన ప్రయాణం నిర్ణయించబడుతుంది.  మనం ఆనందకరమైన ఆలోచనలు ఎంచుకుంటున్నామా ? లేదా విషాదకరమైన ఆలోచనలా? మనం ఆశావాదాన్ని ఎంచుకుంటున్నామా ? లేక నిరాశావాదం ఎంచుకుంటున్నామా ? మనలో చాలామంది పట్టించుకోక పోయినా మన మానసిక మరియు ఎమోషనల్ స్థితి మన జీవితాన్ని నిర్ణయిస్తుంది అన్నది మాత్రం నిజం.

మనం ఒత్తిడిలో ఉండి దానిని ఎలా అదుపు చేయాలో తెలియక పోతే మన ఆలోచనలు మరియు ఎమోషన్స్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. చిన్న చిన్న విషయాలకే ఏకాగ్రత కోల్పోతూ బాధపడుతూ ఉంటాం. మన మైండ్ పదునుగా, దృఢంగా లేకపోతే మన లక్ష్యాన్ని సాధించే ప్రయాణంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కోలేక డీలా పడిపోతాం.

మనం తరచు మెడిటేషన్ చేస్తే మన ఒత్తిడి తగ్గుతుంది మైండ్ చురుకుగా పనిచేస్తుంది. మన ఆలోచనలు మరియు ఎమోషన్స్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాము. మన జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి మెడిటేషన్ కి ఉంది అని అంటే అది అతిశయోక్తి కాదు.

మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ కి జరిగే 9 ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

1. ఆలోచనలలో స్పష్టత మరియు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి : జీవితంలో ఎన్నో రకాల ఎంపికలు ఉంటాయి. మనం ఒక చిన్న టూత్ పేస్ట్ కొనాలన్నా ఎన్నో రకాల ఎంపికలు ఉన్నాయి. మరి పెళ్లి, కెరీర్ మొదలైన విషయాల్లో ఇంకా ఎన్ని ఎంపికలు ఉంటాయి ? ఇన్ని రకాల ఎంపికలలో ఏది సరైనదో మనకు ఎలా తెలుస్తుంది. అందుకే సరైనది ఎంచుకోలేక మనలో చాలామంది అయోమయంలో ఉంటారు. మనం తరచూ మెడిటేషన్ చేస్తే మనతో మనం కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన దిశానిర్దేశం మరియు జ్ఞానం వచ్చి జీవితంలో ఎదురయ్యే ఈ పరిస్థితులలో సరైన నిర్ణయాలు తీసుకుంటాము. ఆలోచనలలో స్పష్టత వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటాము. ఇలా ఆలోచనలలో స్పష్టత రావడం వల్ల మనం నాయకులుగా, గొప్ప వ్యక్తులుగా మారతాము.

2. ఆలోచనల మీద అదుపు : మనలో చాలామందికి ఆలోచనలు తమ ఆధీనంలో ఉండవు. మనకి ఆనందాన్ని ఇవ్వని దాని గురించి ఆలోచించకూడదు అనుకున్నా మన ఆలోచనలు దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పదే పదే మన గతాన్ని తలచుకుంటూ ఉంటాము.  మనం తరచు మెడిటేషన్ చేస్తే కొంతకాలం తర్వాత మన ఆలోచనల మీద అదుపు వస్తుంది.  మన ఆలోచనలను అదుపులో ఉంచుకోగలము. దీనివలన మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది జీవితంలో గొప్ప జ్ఞానం. మన ఆలోచనల మీద మనకి అదుపు వచ్చినప్పుడు, మన ఆలోచన శక్తిని ఒక కొత్త బిజినెస్ సృష్టించడానికి లేదా ఒక కొత్త ఆవిష్కరణ చేయడానికి లేదా ఒక కొత్త పెయింటింగ్ లేదా ఒక పాట సృష్టించడానికి ఉపయోగిస్తాము. ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాలు, ఆవిష్కరణలు తమ మెదడుకి పదును పెట్టిన వ్యక్తుల నుండి వచ్చినవే.

3. మన ఎమోషన్స్ మీద అదుపు : మనం కోపంగా ఉండాలని అనుకోము. కానీ అలా జరిగిపోతుంది. మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టి అలా ఎందుకు చేసాము అని బాధపడకూడదు అనుకుంటాం. మన ఎమోషన్స్ ని మన ఎంచుకోవచ్చా ? మన ఎమోషన్స్ మీద అదుపు తెచ్చుకోగలమా ? అవును. తరచూ మెడిటేషన్ సాధన చేయడం వల్ల మన ఎమోషన్స్ మన అధీనంలో ఉంటాయి.  మన ఎమోషన్స్ మీద మనకి ఎంత అదుపు ఉంటే మన జీవితం అంత గొప్పగా ఉంటుంది.  మన భార్య లేదా భర్తతో, బాస్ తో రిలేషన్ షిప్ లో సమస్యలు వచ్చేది మన ఎమోషన్స్ మీద అదుపు లేకపోవడం వల్లనే. మన జీవితంలో ఎమోషన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  అవి మన ఆధీనంలో లేకుండా ఉన్నప్పుడు అవి మన జీవితాన్ని నెగెటివ్ గా ప్రభావితం చేస్తాయి. ఎమోషన్స్ మీద అదుపు సాధించడం అనేది ఒక వ్యక్తిని జీవితంలో గొప్ప గొప్ప విజయాలు చూసేలా చేస్తుంది. మెడిటేషన్ వల్ల మీ ఎమోషన్స్ మీ ఆధీనంలో ఉంటాయి.

4. సృజనాత్మకత: మనం తరచూ మెడిటేషన్ చేస్తే మన మన మైండ్ సృజనాత్మకతతో ఆలోచిస్తుంది. ఇది సమస్యలకి పరిష్కారాలు సూచిస్తుంది.  గొప్ప గొప్పవి సృష్టించేలా చేస్తుంది.  కొత్త ఆలోచనలను ఇస్తుంది. సృజనాత్మకత వల్ల జీవితం ఎప్పుడూ ఉత్సాహంగా,  కొత్తగా ఉంటుంది.

5. ఒత్తిడిని తగ్గిస్తుంది : ఈ ఆధునిక కాలంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం. మనం పని చేసే చోట, ఇంట్లో, సూపర్ మార్కెట్ క్యూలో ఇలా ప్రతి చోట ఒత్తిడి ఉంది. మన మైండ్ ఒత్తిడిలో ఉంటే సరిగా పని చేయదు. జీవితంలో ఒత్తిడి ఒక భాగం అయిపోతే అది ఎన్నో రకాల సమస్యలను తీసుకొస్తుంది. తరచూ మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మన మైండ్ కి కొత్త శక్తి వస్తుంది. తరచూ జరిగే ఒత్తిడినుండి మనం మైండ్ కి బ్రేక్ వస్తుంది. మరియు మన శరీరంలో పెరిగిపోయిన ఒత్తిడిని  విడుదల చేస్తుంది.  ఇలా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మనం శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉంటాం.

6. మన మానసిక స్థితిని మన ఆధీనంలో ఉంచుతుంది: మెడిటేషన్ చేయడం వల్ల మన ఎమోషనల్ మరియు మానసిక స్థితి మన ఆధీనంలో ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, విచారము, సూసైడ్ చేసుకోవాలనిపించే ఆలోచనలు మొదలైనవి మన ఆధీనంలో ఉంటాయి.  మనం మైండ్ కి వచ్చే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది.

7. ప్రశాంతత : మనం ఏ పని చేస్తున్నా, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా, రోజు అయ్యేసరికి మనందరికీ కావాల్సింది ఒక్కటే. ప్రశాంతత. ప్రశాంతత మన జీవిత ప్రయాణానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ ప్రశాంతతను సాధించడానికి మెడిటేషన్ సహాయపడుతుంది.

8. మన వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది : మనం తరచూ మెడిటేషన్ చేయడం వల్ల కరుణతో, తెలివితో, ఓపికతో, దృఢ సంకల్పంతో మనం మరింత గొప్ప వ్యక్తిగా మారతాము. మన వ్యక్తిత్వం మారుతుంది. మెడిటేషన్ చేస్తున్న కొద్దీ మనకి మనం కొత్తగా కనిపిస్తాము. ఇలా మనం మారడం అనేది మన జీవితంలో ఉన్న మిగతా విభాగాలను కూడా గొప్పగా మారుస్తుంది.  మన ఆరోగ్యం, రిలేషన్ షిప్స్,  ఇవన్నీ అద్భుతంగా మారుతాయి.

9. ఏకాగ్రతను పెంచుతుంది : ఈ ఆధునిక రోజుల్లో మనం ఏకాగ్రతతో ఉండే సమయం తగ్గిపోయింది. కానీ మనం పని చేసే చోట మన సామర్థ్యం బాగా ఉండాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం.  ఏదైనా సాధించాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం కనుగొనాలన్నా ఏకాగ్రత చాలా ముఖ్యం. మనం ఎంత ఏకాగ్రతతో పని చేస్తాం అనే దాన్ని బట్టే మన విజయం ఆధారపడి ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ ఎక్కువ ఏకాగ్రతను సాధిస్తుంది.

మెడిటేషన్ మన మైండ్ కి కలిగే 9 ప్రయోజనాలు ఇవే.

ఆ దైవం ఇచ్చిన అద్భుతమైన బహుమతి మైండ్. దానిని పదునుపెట్టి సరైన విధంగా వాడితే మన జీవితంలో, ఈ ప్రపంచంలో అద్భుతమైన మార్పు తీసుకురాగల శక్తి మనకి ఉంది. మన మైండ్ ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ ద్వారా మీ మైండ్ ని మార్చుకుని మొత్తం మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి.

మెడిటేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవండి.

Registration

Forgotten Password?

Loading