ప్లాన్ చేసుకున్నారా !!

Share

ప్లాన్ చేసుకున్నారా ??

ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించటం మన జీవితాలలో చాలా అవసరం. మనం జరుపుకునే మొదటి పుట్టిన  రోజు మొదలు , మనం ఎక్కడ చదువుతాం , ఏం పని చేస్తాం, ఎప్పుడు రిటైర్ అవుతాం , మన వృద్ధాప్యాన్ని ఎలా గడుపుతాం , ఇలా మన జీవితంలో ప్రతీ దశలోను ప్రణాళిక అవసరం. ఇలా ఒక ప్రణాళికలో వ్యవహరించటం వలన మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను తెలివిగా ఎదుర్కోవడమే కాకుండా , అనవసరమైన ఇబ్బందులు , తలనొప్పులకు దూరంగా వుండవచ్చు. 

    అందువలన జీవితంలో ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని మలుపులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అలాంటివి మనకి ఆనందాన్ని , ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కూడా, మరి వాటి సంగతేంటి ? అవి  మనం ప్లాన్ చేసినవి కావు కదా ! 

అంతా మనం అనుకున్నట్టుగానే జరగకపోవచ్చు: 

మన జీవితంలో ప్రతీది మనం అనుకున్నట్లుగా జరగదని మనకి తెలిసినప్పటికీ మనం వీలైనంతవరకు ఆర్గనైజ్డ్ గా వుండటమే మంచిది . ఎందుకంటే మనం అనుకున్నది జరగకపోయినా మనం అన్నిటికీ సిద్ధంగా వుండటం అనేది చాలా మంచి విషయం. మనం అన్నిటికీ సిద్ధంగా వుండటం వలన మనం అనుకున్నది జరగకపోయినా నిరుత్సాహపడం.

చిన్న చిన్న మార్పులకి అనుగుణంగా ప్లాన్స్  చేసుకోండి :

చాలా మంది ఆర్గనైజ్డ్ గా వుంటూ ఒక ప్రణాళికతో వుండటానికి ఇష్టపడతారు. మీరు అలాంటివారిలో ఒకరే అయితే ప్లానింగ్ వలన కలిగే లాభాలు మీకు ముందుగానే తెలిసుంటాయి. కానీ మీకు మేం ఇవ్వాలనుకుంటున్న చిన్న సలహా ఏంటంటే , ఎపుడూ కూడా మీరు వేసే ప్రణాళికల్ని చిన్న చిన్న మార్పులకు అనుగుణంగా వేసుకోండి . కొన్నిసార్లు పక్కాప్రణాళికతో వుండటం వలన దేనికోసమైతే ప్రణాళిక చేశామో ఆ విషయాన్నీ  మరిచిపోయి అనుకున్నవి అవ్వట్లేదని కంగారుపడటం , కోపం తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటాం . అందుకే మనం ఎప్పుడూ మన ప్రణాళికను కొంత మార్పులకి అనుగుణంగా ఖాళీ వుంచుకోవడం మంచిది . 

మీరు వేస్తున్న ప్రణాళిక ఆచరించటానికి సులువుగా ఉండాలి :

ప్రణాళిక ఎప్పుడైనా వాస్తవానికి దగ్గరగా  , ఆచరణకు వీలుగా వుండాలి. అంతేకాని ఊహాత్మకంగా ఏమాత్రం ఫాలో అవ్వటానికి వీలులేకుండా వుండకూడదు. ఉదాహరణకు , మనకు వచ్చే జీతం తక్కువ అని తెలిసి కూడా మనం ఇష్టం వచ్చినట్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ఇంకా ఖరీదైన మొబైల్స్ కోసం లోన్ తీసుకోవడం  ఎంత వరకు సరైనది. దానివల్ల మనకి ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా , భవిష్యత్తులో కుడా లేని పోని కష్టాలు ఎదురవుతాయి. అందువలన ప్రణాళిక చేస్తున్నప్పుడు వాస్తవికతను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం.

ప్రణాళికను ఖచ్చితంగా అమలు చెయ్యాలి . రాసుకొని వదిలేస్తే ఉపయోగం లేదు :

ప్రణాళిక వేసుకున్నాక అనుసరించకపోతే ఉపయోగం లేదు. ప్రణాళిక వేసేదే పనులు తేలిక చేసుకోవడం కోసం. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా ప్రణాళిక వేస్తే , దానిని అమలు చేసేలా చూడండి . అదేం కష్టమైన పని కాదు. ఒక దినచర్య గా అలవాటు చేసుకోవడం వలన దేనికెంత సమయం కేటాయించగలమో ముందుగానే తెలుస్తుంది , ఒకవేళ ఏదైనా పనికి ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తే , ఆ విషయం ముందుగానే మీ కుటుంభ సభ్యులకి చెప్పి వాళ్ళ నుండి కుడా సహాయం తీసుకోవచ్చు. 

ప్రణాళిక వలన కలిగే ఫలితాలు ముందుగానే అంచనా వెయ్యండి :

మీరు ప్లాన్ వేసుకునే ముందే దాని వలన కలిగే లాభాలు , ఫలితాలను అంచనా వేయండి. ప్రణాళిక ఏదైనా దానిని రెండు రకాలుగా అంచనా వేయవచ్చు. మొదటిది మనం ప్రణాళిక చేశాక, దానిని ఫాలో అవుతూ ఫలితాలను అంచానా వేయటం.  దీనిని ఫోర్మేటివ్ అస్సెస్మెంట్ (నిర్మాణాత్మక అంచనా) అంటారు . ఇంకొకటి ప్రణాళిక ముగిశాక విజయానికి అనుగుణంగా అంచనా వేయటం . దానిని సమ్మేటివ్ అస్సెస్మెంట్ అంటారు. మీరు చేసిన ప్రణాళిక ఒకటి విజయవంతమైతే దాని అనుభవాలను పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా మరిన్ని ప్రణాళికలు వెయ్యచ్చు . అందువలన ప్రణాళికలకు  వాటి ఫలితాలను ముందుగానే అంచనా వేయటం మంచిది . అలా చేయటం వలన ఏ పని చేయచ్చు, ఏది సాధ్యపడదో తెలిసిపోతుంది .

ప్రణాళికను గుడ్డిగా అనుసరించద్దు :

మీకు సరిపడేది ఇంకొకరికి సరిపడకపోవచ్చు ఇంకొకరికి సరిపడేది మీకు సరిపడకపోవచ్చు . ప్రణాళికలు కూడా అంతే . ప్రతి ప్రణాళిక ప్రత్యేకమైనది . అది ప్రతి మనిషిని బట్టి మారుతూ వుంటుంది. వారి వారి వ్యక్తిగత అవసరాలు , ప్రాధాన్యతలు , ప్రాముఖ్యతల మీద ఆధారపడి వుంటాయి. 

అందువల్ల మీరు వేరొకరి ప్రణాళిక చూసి ప్రేరణ పొందినా కుడా ఆ ప్రణాళిక ను గుడ్డిగా అనుసరించకపోవడం  మంచిది . అది కొన్నిసార్లు ప్రమాదాలకు దారి తీసే అవకాశం వుంది. అలా ఇతరులను గుడ్డిగా అనుసరించటం వలన మనకు మంచి జరగకపోగా , కొన్నిసార్లు పరిస్థితిని దిగజారుస్తుంది. 

ఇన్స్పిరేషన్ అండ్ ఆంబిషన్ :

మనం అసలు ప్రణాళికలు ఎందుకు వేసుకుంటాం? మన జీవితంలో ఒక మార్పు కోసం.  అలాంటప్పుడు ఆ మార్పు కోసం మనం ప్రేరణ పొంది ప్రణాళిక చేస్తేనే అర్థవంతమైన మార్పుని చూడగలం . అందువలన మీ ప్రయత్నం మీరు చెయ్యండి , దానికి కావాల్సిన ప్రేరణని మీరే తెచ్చుకోండి . దానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలను తీసుకోండి. 

ప్రణాళిక అనేది ఒక అలవాటు . అంటే అలవాట్లు ఒక్క రోజులో వచ్చేవి కావు . రోజుల తరబడి దాని మీద ఒక పని చేస్తే అలవాటు అవుతాయి . అనుసరించకపోతే కోల్పోయే ప్రమాదం కుడా వుంది . ఒక ప్రణాళికలో వ్యవహరించే వ్యక్తులు ఎక్కువగా స్మూత్ లైఫ్(సులభమైన జీవిత) స్టైల్ కలిగి వుంటారు. అందుకే ప్రణాళిక చేసుకునేటప్పుడు దాని ఒక్క ఆవశ్యకతను తెలుసుకొని  మరియు తర్వాత వచ్చే పరిణామాలకు  సిద్ధంగా వుండటం మంచిది.

Registration

Forgotten Password?

Loading