మెడిటేషన్ గురించి పది అపోహలు మరియు నిజాలు

మెడిటేషన్
Share

మీ మెదడుకి పదునుపెట్టే పవర్ ఫుల్ సాధనం మెడిటేషన్. సరైన విధానంలో చేస్తే మీ మానసిక స్థితిని, శరీరాన్ని ధృడంగా మారుస్తుంది. ఒత్తిడితో నిండిన ఒకరోజు తర్వాత మిమ్మల్ని మళ్ళీ నూతన ఉత్సాహంతో మరొక రోజుకి సిద్ధం చేస్తుంది. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి, మన శరీరానికి స్నానం ఎలా అవసరమో అలాగే మన మెదడుకి కూడా ఒత్తిడి, నెగెటివిటీ తగ్గడానికి స్నానం అవసరం. ఆ స్నానమే మెడిటేషన్.

మెడిటేషన్ చాలామంది చేస్తారు. హాలీవుడ్ స్టార్స్ దగ్గరనుండి పెద్ద పెద్ద కంపెనీల CEO లు, సాధారణ వ్యక్తులు కూడా మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు పొందుతున్నారు. ఆరోగ్యానికి, రిలేషన్ షిప్స్ కి, మనం విజయం సాధించడానికి మెడిటేషన్ ఎంతో సహాయం చేస్తుందని చాలా పరిశోధనలు చెప్తున్నాయి. మెడిటేషన్ యొక్క లాభాలు పక్కన పెడితే, అసలు మెడిటేషన్ మీద ఉన్న అపోహలు మనలో చాలామంది కనీసం మొదలు పెట్టారు.

మనకి ఉన్న అపోహలు వాటి వెనక ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహలు 1:  మెడిటేషన్ ఎక్కువ ఏకాగ్రత ఉన్నవాళ్లే చెయ్యాలి. నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా కాబట్టి నేను చెయ్యలేను.

నిజం:   మనం అమ్మ కడుపులో ఉన్నప్పటినుండే ఆలోచించడం మొదలు పెడతాం అని సైన్స్ చెప్తుంది. కాబట్టి ఆలోచనలు అనేవి మనకి పుట్టుకతో ఉండేవే. కొందరు ఎక్కువ ఆలోచిస్తారు అంతే. మధ్య మధ్యలో విశ్రాంతి ఇస్తేనే ఏ యంత్రం అయినా సరిగా పనిచేస్తుంది. మన మైండ్ కూడా ఎప్పుడూ ఆలోచించే ఒక సంక్లిష్టమైన యంత్రమే. మెడిటేషన్ వల్ల కనీసం కొన్ని నిముషాలైనా మైండ్ కి విశ్రాంతి దొరుకుతుంది. ఈ కాస్త విశ్రాంతి మన మైండ్ ను మరింత పదును చేసి ఇంకా బాగా పనిచేసేలా చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఆలోచించే వాళ్ళు అయితే మెడిటేషన్ చెయ్యడానికి మీకు అర్హత ఉన్నట్టే. మెడిటేషన్ మీలాగా ఎక్కువ ఆలోచించే వాళ్ళ కోసమే.

అపోహ 2:  మెడిటేషన్ అంటే నా ఆలోచనలని ఆపడం. కానీ నేను కళ్ళు ముయ్యగానే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి. కాబట్టి మెడిటేషన్ నా వల్ల కాదు.

నిజం: అవును. మెడిటేషన్ అంటే మీ లోపల ఒక నిశాబ్ధాన్ని అనుభూతి చెందే విధంగా ఆలోచనలని అదుపులో పెట్టడం. అన్నిటిలానే దీనికి కూడా ట్రైనింగ్ మరియు సాధన కావాలి.  ఎందుకంటే మన మైండ్ ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచించడానికి అలవాటు పడింది. కాబట్టి కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రం సాధ్యం కాదు. చిన్నప్పుడు ఒక వాక్యం చదవడానికి మీకు ఎంత సమయం పట్టింది.? మెడిటేషన్ కూడా అంతే. మైండ్ ను నిశబ్ధంగా ఉంచడానికి కాస్త సమయం మరియు సాధన అవసరం.

అపోహ 3: మెడిటేషన్ చెయ్యడం వల్ల ఏదైనా సాధించాలనే కోరిక తగ్గుతుంది. నాకు జీవితంలో ఎన్నో సాధించాలని ఉంది అందుకే నేను మెడిటేషన్ చెయ్యను.

నిజం: మెడిటేషన్ మీ మెదడుకి పదును పెట్టి మీ ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది. జీవితంలో చాలా సాధించిన వారు, గొప్ప ఆలోచనా శక్తి ఉన్నవాళ్ళు ఇలా తమ ఎమోషన్ ను అదుపు చేసుకున్నవారే. బాధ, విసుగు, కోపం మీ ఆలోచన శక్తిని తీసేసుకుని మీకు శక్తి లేకుండా చేస్తాయి. దానివల్ల మీరు అనుకున్నది సాధించలేరు. ఒకవేళ సాధించినా ఈ ఎమోషన్స్ ఆ విజయాన్ని కూడా నాశనం చేస్తాయి. మీరు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఈ ఎమోషన్స్ అదుపులో పెట్టుకుని వాటికి అతీతంగా మారతారు. అప్పుడు మీ ఆలోచనా శక్తిని మీ లక్ష్యాలు సాధించడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి రోజూ మెడిటేషన్ చేస్తే మీ లక్ష్యాలను చాలా తేలికగా సాధించవచ్చు. రోజూ మెడిటేషన్ చేస్తూ అదే సమయంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉండే  Linked-in CEO, Software giant sales force CEO Marc Benioff లాంటి గొప్ప వ్యక్తులు ఉదాహరణ.

అపోహ 4: మెడిటేషన్ చెయ్యాలంటే శాకాహారం మాత్రమే తినాలి. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం దాన్ని మెడిటేషన్ కోసం వదులుకోలేను.

నిజం: శాకాహారిగా ఉండాలా మాంసాహారిగా ఉండాలా అనేది వ్యక్తిగత నిర్ణయం. దానికి మెడిటేషన్ తో సంబంధం లేదు.

అపోహ 5: మెడిటేషన్ చెయ్యాలంటే నేను ఉదయం 4 గంటలకే లేవాలి. నేను అంత త్వరగా లేవలేను అందుకే మెడిటేషన్ చెయ్యను.

నిజం: మెడిటేషన్ చేసే సమయంలో ఖాళీ కడుపుతో ఉండాలి ఎందుకంటే తిన్న తర్వాత నిద్ర రావడం వల్ల మెడిటేషన్ కష్టం అవుతుంది. అందుకే తినడానికి, మెడిటేషన్ చెయ్యడానికి మధ్య రెండు గంటలు వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ ఒక్క నియమం పాటిస్తూ ఉదయం 4 నుండి రాత్రి 11 వరకూ ఎప్పుడైనా మీరు మెడిటేషన్ చెయ్యవచ్చు.

అపోహ 6: మెడిటేషన్ చెయ్యడం వల్ల నిర్లిప్తమైన వ్యక్తిలా అవుతాను. నా స్నేహితుల ముందు అలా ఉండడం నాకు ఇష్టం లేదు.

నిజం: మెడిటేషన్ మీలో ఓర్పుని పెంచుతుంది. సమస్యలను పరిష్కరించే నైపుణ్యం పెరుగుతుంది. ఆలోచనలలో స్పష్టత, చురుకైన మైండ్, కోపం తగ్గడం మెడిటేషన్ వల్ల సాధ్యం. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇష్టపడకుండా ఎవరు ఉండగలరు ? ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తారు. అవును కదా. ప్రతీరోజు మెడిటేషన్ చెయ్యడం వల్ల మీలో ఉన్న పాజిటివిటీ వల్ల మీరు చాలా స్నేహంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.

అపోహ 7: మెడిటేషన్ అనేది జీవిత నుండి తప్పించుకోవడం. నేను నా సమస్యల నుండి తప్పించుకోకుండా వాటిని ఎదుర్కుందాం అనుకుంటున్నాను.

నిజం: మెడిటేషన్ లో మీరు సమస్యల నుండి తప్పించుకోరు. మీ ఆలోచనలని కాస్త అదుపు చెయ్యడం వల్ల మీ ఎమోషన్స్ మీద అదుపు వచ్చి మీ సమస్యలకి సరైన పరిష్కారం వెతికే దృక్కోణం మీకు వస్తుంది. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే మీ సమస్యలని పరిష్కరించే నైపుణ్యం పెరుగుతుంది.

అపోహ 8: మెడిటేషన్ ముసలివాళ్ళ కోసం. నేను నా యవ్వనాన్ని మెడిటేషన్ కోసం వృదా చెయ్యను.

నిజం: జీవితంలో ముఖ్యమైన విషయాలైన కాలేజ్, కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటివి మనం పెద్దవాళ్లం అయ్యాకే జరుగుతాయి. జీవితంలో అసలైన సవాల్ విసిరేవి ఇవే. వర్క్ మరియు వ్యక్తిగత జీవితం యొక్క సమన్వయం, ఇవన్నీ మనిషిలో ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. మన శరీరం, మైండ్ ను పాడుచేసుకోకుండా ఆ ఒత్తిడి నుండి బయటకు రావడానికి  ఉపయోగపడే అద్భుతమైన సాధనం మెడిటేషన్. కాబట్టి మీరు యంగ్ గా ఉన్నపుడే మెడిటేషన్ మొదలుపెట్టండి.  జీవితాన్ని సాఫీగా గడపండి.

అపోహ 9: మెడిటేషన్ చెయ్యాలంటే పార్టీలకు వెళ్ళడం, ఫ్రెండ్స్ తో గడపడం లాంటివి మానేయ్యాలి.

నిజం: పార్టీలకు వెళ్ళడం, వెళ్లకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం. మెడిటేషన్ తో సంబంధం లేదు.

అపోహ 10: మెడిటేషన్ చేస్తే నేను రొమాంటిక్ గా ఆలోచించకూడదు, సినిమాలు చూడకూడదు.

నిజం: ఇది పూర్తిగా వ్యక్తిగతం.  మెడిటేషన్ తో సంబంధం లేదు.

మెడిటేషన్ మీద ఉన్న కొన్ని అపోహలు నిజాలు ఇవి. కాబట్టి మెడిటేషన్ మొదలు పెట్టడానికి ఇంకా ఆలస్య చెయ్యకండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది.  రోజులు గడిచాక తెలుసుకుని బాధపడేలోపే మెడిటేషన్ మొదలు పెట్టండి. మూడు నుండి ఆరు నెలలు రోజూ మెడిటేషన్ చెయ్యండి మీ జీవితంలో మార్పుని మీరే చూస్తారు.

Registration

Forgotten Password?

Loading