జుట్టు ఊడిపోవడానికి పది కారణాలు

జుట్టు ఊడిపోవడం
Share

ఆరోగ్యకరమైన అందమైన జుట్టు అందరికీ కావాలని ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు ఒక వ్యక్తి యొక్క అందాన్ని మరింత పెంచుతుంది. మన జుట్టు అందంగా ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అందుకే జుట్టుని పట్టించుకోవడం చాలా అవసరం. దానికోసమే  మనం రోజు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడతాం.

కానీ ఈ మధ్య కాలంలో కుప్పలుతెప్పలుగా హెయిర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి.  అందులో చాలావరకు ఎక్కువ జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతున్నాయి.  దాదాపు అందరికీ జుట్టు ఊడిపోవడం అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది.

ఒక సాధారణ వ్యక్తికి 100000 నుండి  150000 వెంట్రుకలు ఉంటాయి.  రోజుకి 50 నుండి 100 రాలిపోవడం మామూలు విషయమే.  మీరు తలస్నానం చేసిన తర్వాత జుట్టు దువ్వుతున్నప్పుడు కాస్త ఊడితే కంగారు పడకండి.  అది సాధారణమే. కానీ సాధారణ స్థాయిని మించి జుట్టు ఊడుతుంటే అది జుట్టు పలచబడటం,  బట్టతల రావడం ఇలాంటి వాటికి దారి తీస్తుంది.  జుట్టు ఊడుతుంది అంటే మనం అనారోగ్యకరంగా ఉన్నామని అర్థం.

జుట్టు ఊడిపోవడానికి కారణమయ్యే అనారోగ్య పరిస్థితులు ఏమిటి వాటిలో పది విషయాలు ఇప్పుడు చూద్దాం.

1. ఒత్తిడి : పాత రోజుల్లో మనుషులు చాలా ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి చాలా తక్కువ సమయంలో మనం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది.  ఎన్నో విషయాలు చూసుకోవాల్సి వస్తుంది.  దానివలన మన జీవనశైలి చాలా హడావిడిగా మారుతుంది.  ఇది ప్రధానంగా మనలో ఒత్తిడిని కలుగజేస్తుంది.  మనం ఎక్కువగా ఒత్తిడికి లోనైతే జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2. సరైన పోషకాలు అందకపోవడం : మనం తినే ఆహారంలో కావాల్సిన పోషకాలు లేకపోతే జుట్టు ఊడటం మొదలవుతుంది. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్,, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సమపాళ్ళలో కావాలి.  మనం రోజూ తినే ఆహారంలో  ఎక్కువగా జంక్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్ తో నిండి ఉంటే మనలో పోషకాహార లోపం వస్తుంది.  ఇలాంటి ఆహారం వలన జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటుంది.

3. సరైన నిద్ర లేకపోవడం : నిద్ర మన శరీరానికి కనీస అవసరం. ఆరోగ్యకరమైన జుట్టు కి సరైన నిద్ర చాలా ముఖ్యం. కనీసం రోజుకి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. కావలసినంత నిద్ర లేకపోతే లేదా పడుకున్నా సరిగా నిద్ర పట్టకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం, సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం, లేట్ నైట్ పార్టీ లకి వెళ్లడం ఇలాంటి అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల నిద్ర దూరమవుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోయి అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్సోమ్నియా వచ్చే ప్రమాదం కూడా ఉంది.

4. హానికర రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం : మనం వాడే చాలా వరకు షాంపూలు, Gels కండిషనర్స్, హెయిర్ స్ప్రే లు  మొదలైన వాటిలో హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి మన జుట్టుకి చాలా నష్టం కలిగిస్తాయి. అవి జుట్టుకే కాదు మన శరీరానికి కూడా మంచిది కాదు. కొన్నిసార్లు అవి మంచి ఫలితాలు ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతాయి

5. జుట్టు విషయంలో శుభ్రత లేకపోవడం : జుట్టు విషయంలో శుభ్రత పాటించకపోతే జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా మనం చేసే తప్పులు

1. తరచూ జుట్టుని శుభ్రం చేయకపోవడం

2. దువ్వెన ని శుభ్రం చేయకపోవడం.

3. సెలూన్ మరియు బ్యూటీ పార్లర్ లో వేరే వాళ్ళు వాడిన దువ్వెన వాడడం.

6. విటమిన్లు మినరల్స్ అందకపోవడం : మన శరీరాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మన శరీరానికి A, B complex, C,D, E మొదలైన విటమిన్లు కావాలి. ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ B మరియు విటమిన్ D లోపంతో బాధపడుతున్నారు. మన శరీరంలో విటమిన్ లోపం ఉంటే జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  మీకు ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అంటే  మీ విటమిన్ లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేయించుకోండి.

7. మందులు : కొన్ని ఆరోగ్య సమస్యలకి మనం వాడే మందులు వలన జుట్టు ఊడి పోయే అవకాశం ఉంటుంది. మందులకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.  చాలా మందులకి సాధారణంగా సైడ్ ఎఫెక్ట్ జుట్టు ఊడిపోవడం అవుతుంది, దీన్ని ఎలా తగ్గించాలి అని  మీ డాక్టర్ ని సంప్రదించండి.

8. ఆరోగ్య సమస్యలు : అనీమియా, థైరాయిడ్, డయాబెటిస్, పిసిఓడి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు జుట్టు ఊడిపోతుంది. ఇవి మొత్తం మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. ఎక్కువగా జుట్టు మీద చూపిస్తాయి. ఎక్కువ మొత్తంలో జుట్టు ఊడిపోతుంది అంటే వీటిలో ఏదైనా సమస్య అయి ఉండవచ్చు. కాబట్టి మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే టెస్ట్ చేయించుకోండి.

9. త్వరగా వయసు అయిపోవడం : కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరానికి వయసు పెరిగిపోతుంది. వయసు పెరగడం అనేది చాలా సాధారణ విషయం. త్వరగా వయసు అయిపోతుంటే దాని వలన జుట్టు ఊడిపోతుంది. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవన విధానం ఎక్కువగా పంచదార తీసుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, కావలసినంత సూర్యరశ్మిలో గడప కపోవడం త్వరగా వయసు పెరగడానికి కారణమవుతాయి.

10. రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చడం : మన చుట్టూ ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ మారుతూ ఉంటాయి. కొత్తది వచ్చిన ప్రతిసారి ట్రై చేయడం బాగుంటుంది.  రకరకాల రంగులు వేయడం ఇవి చూడటానికి బాగుంటాయి కానీ ఆ రంగుల వల్ల, జుట్టు వేడి చేయడం వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది.

జుట్టు జుట్టు ఊడిపోవడానికి కారణమయ్యే 10 ప్రధాన విషయాలు ఇవి.

మనందరికీ కి ఇవే కారణాలు ఉండకపోవచ్చు, లేదా ఇవన్నీ ఉండవచ్చు. ఏదేమైనా  జుట్టు ఊడిపోవడానికి ఈ పది కారణాలు చాలు. వీటిని పట్టించుకోకుండా ఉండలేము.  కనీసం వీటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, ఎప్పుడూ ఒక మ్యాజిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎలాంటి  మ్యాజిక్ జుట్టు రాలడాన్ని  ఆపలేదు.  అది మన చేతుల్లోనే ఉంది.

ఆరోగ్యకరమైన జుట్టు ఉండడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి. మనం తినే ఆహారం, మనం నిద్రపోయే సమయం, ఒత్తిడిని తగ్గించుకోవడం, యోగా లేదా మెడిటేషన్ చేయడం ఇలాంటి వాటి వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు రాలడం అనే సమస్య తగ్గుతుంది. వీటితో మన జీవనశైలి మెరుగవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని కలిగి ఉండటం చాలా చిన్న చిన్న పనుల వల్ల జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని ఈ క్షణం నుండే అలవాటు చేసుకోండి.

Registration

Forgotten Password?

Loading