విమర్శని ఒప్పుకోలేకపోవచ్చు, కానీ అవసరం. విమర్శ బాధ కలిగించే విధంగా ఉంటుంది. కానీ మనం పట్టించుకోవాల్సిన వాటి మీద శ్రద్ధ పెట్టే విధంగా చేస్తుంది. -విన్ స్టన్ చర్చిల్
కొన్నిసార్లు ఏదైనా పని కోసం మనం చాలా కష్టపడతాం. మన ప్రాణం పెట్టి పని చేస్తాం. ఒక బుక్ రాయడం, సినిమా తియ్యడం, లేదా మరేదైనా. కొన్ని నెలలు, సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం. మనం చేయాల్సిందంతా చేస్తాం. మనం చాలా బాగా చేశామని ఆత్మవిశ్వాసంతో ఉంటాం. అలాంటి సమయంలో కొన్ని సార్లు మనం ఊహించని విమర్శలు రావచ్చు. చెడ్డ రివ్యూస్, ఆలోచన లేని కామెంట్లు, నెగిటివ్ ఫీడ్ బ్యాక్, ట్రోల్స్ మొదలైనవి రావచ్చు. వాటిలో కొన్ని విమర్శలు నిజం కూడా కావచ్చు. విమర్శ ఎలాంటిదైనా బాధ కలిగిస్తుంది.
ప్రపంచంలో ఎంతో సాధించిన చాలామంది వ్యక్తులు తమ జీవితంలో ఏదో ఒకసారి విమర్శలు ఎదుర్కొన్న వారే. వారు పొందిన విమర్శ నుండి పాఠాలు నేర్చుకుని వారు సాధించిన విజయాలతో విమర్శకుల నోళ్లు మూయించారు. అందరికన్నా గొప్పవాడైన దేవుడు కూడా విమర్శల్ని పొందినవాడే.
అసలు ఎప్పుడూ విమర్శలు పొందని వారు మీకు ఎవరైనా తెలుసా ? కేవలం ఏది కొత్తగా చేయడానికి ప్రయత్నించండి వారు మాత్రమే విమర్శలు పొందరు. తమ ఇష్టాలని, లక్ష్యాలని వదిలేసి సాదాసీదా జీవితం గడిపేవారు విమర్శల నుంచి దూరంగా ఉంటారు. మీ మనసుకు నచ్చింది చేసి మీ జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే విమర్శలు పొందడం చాలా సాధారణ విషయం.
కానీ ఆ విమర్శల వల్ల వచ్చే ఆ బాధను ఎక్కువ కాలం మనతోపాటు ఉంచుకుని ఉండడంవల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం విమర్శల్ని సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే అది మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ . దానివల్ల కొత్తగా ఏదైనా చేయడానికి భయపడతాం. మన ఎదుగుదలని ఆపుతుంది కాబట్టి విమర్శని ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి.
విమర్శల్ని ఎదుర్కోవడం ఎలా ? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.
1. మౌనంగా ఉండండి : మన మీద విమర్శలు వచ్చినపుడు కోపం రావడం, బాధగా ఉండటం సాధారణం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండి బాగా ఆలోచించడానికి మీ మైండ్ కి కాస్త సమయం ఇవ్వండి. ఒక వ్యక్తికి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించడం చాలా కష్టమవుతుంది. సింపుల్ మెడిటేషన్ చేయొచ్చు లేదా గట్టిగా శ్వాస తీసుకోవచ్చు లేదా నేచర్ లో నడిచి ప్రశాంతంగా మౌనంగా ఉండండి.
2. లక్ష్యం కలిగి ఉండండి : మీ బావోద్వేగాలను నెమ్మది పరచుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మీద వచ్చిన విమర్శల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది నిష్పక్షపాతంగా ఆలోచించండి. మిమ్మల్ని విమర్శించిన వ్యక్తి స్థానం లోకి వెళ్లి ఆలోచించండి.
3. విమర్శ ని వ్యక్తిగతంగా తీసుకోకండి: విమర్శ అనేది మీ పని మీద మాత్రమే. మీ మీద కాదు. మీకు మీ పని కి మధ్య సన్నని గీత ఉంటుంది. మీ పని మీ జీవితంలో ఒక భాగం మాత్రమే అదే మీరు కాదు. మీరు చేసే పని కన్నా మీరు చాలా పెద్దవారు. కాబట్టి ఎవరైనా మీ పనిని విమర్శించినప్పుడు ఆ విమర్శ మీ పనిని మాత్రమే, మిమ్మల్ని కాదు. విమర్శని ఎప్పుడు వ్యక్తిగతంగా తీసుకోకండి.
4. నిజం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి: మీ మీద వచ్చిన విమర్శల్లో ఏదైనా నిజం ఉందేమో పక్షపాతం లేకుండా ఆలోచించండి. సాధారణంగా మనం చేసిన పని అని సమర్థించుకోవడం జరుగుతుంది. ఇలా ఒక విమర్శ వచ్చినప్పుడు నిజంగా అందులో తప్పు ఉందేమో ఆలోచించే అవకాశం వచ్చినట్లు. కాబట్టి ఏదైనా విమర్శ వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా నిజమేంటో ఆలోచించండి.
5. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి: మన మీద ఏదైనా విమర్శ వచ్చినప్పుడు మనల్ని మనం సమర్థించుకోవడం సర్వసాధారణం. కానీ అలా చేస్తే విమర్శని మన ఎదుగుదలకి వాడే అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం వద్దు.
6. విమర్శని మీ ఎదుగుదలకి వాడుకోండి : మీ పనిని మరింత మెరుగు పరుచుకోవడానికి విమర్శని వాడండి. మీరు మరింత మంచి వ్యక్తిగా మారడానికి విమర్శ పనికొస్తుంది. విమర్శ వల్ల మీ ఆత్మ విశ్వాసం తగ్గనివ్వకండి. మీ పనిని మరింత మెరుగు పరుచుకోవడానికి విమర్శ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ మీద నిజంగా సద్విమర్శ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలపండి.
7. సీరియస్ గా తీసుకోకండి : మీ మీద వచ్చిన ప్రతి విమర్శని సీరియస్ గా తీసుకోకండి. విమర్శించడం చాలా తేలిక. ఎవరైనా మిమ్మల్ని విమర్శించవచ్చు. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు వారు గతంలో ఏం చేశారో ఆలోచించండి. ఆ విమర్శ చేసిన వ్యక్తికి మీరు చేసే పనిలో నిజంగా జ్ఞానం ఉందో లేదో తెలుసుకుని అతను చేసే విమర్శకి విలువ ఇవ్వండి.
8. మీ విషయంలో ఎక్కువ కఠినంగా ఉండకండి : జీవితంలో తప్పులు చేయడం, విమర్శలకు గురి కావడం చాలా సాధారణం. కాబట్టి మీ విషయంలో మరీ కఠినంగా ఉండకండి. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదని, తప్పులు జీవితంలో ఒక భాగం అని అర్థం చేసుకోండి. మీరు చేసిన తప్పు నుండి పాఠాలు నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం కన్నా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం తెలివైన పని.
9. పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి : కొంతమంది మీరు ఒప్పుకోలేనంతగా విమర్శిస్తారు. అలాంటివాటికి బాధపడకండి. అది కేవలం వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అలాంటివారిని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి.
10. సెలబ్రేట్ చేసుకోండి : ఇది కొంచెం అతిగా అనిపించవచ్చు. కానీ ఎవరైతే గణనీయమైన విజయాలు సాధించగలరో వాళ్ళకే విమర్శలు వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా విమర్శకు గురైతే మీరు ఏదో సాధించబోతున్నారని అర్థం. అంతేకాకుండా విమర్శ వల్ల మీరు మరింత గొప్పగా పనిచేస్తారు.
విమర్శలు ఎదుర్కోవడానికి ఇవి కొన్ని సూచనలు.
విమర్శలు వచ్చిన ప్రతిసారి అరిస్టాటిల్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. ‘ ఏమీ మాట్లాడుకుండా, ఏమీ చెయ్యకుండా, అసలు మనం ఏం కాకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం విమర్శను తప్పించుకోగలము’ . కాబట్టి మీకు విమర్శలు రాకుండా ఉండాలంటే ఏమీ మాట్లాడకూడదు, చెయ్యకూడదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మరియు గర్వపడండి.
మీకు వచ్చిన విమర్శల్ని సెలబ్రేట్ చేసుకోవడం మీరు ఎదగడానికి ఇంధనం లాగా పనిచేస్తుంది. కాబట్టి విమర్శల్ని మెట్లగా చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగండి.
మనం చేసే పనుల మీద ఫీడ్ బ్యాక్ ఇస్తూ మన ఎదుగుదలకి సహాయపడే వ్యక్తులు మనకి కావాలి. – బిల్ గేట్స్