మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాసని ఎప్పుడైనా గమనించారా ? సాధారణంగా మనం కోపంగా ఉన్నప్పుడు లేదా బాధగా ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకుంటాం. మన ఎమోషన్స్ కి మన శ్వాస కి చాలా సంబంధం ఉంది. శ్వాస మన ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తుంది. మన శ్వాసని మనం అదుపు చేయగలిగితే మన ఎమోషన్స్ ని కూడా అదుపు చేయగలం. వేదశాస్త్రమైన ప్రాణాయామం మనకి ఇదే నేర్పుతుంది.
ప్రాణాయామం ఒక సంస్కృత పదం. ఇది రెండు పదాల సమ్మేళనం. ప్రాణ మరియు ఆయమ. ప్రాణ అంటే జీవం. ఆయమ అంటే నియంత్రించడం. ఈ మొత్తం విశ్వమే ప్రాణంతో నిండి ఉంది. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాము అంటే దాని అర్థం ప్రాణాన్ని తీసుకుంటున్నాం అని. ప్రాణమే మనకు జీవం ఉండేలా చేస్తుంది. ఆయమ అంటే ఈ ప్రాణాన్ని మన అవసరానికి తగినట్టు వాడుకోవడం అని అర్థం. కాబట్టి ప్రాణాయామ అంటే మనం అనుకున్నది సాధించడానికి శ్వాసని వాడుకునే శాస్త్రం.
కపాలభాతి, అనులోమం, విలోమం, భస్త్రిక ఇలా చాలా రకాల ప్రాణాయామాలు మన వేదశాస్త్రంలో ఉన్నాయి. ఒక్కోదానికి ఒక ఉపయోగం ఉంది. కొన్ని జీర్ణ వ్యవస్థ మీద, కొన్ని శ్వాస వ్యవస్థ, మీద ఇలా పనిచేస్తాయి.
ఏ ప్రాణాయామ చేసినా ఈ క్రింద తెలిపిన ప్రయోజనాలు ఉంటాయి.
1. ఒత్తిడిని తగ్గిస్తుంది : ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి అనేక రకాల రోగాలకి మరియు రిలేషన్ షిప్ లో సమస్యలకు కారణం అవుతుంది . ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి నుండి తప్పించుకోవడం ఎవరివల్లా కాదు. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రాణాయామం చాలా సహాయపడుతుంది.
2. ఎమోషన్స్ మీద అదుపు వస్తుంది : కొన్నిసార్లు మన ఎమోషన్స్ మీద అదుపు లేకుండా పరిస్థితులకు ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటాము. దీని వల్లనే చాలామందిలో నెగిటివ్ ఎమోషన్స్, చిరాకు తెప్పించే ప్రవర్తన మనం చూస్తూ ఉంటాము. తరచూ ప్రాణాయామం చేయడం వల్ల మన ఎమోషన్స్ మీద మనకి అదుపు వస్తుంది. మన ఎమోషన్స్ ని పక్కనపెట్టి ఏ సందర్భంలో అయినా లాజికల్ గా ఆలోచించే శక్తి మనకి వస్తుంది.
3. నెగిటివ్ ఎమోషన్స్ నుండి బయటపడడానికి సహాయపడుతుంది : కొన్నిసార్లు కోపం, విషాదం, అసూయ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ చాలా గాఢంగా ఉండవచ్చు. మనం ఈ నెగటివ్ ఎమోషన్స్ తో ఉంటే మన ప్రశాంతత పోతుంది. ప్రాణాయామం చేస్తే ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ కి గురైనప్పుడు చాలా త్వరగా వీటి నుండి బయటపడగలరు.
4. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : మన శరీరంలో ఉండే ఒత్తిడి మరియు నెగటివ్ ఎమోషన్స్ వెళ్లిపోతాయి కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. ఈ ఆధునిక జీవితంలో వచ్చే చాలా సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. కాబట్టి తరచూ ప్రాణాయామం చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం.
5. మెడిటేషన్ అనుభూతిని మెరుగుపరుస్తుంది : మెడిటేషన్ అంటే మనలోకి మనం చేసే ఒక నిశ్శబ్ద ప్రయాణం. ఇది మన ఎమోషన్స్ ని అదుపు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మన ఎమోషన్స్ మన ఆధీనంలో లేకపోతే మన లోపల ఉన్న ఆ నిశ్శబ్దానికి ప్రయాణం చేయడం చాలా కష్టం. కాబట్టి మెడిటేషన్ చేసే ముందు మన ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవడానికి ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ చేసే ముందు ప్రాణాయామం చేస్తే మెడిటేషన్ యొక్క లోతైన అనుభూతికి మనం లోనవుతాం. చాలా తేలికగా మెడిటేషన్ చేయగలుగుతాం.
కాబట్టి మన రోజువారీ జీవితంలో ప్రాణాయామం ఎలా సాధన చేయాలి? ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం.
1. ప్రాణాయామం చేసేటపుడు మీరు ఖచ్చితంగా ఖాళీ కడుపుతో ఉండాలి. మీరు భోజనం చేసిన తర్వాత ప్రాణాయామం చేయడానికి కనీసం రెండు గంటలు వ్యవధి ఉండేలా చూసుకోండి.
2. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో ప్రాణాయామం చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో ప్రాణాయామం చేయండి.
3. మెడిటేషన్ చేసే ముందు ప్రాణాయామం చేసి మీ ఆలోచనలని ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోండి.
ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. సౌకర్యవంతంగా కూర్చోండి.
2. మీ నాలుకతో మీ నోటి పైభాగాన్ని టచ్ చేయండి. దీనిని ఖేచరీ ముద్ర అంటారు. దీని వలన మన శరీరంలోనికి ఎక్కువ ప్రాణం వెళుతుంది.
3. ఇప్పుడు పూర్తిగా గాలిని బయటికి వదలండి. మీరు గాలి బయటికి వదులుతున్నప్పుడు మీ పొట్ట ఒక నొక్కిన బుడగల లోపలికి వెళ్లాలి.
4. అలా ఒక సెకండ్ ఉండండి. గాలి పీల్చకుండా వదలకుండా అలానే ఉండాలి.
5. ఇప్పుడు పూర్తిగా గాలిని లోపలికి తీసుకోండి. మీరు గాలి పీల్చుకున్నప్పుడు మీ పొట్ట బుడగల బయటకి రావాలి.
6. ఒక సెకండ్ అలాగే ఉండండి
7. గాలి తీసుకొని మళ్లీ వదిలి ఇలా 7 నుండి 9 రౌండ్స్ చేయండి.
ప్రాణాయామం రోజుకి 3 నుండి 4 సార్లు చేయవచ్చు. ప్రాణాయామం చేసేటపుడు మీరు ఖాళీ కడుపుతో ఉండేలా చూసుకోండి చాలు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, గాఢమైన ఎమోషన్స్ ఉన్నప్పుడు పైన చెప్పిన విధంగా ప్రాణాయామం చేయవచ్చు. ఇలా మీరు 9 రౌండ్స్ ప్రాణాయామం పూర్తి చేసేసరికి మీరు అద్భుతమైన ఉపశమనం పొందుతారు.
మీ రోజువారీ జీవితంలో ఎలాంటి సందర్భాల్లో ప్రాణాయామం చేసి అధ్బుతమైన ఫలితాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే ముందు ప్రాణాయామం చేయండి. తినేముందు ప్రాణాయామం చేయడం వల్ల మీరు ఎంత తింటున్నారో స్పృహతో ఉంటారు. దాని వలన మీ శరీరానికి కావలసినంత మాత్రమే తింటారు. మీ శరీరంలో ప్రాణం నిండి ఉన్నప్పుడు మీరు అవసరానికి మించి ఎక్కువ తినలేరు. దీనివలన మీ బరువు ఆరోగ్యకరంగా ఉంటుంది.
2. పడుకునే ముందు ప్రాణాయామం చేయండి. దీనివలన ప్రశాంతమైన స్థితిలో మీరు నిద్రకి వెళ్తారు.
3. ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేయండి. ఇలా చేసి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి.
4. మీకు ఇంటర్వ్యూ లేదా ఏదైనా పరీక్ష ఉన్నప్పుడు టెన్షన్ పడడం, ఆందోళన పడటం సాధారణం. అలాంటి సమయంలో ప్రాణాయామం చేయండి. ఇలాంటి సమయంలో ప్రశాంతమైన మైండ్ ఉండడం, అప్పటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
5. ఎవరైనా మీకు కోపం తెప్పించినపుడు అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడం కంటే బ్రేక్ తీసుకుని ప్రాణాయామం చేయండి. ఈ ఒక్క పని చేయడం వల్ల మీరు తర్వాత బాధ పడే విధంగా ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. ప్రశాంతంగా ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడండి.
6. మీరు AC ఉన్న ఆఫీసులో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోండి. బయటకు వెళ్లి ప్రాణాయామం చేసి మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి.
ప్రాణాయామం ద్వారా రీచార్జ్ చేసుకోవడానికి ఇవి కొన్ని మార్గాలు.
ప్రాణాయామంలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని ముద్రలు మరియు బంధాలు ప్రాణాయామానికి కలిపి చేస్తారు. ఇవి యోగా టీచర్ పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగించేది ప్రాణాయామం. మన మానసిక స్థితి మనం తీసుకునే శ్వాస యొక్క గాఢత మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గాఢమైన శ్వాసని మెల్లగా తీసుకోండి.
ప్రాణాయామం గురించి మరింత తెలుసు కోవడానికి ఈ పుస్తకం చదవండి.