లక్ష్యాన్ని కలిగి ఉండటంలో కలిగే లాభ నష్టాలు :

The pros and cons of having a goal:
Share

చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదోక లక్ష్యం ఉండాలని అందరూ చెబుతుంటారు. ఈ లక్ష్యం మనల్ని ముందుకు సాగడానికి,మనం కష్టపడి పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మనం పెట్టుకున్న లక్ష్యమే ఒక్కొక్కసారి మన విధినీ నిర్ణయిస్తుంది. అయితే, లక్ష్యాలు ఎంత మంచివి అయినా వాస్తవికతకు దూరంగా ఉన్నప్పుడు అంత ఇబ్బందిని కలిగిస్తాయి.

లక్ష్యం కలిగి ఉండటం వలన కలిగే లాభనష్టాలను ఒకసారి చర్చిద్దాం.

లాభాలు :
లక్ష్యాలు మనకి ఒక దిశని నిర్దేశిస్తాయి :
లక్ష్యాలు మనకి చీకటి రాత్రిలో దారి చూపించే టార్చ్‌లైట్ లాంటివి. అవి మనకి దిశానిర్దేశం చేస్తూ మనం పని మీద దృష్టి సారించేలా మనకి సహాయపడతాయి. మనం మన జీవితంలో అనేక విషయాలను సాధించాలనుకుంటాం ఆ క్రమంలో ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం గాడి తప్పి పరధ్యానంలో పడే అవకాశం లేదా దూరంగా వెళ్లే అవకాశం ఉంది. లక్ష్యం మన మనస్సులో బాగా నాటుకుపోయినట్లయితే, మనం ఊహించిన రీతిలోనే చేరాల్సిన చోటికి చేరుకుంటాము. అందువల్ల, ముందుకు సాగడానికి, మనకు బాగా ప్రణాళికాబద్ధమైన మరియు బాగా నిర్ణయించబడిన దిశ అవసరం. అందుకోసం ఒక లక్ష్యం మనకు ఆ దిశను చూపించి ప్రయాణాన్ని సులభం చేస్తుంది.

లక్ష్యాలు మనల్ని అప్టిమిస్టిక్ గా ఉంచుతాయి :

కొన్ని సార్లు ఏది ఫలించనట్టు , అన్నీ కళ్ళ ముందే కుప్పకూలి పోతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలోనే, మనకున్న అంతిమ లక్ష్యం మనల్ని కుంగిపోకుండా చూస్తూ మనకి కాస్త భరోసా ఇచ్చి ముందుకు సాగాలనే ప్రేరణను ఇస్తుంది. హెచ్చు తగ్గులు అనివార్యమని మరియు మన జీవితంలో మన అంతిమ లక్ష్యాన్ని సాధించడం గురించి మాత్రమే శ్రద్ధ వహించాలని మనం అర్థం చేసుకోవాలి. లక్ష్యాలు మనలో ఆశావాదం పెంచి మనం కాస్త తెలివిగా వ్యవహరించేలా చేస్తాయి. దానివలన ఎన్ని సవాళ్లు ఎదురయిన మన ప్రయాణం ఆగకుండా ఉండేందుకు లక్ష్యం దోహదపడుతుంది.

లక్ష్యాలు మనకు సంతోషాన్ని మరియు సంతృప్తిని ఇస్తాయి

అదనపు డబ్బు సంపాదించడం లేదా మనం కలలు కన్న ఇంటి కోసం పొదుపు చేయడం లేదా మీరు కలలుగన్న ప్రమోషన్‌ను పొందడం లాంటివి ఏదైనా సాధించినప్పుడు మనం ఆనందాన్ని పొందుతాము, కదా? అప్పటివరకు మనం పడ్డ శ్రమ అంతా వృధా కాలేదు అనిపిస్తుంది. ఇది మనకు సంతోషాన్ని మరియు సంతృప్తినీ కలిగిస్తాయి, చివరకు మనం కోరుకున్నది సాధించినట్లు అనిపిస్తుంది. లక్ష్యం పెట్టుకునే దగ్గర నుండి దాని కోసం పని చెయ్యటం చివరకు దానిని సాధించడం వరకు ఒక పని పూర్తవుతుంది.

నష్టాలు :

అవాస్తవిక లక్ష్యాలు మనo చేతకానివారo అనే భావనను కలిగిస్తాయి :

చాలా తరచుగా, మనం త్వరగా ప్రేరణ పొందుతాము దానితో మనం అవాస్తవిక లక్ష్యాలను పెట్టుకొంటాము. ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, మనమందరం వేరు వేరు పరిస్థితులను ఎదుర్కుంటూ ఉంటాము, మనలో ప్రతి ఒక్కరికి మన స్వంత సవాళ్లు ఉన్నాయి. మనం ఇతరుల నుండి ప్రేరణ పొందడం మంచిదే అయినప్పటికీ, ఈ లక్ష్యాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. అవాస్తవిక లక్ష్యాలు పెట్టుకోవటం వల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది.

జీవితం యొక్క సహజ లయ యాంత్రికమైంది :

జీవితానికి సహజమైన ఫ్లో ఉంది, కొత్త పరిస్థితులు, కొత్త వ్యక్తులు, ఎత్తులు మరియు పల్లాలు అన్నీ అందులో భాగమే. కొన్నిసార్లు దానిలోని ప్రతి బిట్‌ను ప్లాన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. లక్ష్యాలు గొప్పవి, కానీ మీ జీవితంలోని ప్రతి బిట్ ఒక లక్ష్యంతో ముడిపడి ఉంటే, మనం జీవితాన్ని ఆనందించటం కష్టం, జీవితంలో మనకు లభించే ఆశ్చర్యాలను అందుకోవటం కూడా సాధ్యం కాదు. అందువలన జీవితంలోని ప్రతి బిట్‌ను ప్లానర్‌లో పెట్టలేo పట్టు విడుపులతో ముందుకి సాగితేనే మనం ఆనందంగా గడపగలం.

ఒకేసారి చాలా లక్ష్యాలను పెట్టుకోవద్దు :

ఒక సమయంలో ఒకపనినే పూర్తి చెయ్యగలం. అలా కాకుండా ఒకేసారి 10 పనులను పూర్తి చెయ్యాలని ప్రయత్నించడం వ్యర్థం. అలా చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి అనుకుని చెయ్యటం మంచిది. లక్ష్యాలు కూడా అలాంటివే, సమయానుసారంగా లక్ష్యాలను మార్చుకుంటూ వెళ్ళడం లేదా ఒకేసారి పది పెట్టుకోవటం అంత మంచిపని కాదు. మన బలాలు మరియు బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి మరియు ఒక నిర్దిష్ట సమయంలో మనం ఎంత చేయగలం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. అంతే కానీ ఒకేసారి చాలా ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉండటం వలన మరింత ఒత్తిడి కలుగుతుంది.

ముగింపు :
మనం తరచుగా పిల్లలను వారి లక్ష్యం ఏమిటని అడుగుతాo, తద్వారా పిల్లలు పెద్దయ్యాక వారు ఏమి ఇష్టపడతారు మరియు వారు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచిస్తాo. దానికంటే ముందు అసలు పిల్లలకి లక్ష్యం అంటే ఏంటో తెలియాలి లేదంటే మనం అడిగే ప్రశ్న వాళ్ళని ఒత్తిడికి గురి చేసే ప్రమాదం ఉంది. పెద్దవాళ్ళ విషయంలోనూ ఇంతే. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులు , అవసరాలు ఉంటాయి. తమ తమ లైఫ్స్టైల్ కి అనుగుణంగా మాత్రమే వారు లక్ష్యాలను పెట్టుకోవాలి. సరైన లక్ష్యం కలిగి ఉండటం వరమైతే లేకపోవటం శాపం కావచ్చు. అందువలన తెలివిగా ఎన్నుకోండి, తెలివిగా ఆలోచించండి మరియు తదనుగుణంగా వ్యవహరించండి.

Registration

Forgotten Password?

Loading