ఈరోజుల్లో మెడిటేషన్ ఎందుకు అంత ముఖ్యం అయ్యింది ?

ఈరోజుల్లో మెడిటేషన్
Share

కరోనా వైరస్ – కంటికి కనిపించని ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. ఒక గొప్ప రైటర్ కూడా ఊహించలేని ఇలాంటి పరిస్థితులను సృష్టించింది. మన జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. కొన్ని నెలల వరకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. న్యూస్ చానల్స్ లో, సోషల్ మీడియాలో చాలా భయాన్ని, ఆందోళనను చూస్తున్నాం.

ఈ అత్యవసర లాక్ డౌన్ కొన్ని సమస్యలకు దారితీస్తుంది.  పనిమనిషి లేకపోవడం, ఇంటిదగ్గర సమయం వృధాగా పోవడం, ఇంటి నుండి పని చెయ్యడం, ఫ్రెండ్స్ ని కలవడానికి వీలు లేక పోవడం, సినిమాలు, పార్కులు లేకపోవడం, ఆర్థికంగా కలిగే నష్టాలు మొదలైనవి. ప్రతిరోజు ఇంట్లో ఉండడం నిజంగా పెద్ద చాలెంజ్. ఇలాంటి పరిస్థితులు ఒత్తిడిని, భయాన్ని, ఆందోళనను, నిరాశను కలిగిస్తాయి.

ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించడం తప్ప మనం ఇంకేమీ చేయలేము. పరిస్థితి మన చేతిలో లేదు. ఈ పరిస్థితుల్ని మనం ఇలానే దాటాలి. నిన్న కరోనా వైరస్,  రాబోయే రోజుల్లో మనం అదుపు చేయలేనిది ఇంకోటి ఏదో రావచ్చు.  అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది చాలా ముఖ్యం.

ఒక సమస్య కి మనం ఎలా స్పందిస్తాం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు ఒత్తిడికి లోనవ్వడం లేదా ప్రశాంతంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది. అలాంటి సమయాల్లో భయపడకుండా, నిశ్శబ్దంగా, ధైర్యంగా ఉండటం సాధ్యమేనా.  ప్రశాంతంగా మానసికంగా దృఢంగా ఉండడంతో అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలమా? అవును మెడిటేషన్ తో అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకి అందుబాటులో ఉన్న అద్భుతమైన సాధనం మెడిటేషన్. అన్ని మతాలలో రకరకాల పద్ధతుల్లో మెడిటేషన్  చెప్పారు.  కానీ మెడిటేషన్ ఏ మతానికి సంబంధించింది కాదు.  సూర్యరశ్మి లాగా, భూమి లాగా, నీరు లాగా మెడిటేషన్ కూడా అందరి కోసం ఉన్నది. మెడిటేషన్ అనేది మానవాళికి ఒక అద్భుతమైన బహుమతి.

మెడిటేషన్ చూసిన కొంతమంది అది చేయడం కష్టం అనుకుంటారు.  ఎక్కువగా ఆలోచించడం వల్ల వాళ్ళు మెడిటేషన్ చేయలేరు  అనుకుంటారు. విరామం లేని తమ ఆలోచనలు మెడిటేషన్ చేయకుండా తమని ఆపుతున్నాయి అనుకుంటారు.  ఇది నిజం కాదు.  మెడిటేషన్ చాలా సులువు మరియు చాలా సరదాగా ఉంటుంది.  ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో వాళ్లకి మరీ ముఖ్యం.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వీటన్నిటి ఉద్దేశం ఒక్కటే ఆలోచనల్ని భావోద్వేగాలను అదుపులో ఉంచడం.  చేసే పద్ధతి వేరైనా వీటి ఉద్దేశం మాత్రం ఒకటే.   కాబట్టి మీకు నచ్చిన దేనినైనా ఎంచుకోండి.

క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం.

1. మెడిటేషన్ చేయడం వల్ల మన భావోద్వేగాల మీద అదుపు వస్తుంది. కరోనా లాంటి సమయాల్లో మనం చాలా సులువుగా భావోద్వేగాలకు లోనవుతాము. ఆందోళన, భయం, నిరాశ మన చుట్టూ ఉంటాయి. ఇలాంటి భావోద్వేగాల వల్ల కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడుపుతాం. క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక శక్తి మనకి వస్తుంది. భయం ఆందోళన కోపం నిరాశ ఇలాంటి భావోద్వేగాల నుంచి బయటపడటానికి మెడిటేషన్ సహాయపడుతుంది. ఇలాంటి సమయాల్లో నిస్సహాయంగా కనిపించకుండా ఉండటానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. భావోద్వేగాల మీద అదుపు ఉండడం అనేది అద్భుతమైన స్వేచ్ఛ.

2. మెడిటేషన్ మన ఆలోచనా విధానానికి పదును పెడుతుంది. మనకి బలమైన మైండ్ ఉన్నప్పుడు కఠిన పరిస్థితులలో దృఢంగా నిలబడడానికి సమస్యలకి పరిష్కారం వెతికే శక్తిని ఇస్తుంది. పదునైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి మాత్రమే తన భావోద్వేగాల మీద అదుపు తెచ్చుకుని ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించగలరు.

3. మెడిటేషన్ లేదా మెడిటేషన్ తో పాటు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయొచ్చు. బ్రీతింగ్ వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలు మన వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. మన ఆలోచనలకు మన భావోద్వేగాలకి మన శరీరం ప్రతిస్పందిస్తుంది. మనం సానుకూల ఆలోచనలతో నిండి ఉన్న ప్పుడు మన శరీరం  కూడా పాజిటివ్ గా స్పందిస్తుంది. కరోనా వైరస్ లాంటి సమయాల్లో దృఢమైన రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది. అది ఒక కవచంలా మనకి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది.

4. ఇప్పటికే ఈ ఆధునిక జీవితం ఒత్తిడితో నిండిపోయింది. కరోనా వైరస్ లాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ ఒత్తిడిని సృష్టిస్తాయి. ఇంత ఎక్కువ ఒత్తిడిని తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టం. మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం వస్తుంది. దానితోపాటు ఒత్తిడిని తట్టుకోవడానికి కావాల్సిన మానసిక శక్తిని ఇస్తుంది. ఒక రోజులో కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేసిన అది అది మనకు ఎదురయ్యే ఎన్నో పరిస్థితుల్ని తట్టుకునే శక్తి ఇస్తుంది.

5. ఇలాంటి పరిస్థితుల్లో ఓపిక తక్కువ ఉండడం ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల మన కుటుంబ సభ్యులతో మన రిలేషన్ కూడా ప్రభావితం అవుతుంది. మెడిటేషన్ మన ఓపికని పెంచి మన రిలేషన్ షిప్స్ బావుండేలా చేస్తుంది. మనం మరింత మంచి భర్తగా, భార్యగా,  తల్లిదండ్రులుగా మారతాం.

6. బయట ప్రపంచంలో మనం అదుపు చేయలేని అటువంటి ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి అవన్నీ మన మైండ్లో ఒక ఒత్తిడిని సృష్టిస్తాయి. ఇలాంటి సమయంలో ఆలోచనల్లో స్పష్టత ఉండడం చాలా అవసరం. మెడిటేషన్ మన ఆలోచనలు ఒక స్పష్టత తీసుకొస్తుంది.

7. మరీ ముఖ్యంగా మెడిటేషన్ మనకి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మనందరికీ కావాల్సింది ఆ ప్రశాంతత. ఎలాంటి బాధలు లేకుండా, రేపటి గురించి ఆలోచించకుండా నిద్ర పట్టడం అనేది గొప్ప వరం. మెడిటేషన్ వల్ల అది సాధ్యపడుతుంది.

8. క్రమం మెడిటేషన్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇవే. ఇలాంటి సమయాల్లో మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి పరిస్థితుల కోసం మనం ఎలా సిద్ధపడి ఉండాలో ఈ కరోనా వైరస్ మనకు నేర్పింది. కొన్ని పరిస్థితులు మనం అదుపు చేయలేం అని నేర్పింది. భవిష్యత్తులో ఏమొస్తుందో మనం చెప్పలేం మనం చేయగలిగింది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా సిద్ధపడడమే.

ప్రతిరోజు మెడిటేషన్ చేస్తే మనం దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఏదైనా ఒక కష్టం ఎదురైనప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం, ఏం చేస్తాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సరైనది ఎంచుకునే విధంగా మెడిటేషన్ మనల్ని సిద్ధం చేస్తుంది.

రోజూ మెడిటేషన్ చేయండి మరింత దృఢంగా మారండి.

Registration

Forgotten Password?

Loading